
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి డీఎస్పీ వెంకటేశ్వరబాబు తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఝాన్సీరెడ్డి పోలీసులను ప్రశ్నించారు.
తన కోడలు యశస్వినిరెడ్డిని బరిలో నిలిపానని, తాను నియోజకవర్గంలోని చెర్లపాలాన్ని దత్తత తీసుకున్నానని, ఇక్కడ పన్నులు కడుతున్నానని, తనను నియోజకవర్గం వీడాలనడం సరికాదన్నారు. కుట్ర పూరితంగా తనకు నోటీసులు జారీ చేశారన్నారు. దీనికి మంత్రి దయాకర్‌రావు బాధ్యత వహించాలన్నారు. కనీసం ఆడవాళ్లు అని చూడకుండా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు.