బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
పరకాల: ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గురువారం ఏకాదశి కావడంతో మంచిరోజు అని.. నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కార్యకర్తల కోలాహలం నెలకొంది.
కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి నామినేషన్ వేసి బయటకు రాకముందే.. బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లారు. ఇరువురి నామినేషన్ల కోసం బయట వేచి చూస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు విజయం తమదే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏసీపీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు వారిని దూరంగా వెళ్లగొట్టారు.
నియమావళిని ఉల్లంఘించిన అరూరి!
ఐనవోలు: ఐనవోలు ఆలయంలో గురువారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. వర్ధన్నపేట బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు ఉదయం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. పార్టీ ఇచ్చిన బీ ఫాంతో పాటు నామినేషన్ పత్రాల్ని మల్లన్న పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం చేశారు.
ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే అరూరి రాజకీయ విమర్శలు చేశారు. పార్టీ పథకాలను ప్రస్తావించి మూడోసారి గెలిపించాలని కోరారు. ఈక్రమంలో కార్యకర్తలు జై బీఆర్‌ఎస్, జై అరూరి అంటూ నినదించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరూరి నియంత్రణ కోల్పోయి.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడడం తగదని పలువురు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment