జనగామ/తొర్రూరు/దేవరుప్పుల: రాజకీయాలతో ప్రత్యక్షంగా అనుభవం లేని యువతి అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించారు. తొలి ఎన్నికలోనే 66 ఏళ్ల రాజకీయ నేత ఎర్రబెల్లిని 26 ఏళ్ల యశస్వినిరెడ్డి మట్టి కరిపించి.. విజయకేతనం ఎగురవేశారు. పాలకుర్తి నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన మామిడాల యశస్వినిరెడ్డి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ కొంతకాలం అత్తామామలకు సహకారంగా సొంత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు.
వాస్తవానికి పార్టీ అధిష్టానం తొలుత యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. పౌరసత్వం విషయంలో అడ్డంకులు రావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె కోడలు యశస్వినిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో కోడలు యశస్వినిరెడ్డికి అవకాశమివ్వాలని ఝాన్సీరెడ్డి పార్టీని కోరడంతో అధిష్టానం టికెట్ ఇచ్చింది. పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు. పాత చెన్నూరు ప్రస్తుత పాలకుర్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండో మహిళగా యశస్వినిరెడ్డి నిలిచారు.
నాడు 26.. నేడూ 26
పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నిక చిత్రవిచిత్రాలకు నెలవుగా మారింది. గెలిచినా, ఓడినా అభ్యర్థులకు 26 సంఖ్యతో అనుబంధం ఉంది. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా దయాకర్‌రావు రాజకీయం నడిపారు. ఆయనపై 26 ఏళ్ల యువతి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల రాజకీయ ఉద్ధండుడు 26 ఏళ్ల యువతి చేతిలో ఓడడం, ఏ వయసులో రాజకీయం ప్రారంభించాడో అదే వయసు యువతిపై ఓటమి పాలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment