Telangana Assembly Constituency: TS Election 2023: ఆనాడు 'ఓటుకు నోటు' అనే మాటే లేదు!!
Sakshi News home page

Elections : ఆనాడు 'ఓటుకు నోటు' అనే మాటే లేదు!

Published Sat, Sep 23 2023 12:48 PM | Last Updated on Sat, Sep 23 2023 1:24 PM

Electoral Reforms are required to save the democracy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల ఖర్చు ఏ మేరకు ఉండాలి, పరిమితిని ఎలా విధించాలి, అనే అంశంపై ఎన్నో ఏళ్ళుగా చర్చ నడుస్తోంది. ఈ దిశగా అభిప్రాయాలు చెప్పండంటూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు గతంలో లేఖ కూడా రాసింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో గరిష్ఠ వ్యయ పరిమితిపై పార్టీలు సలహాలు, సూచనలు ఇవ్వాల్సి వుంది. ప్రస్తుతం అభ్యర్థులు పెట్టే ఖర్చుపై పరిమితి ఉంది. దీన్ని పునఃపరిశీలించే విధంగా సుమారు మూడేళ్ల క్రితం ఇద్దరు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఓటర్ల సంఖ్య పెరుగుదల, వ్యయ ద్రవ్యోల్బణ సూచిలో అభివృద్ధి మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిమితిని సవరించే అవకాశం ఉంది. గతంలో 2014లో ఒకసారి సవరించారు. మళ్ళీ సవరించాల్సి వుంది. లోక్‌సభ సభ్యుల ఖర్చు రూ.70లక్షలు, శాసనసభ సభ్యుల ఖర్చు 28లక్షలు గరిష్ఠ పరిమితిగా మొన్నటి దాకా ఉంది. ఆ మధ్య బీహార్ లో ఎన్నికలు జరిగిన సందర్భంలో వ్యయ పరిమితిని 10శాతం పెంచారు. ఈ లెక్కప్రకారం లోక్ సభ అభ్యర్థి ఖర్చు పరిమితి -77లక్షలు, శాసనసభ అభ్యర్థి ఖర్చు -30.8లక్షలు అయ్యింది.

అయితే భవిష్యత్తులోనూ ఇదే విధానం సర్వత్రా ఉండే అవకాశాలు లేవు. రాష్ట్రాలను బట్టి కూడా పరిమితిని సవరించే విధానం వుంది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుంటారు. 2019 నాటికి దేశ వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 83.4కోట్ల నుండి 91కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 92.1కోట్లు ఉంది. వ్యయ ద్రవ్యోల్బణ సూచి 2019 నుంచి 280కు, ప్రస్తుతం 301కి పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని, తుది సవరణ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికల ఖర్చు అనే అంశం చాలా చర్చనీయాంశమైంది. ఎన్నికల ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది. బాగా డబ్బున్నవాడు తప్ప సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు లేనేలేవు.

కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్న ఈ ఖర్చు అధికారికమైన లెక్క మాత్రమే.. అసలు నిజంగా అయ్యే ఖర్చు దీనికి ఎన్నో రెట్లు ఉంటుంది. ఒకప్పుడు సామాజిక సేవ, దేశభక్తి ఆశయాలుగా, సత్ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. వారంతా ఉత్తమ సంస్కారం ఉండి, విలువలు కలిగిన వ్యక్తులు. ఓటర్లు కూడా కేవలం  పార్టీయే కాకుండా, ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థిని బట్టి ఓట్లు వేసే సంస్కృతి ఉండేది. అప్పుటి ఎన్నికల ఖర్చు నామ మాత్రమే. ఇంత మీడియా లేదు.

ఇన్ని సర్వే సంస్థలు లేవు. ఇంతమంది పవర్ బ్రోకర్లు లేరు. "ఓటుకు నోటు" అనే మాటే లేదు. ఓట్లకు అమ్ముడుబోయే నీచ సంస్కృతి ఓటర్లలో  లేనే లేదు. పార్టీలు, సిద్ధాంతాలు ఏవైనప్పటికీ, చాలామంది నాయకులు విలువల పునాదులపైనే నడిచేవారే ఎక్కువశాతం  ఉండేవారు. క్రమంగా, ప్రతి వ్యవస్థలో కాలుష్యం పెరిగిపోయింది. విలువల స్థానంలో 'వెల' వచ్చి చేరింది. పవర్ సెంటర్లు పెరుగుతూ వచ్చాయి. బడా కంపెనీల పెట్టుబడులు ప్రవేశించాయి.

పార్టీ ఫండ్ రూపంలోనూ, అభ్యర్థి వ్యక్తిగత స్థాయి రూపంలోనూ ఫండింగ్ సంస్కృతి వచ్చి చేరింది. గత 40-50ఏళ్ళల్లో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రెండు దశాబ్దాల నుంచి అది ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఊహాతీతమైన రూపు దాల్చుకుంది. కార్పొరేట్ రంగాలు, వ్యాపారవేత్తలు  రాజకీయాల్లోకి రావడం మొదలైంది. లేదా తమ మనుషులను ఎన్నికల్లో నిలబెట్టడం జరుగుతోంది. రాజ్యసభ ఎంపిక విధానం మరో రూపం దాల్చింది. ఏది ఏమైనా, డబ్బే రాజ్యమేలుతోంది.

ఒకటి: తమల్ని తాము రక్షించుకోవడం,
రెండు: తమ వ్యాపార పరిధులను  పెంచుకోవడం,
మూడు: ప్రత్యర్థులను దెబ్బతీయడం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి చేరే వారి సంఖ్య పెరుగుతోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు?

ఈ నేపథ్యంలో పెద్దలు ఆవేదన చెందుతున్నారు. మీడియా రూపం కూడా మారుతూ వస్తోంది. రాజకీయం కూడా వ్యాపార-అధికార సమాగమంగా మారిపోయింది. పెట్టుబడుల కేంద్రంగా రూపాన్ని మార్చుకుంది. ఈ నేపథ్యంలో, పోటాపోటీగా ఎన్నికల ఖర్చు పెరిగింది.

ప్రతి వ్యవస్థను 'కొనడం, అమ్మడం, అమ్ముడుపోవడం' ఇవే మూల సూత్రాలుగా, ప్రముఖ కేంద్రాలుగా మొత్తం రూపురేఖలు మారిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రతి దశ డబ్బుమయమై పోయిందనే ఆవేదన చెందేవారు పెరిగిపోతున్నారు. వీటన్నిటి పర్యవసానమే నేడు దేశం ఎదుర్కొంటున్న వివిధ సంక్షోభాలు, కుంభకోణాలు. ఎన్నికల్లో సంస్కరణలు రావాలని మేధావులు మొత్తుకోవడం తప్ప, ఎటువంటి చలనం లేదు. ఇంత ఘోరమైన క్రీడ సాగుతూవుంటే, అధికారికంగా పైకి కనిపిస్తున్న వ్యయ పరిమితుల వివరాలు వాస్తవాలకు సుదూరాలు.

నిజం చెప్పాలంటే.. పద్ధతిగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా, ఒకప్పటిలాగా  ఎన్నికలు జరిగితే  ఖర్చు లక్షల్లోనే  ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ రూపొందించిన వ్యయ విధానం శాస్త్రీమైందే. ప్రస్తుతం విధించిన పరిమితికి అదనంగా 20%-30% పెంచితే సరిపోతుందని నిపుణుల అభిప్రాయం. కాకపోతే, ప్రస్తుత రాజకీయ, సామాజిక సంస్కృతిలో ఇది ఏ మాత్రం ఆచరణీయం కాదు. అసెంబ్లీ అభ్యర్థికి కనీసం 5 నుంచి 10కోట్లు, లోక్ సభ అభ్యర్థికి 25కోట్ల నుండి 100కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలోనే నేటి ఎన్నికల వ్యవస్థ ఉంది. అధికారిక పరిమితి లెక్కలకు, అనధికారికంగా పెట్టే ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఆ విషయం అందరికీ తెలిసిందే.

రాజకీయాల్లో అవినీతిపరులు, అక్రమార్కులు ఉన్నంతకాలం ఎన్నికల ఖర్చు పెరగడం తప్ప, తగ్గడం అసాధ్యమనే చెప్పాలి. మొత్తంగా వ్యవస్థల్లోనే పెనుమార్పులు, సంస్కరణలు  రానంతకాలం ఎన్నికల ఖర్చు అదుపులో ఉండే అవకాశమే లేదు. కాకపోతే, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఒక నియమావళి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మాట్లాడుకోవడమే. నిజంగా.. ఎన్నికల్లో ఖర్చు తగ్గితే ఆ రోజు నుంచే  విలువల ప్రస్థానం ప్రారంభమైనట్లు చెప్పాలి. నేటి సమాజంలో అది అత్యాశే అవుతుంది. మార్పు రావాలని బలంగా అభిలషించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.

- మాశర్మ, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement