రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఏమేం చేయనుంది, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, పథకాల అమల్లో లోపాలను ప్రస్తావించనుంది. ఈ మేరకు గవర్నర్ ప్రసంగ పాఠానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం రాష్ట్ర శాసనసభ వాయిదా పడ్డాక అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ భేటీ జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగ పాఠంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనుండటంతో.. ప్రసంగ పాఠంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. పాలన, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వచ్చే ఐదేళ్లపాటు కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించాలని నిర్ణయించింది.
గత ప్రభుత్వ విధానాలపై సమీక్ష..
ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాల్లో తాము అనుసరించే విధానాలను ప్రకటించాలని తీర్మానించింది. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటి అమలును పాక్షికంగా ప్రారంభించిన అంశాన్ని వివరిస్తూ.. ఇతర గ్యారంటీల అమలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల్లో ముంచిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో.. గవర్నర్ ప్రసంగంలో, తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో ఆయా అంశాలను ప్రస్తావించాలని కేబినెట్ భేటీలో నిర్ణయానికి వచ్చారు. ఇక రైతుబంధు, ధరణి పోర్టల్, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై త్వరలో మరోమారు సమావేశం అవుతామని మంత్రులకు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం.
విభాగాల వారీగా శ్వేతపత్రాలు
వివిధ ప్రభుత్వ శాఖల వారీగా అప్పులు, పనులు, పథకాల తీరుతెన్నులను వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. శ్వేతపత్రాల విడుదల మొక్కుబడిగా, హడావుడిగా కాకుండా పూర్తి వివరాలు, ఆధారాలతో ఉండాలని.. ఆ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన శాఖల్లో లోతుగా సమీక్షించి, అవగాహన పెంచుకోవాలని సూచించారు. శ్వేతపత్రాల విడుదల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి వచ్చే ప్రతిస్పందనకు దీటుగా సమాధానాలు ఇచ్చేలా మంత్రులు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై తొందరపాటుతో స్పందించకుండా.. లోతుగా అవగాహన చేసుకున్నాకే ప్రతిస్పందించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో.. సీఎం రేవంత్‌తోపాటు ట్రెజరీ బెంచ్ (అధికార పక్షం)నుంచి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినందున పూర్తి సన్నద్ధతతో రావాలని పేర్కొన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment