
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అభ్యర్థుల ఓట్లు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం..
కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఆయన తన ఓటును అక్కడే వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు.
బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్ నగరంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్‌మోహన్‌రావు ఓటు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు.