Chintamadaka
-
కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్తులు
సిద్దిపేట రూరల్/మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కలిశారు. బుధవారం తొమ్మిది బస్సుల్లో సుమారు 540 మంది గ్రామస్తులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు కలుస్తున్నందున వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించారు. అనంతరం లోపలికి అనుమతించారు. దీంతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. అయితే...ఆయన మాట్లాడకుండానే అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ కోసం చింతమడక ప్రజల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్‌హౌజ్ చెక్‌పోస్ట్ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్ఎస్ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది. -
ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అభ్యర్థుల ఓట్లు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం.. కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఆయన తన ఓటును అక్కడే వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్ నగరంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్మోహన్రావు ఓటు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. -
నేడు చింతమడకకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్ దంపతులు ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. గ్రామ పాఠశాలలోని 13వ బూత్‌లో ఓటు వేస్తారు. ఆ తర్వాత సీఎం తిరిగి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుని పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఖైరతాబాద్, మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట భారత్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సీఎం చింతమడకకు వస్తున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని సీపీ శ్వేత తెలిపారు. అభ్యర్థులకు, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడం, బుధవారం ‘సైలెన్స్ పీరియడ్’ కావడంతో గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియ, అందుకు సంబంధించి పార్టీ పరంగా ఏర్పాట్లపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి పోలింగ్ కోసం పార్టీ సన్నద్ధతపై ఆరా తీశారు. కొందరు పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్లో మాట్లాడారు. ప్రచార సరళి, క్షేత్రస్థాయి పరిస్థితిపై నిఘా వర్గాలు, వివిధ సంస్థల నుంచి అందిన నివేదికలను పరిశీలించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. చివరి ఓటు పోలయ్యేంత వరకు పార్టీ పోలింగ్ ఏజెంట్లు బూత్‌లలోనే ఉండేలా చూసుకోవాలని, పార్టీ అనుకూల ఓటరు బూత్‌కు వెళ్లేలా పార్టీ కేడర్ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. -
కేసీఆర్ వరాలు.. హరీష్ చెక్కులు
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామస్తుల కళ సాకారమవుతోంది. చింతమడక గ్రామంలోని ప్రతి కుటుంబం స్వయం సమృద్ధి సాధించేందుకు చేయూత ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చింతమడక గ్రామస్తులకు చెక్కులు పంపిణీ చేశారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు.. కేసీఆర్ హామీ మేరకు పౌల్ట్రీ, డైరీ షెడ్ల నిర్మాణానికి రెండు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చింతమడక గ్రామానికి చెందిన 22 మందికి డైరీ యూనిట్లు, 87 మందికి పౌల్ట్రీ యూనిట్లుకు చెక్కులు అందాయి. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పదిహేను రోజుల్లో షెడ్లు నిర్మించాలని లబ్ధిదారులను ఆదేశించారు. షెడ్ల నిర్మాణం పూర్తయితే పశువులు, కోళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. చింతమడకలో పాలకేంద్రం ఏర్పాటు చేసి డైరీ నడిపే వారి వద్ద నుంచి పాలు కొనుగోలు చేస్తామని అన్నారు. -
‘చింతమడక స్కీమ్’ అని పెట్టినా ఓకే..కానీ
సాక్షి, హైదరాబాద్ : చింతమడక గ్రామ ప్రజలకు ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చినట్లుగానే.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో ఇవ్వాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. ప్రజలందరినీ సమదృష్టితో చూస్తానని సీఎంగా మీరు ప్రమాణం చేశారు. అది మీకు గుర్తు చేస్తున్నాం. మీరందరినీ సమ దృష్టితో చూడటం లేదనే భావన ప్రజల్లో కలిగితే.. రాష్ట్రంలో అశాంతి పెరిగే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌కు "చింతమడక స్కీమ్" అని పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. మీరు తక్షణం దీనిపై నిర్ణయం తీసుకోకపోతే.. అర్హులైన కుటుంబాలను కూడగట్టే పనిని చేపడతాం. మీరు ఇస్తున్నది మీ సొంత సొమ్మేంకాదు. రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నదే. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మీడియా ఎడిటర్స్ తీసుకెళ్లాలనే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు, డీపీఆర్‌లను.. ప్రతి శాసన సభ్యునికి చూసిస్తామన్న హామీని మీరు నిలబెట్టుకోవాలి. అప్పుల వివరాలను మీడియా ఎడిటర్స్‌కు చూపించాలి’అన్నారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఉనికి కోసమే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిర్వాసితుల గోడు వినాలి ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లే మీడియా ఎడిటర్స్ ప్రాజెక్టు నిర్వాసితుల బాధల్ని కూడా వినాలి. భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసిందో మీడియా గమనించాలి. అన్యాయంగా భూములు లాక్కున్నా ఏమీ చేయలేని నిస్సాహాయతలో ఉన్న నిర్వాసితుల గోడును ఎడిటర్స్ చూడాలి. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా ఒక ఎకరం కూడా మా ప్రాంతంలో అదనంగా సాగులోకి రావడం లేదు. కాళేశ్వరం ముక్తేశ్వరం ఎత్తిపోతల పథకం ఎందుకు నత్తనడకన సాగుతోందో దృష్టి సారించాలి’ -కాంగ్రెస్ ఎమ్మెల్యే, శ్రీధర్‌బాబు -
ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి
సాక్షి, సిద్దిపేట: గ్రామస్తులనుద్ధేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనకు ఇంత చేసిన చింతమడక గ్రామం రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామస్తులతో కలిసి ఉండాలనే కోరిక చాలా కాలం తర్వాత నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన గ్రామస్తులు ఆరోగ్యం, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందుకోసం నిధులు మంజూరు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. గ్రామంలో ఉన్నవారికే కాకుండా గ్రామం నుంచి బతుక పోయిన వారికి కూడా మొత్తం ఎంతమంది అయినా అందరికీ లబ్ధి చేకూర్చాలన్నాదే తన ఆలోచన అన్నారు. ఇందుకోసం ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అదేవిధంగా ప్రతీ కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందేందుకు రూ. 10 లక్షలకు తక్కువ కాకుండా సాయం అందచేస్తానని చెప్పారు. ఇందుకోసం రూ. 200 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చింతమడక, మదిర గ్రామాలు ఉప్పలోని కంట, దమ్మచెరువు గ్రామాలే కాకుండా గ్రామం నుంచి విడిపోయిన మాచాపూర్, సీతారంపల్లి గ్రామాలు కలిపి మొత్తం 2 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తానని చెప్పారు. ఈ డబ్బులతో వారి వారి నైపుణ్యాల ఆధారంగా యూనిట్లు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో నా గ్రామం ఉంటే నానే సంతోషపడుతానని ఈ సందర్భంగా చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, యువజన సంఘాలు కలిసి సంఘాలుగా ఏర్పడి మంచి పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇటీవల అభివృద్ధి చేసిన ఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మన గ్రామం అందంగా తయారు కావాలని చెప్పారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామం మోడల్‌గా తయారు కావాలని. కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరీ శుభాష్‌రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, సీపీ జోయల్ డేవిస్ తదితరులున్నారు. -
నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే
సాక్షి, సిద్దిపేట: సభ ప్రారంభంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. చింతమడక నుంచి ఎల్లాపూర్, రాజక్కపేట, అంకంపేట నుంచి హసన్‌మీరాపూర్, దమ్మచెరువు నుంచి వడిగలగడ్డ వరకు రోడ్లు వేసేందుకు నిదులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా చింతమడక గ్రామంలో ఉన్న 98 ఎకరాల అటవీ భూమిని అభివృద్ధి చేయాలని కోరారు. యువజన సంఘాలకు భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, శ్మశాన వాటిక, డంప్‌యార్డు, రైతు బజారు మంజూరి కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రామాలయం పున:నిర్మాణం అవుతుందని, శివాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు. చింతమడకలో ప్రాథమిక ఆసుపత్రి, పశువుల దవాఖానా మంజూరు చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. అయితే నియోజకవర్గంలోని నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు, మండల కేంద్రాల అభివృద్ధికి రూ. కోటి చొప్పున మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 81 గ్రామాలకు ఒకొక్క గ్రామానికి రూ.25లక్షల చొప్పున మంజూరి చేయాలని ఈ సందర్భంగా కోరారు. సిద్దిపేట అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. మీరు అభివృద్ధి బాటలో నడిపించిన సిద్దిపేటకు తను ఎమ్మెల్యే కావడం గర్వంగా ఉందని, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి సిద్దిపేటను అన్ని రంగల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలపుతామని చెప్పారు. -
చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్
సాక్షి, చింతమడక : చింతమడక గడ్డపై పుట్టడం తన అదృష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు సోమవారం స్వగ్రామం విచ్చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలతో ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘నన్ను ఇంతటివాడిని చేసిన చింతమడక గ్రామస్తులకు నమస్కారం. చింతమడక వాస్తు అద్భుతం. ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం. చింతమడకను చింతలు లేకుండా చేస్తా. మూడు, నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తవ్వాలి. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేయిస్తాం. వైద్యానికి కావాల్సిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. చింతమడక నుంచే ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలకాలి. క్షణాల్లో వైద్యం అందేలా తెలంగాణ మారాలి. గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ది చేకూరాలి. చదవండి: సొంతూరుకు సీఎం.. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. ఈ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి. చింతమడక చాలా మంచి ఊరు. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశాను. మీకు మంచిగా పని చేసే జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఒక్క చింతమడకే కాదు... నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తాం. చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తాం. చింతమడకలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తా. గ్రామంలో నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. అంతకు ముందు గ్రామంలోని బాల్య స్నేహితులను సీఎం కేసీఆర్ అప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామస్తులు ఇచ్చిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. అంతేకాకుండా తన ప్రసంగంలో చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పదో తరగతిలోనే పద్యాలు రాసే స్థాయికి తనను ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని అన్నారు. -
సారొస్తున్నారు..
సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకకు ఈ నెలలో రానున్నారని గ్రామస్తులు ఐక్యమత్యంతో, క్రమశిక్షణతో ఊరు గౌరవాన్ని కాపాడేలా సీఎం సారుకు స్వాగతం పలకాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం సాయంత్రం చింతమడకలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తో కలిసి రెండు గంటల పాటు సమీక్షించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూంలు సభాస్థలి, వన భోజనాల నిర్ధేశిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సభా సమావేశంలో హాజరయ్యే చింతమడక గ్రామస్తులకు ప్రత్యేకించి ఐడెంటీ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన అధికారులు మీఇంటికి వచ్చి ఐడెంటిటీ కార్డులను అందజేస్తారని వివరించారు. గ్రామస్తులంతా ఐక్యమత్యంతో మెదిలి మన ఊరు, మన గౌరవాన్ని కాపాడేలా వ్యవహారించాలని కోరుతూ ఏదైనా విన్నపాన్ని చేయాలంటే కుల సంఘాలు, మహిళా సంఘాల వారిగా విన్నవించాలని సూచించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం సభా సమావేశం జరిగే స్థలాన్ని పరిశీలించారు. ఐకేపీ గోదాం, సీసీ ప్లాట్‌ఫాం వద్ద సభ, సమావేశం జరిగేలా దాదాపు 3200ల మంది గ్రామస్తులను అనుమతించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారిక యంత్రాంగానికి గ్యాలరీలో 200, మరో రెండు వందల కుర్చీలతో ప్రెస్ గ్యాలరీని ఏర్పాటు చేసి 3600ల మందితో రెయిన్ ప్రూఫ్ సభావేదిక పనులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పలుచోట్లు అవసరమైన మార్పులు, చేర్పుల గురించి అక్కడికక్కడే అధికారులకు, నిర్వాహకులకు దిశానిర్ధేశం చేశారు. గ్రామంలో నిర్వహించనున్న సభ, సమావేశ, భోజన సదుపాయాలను, భారీ పోలీసు భద్రత చర్యలతో పాటు అవసరమైన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఆ తర్వాత పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాట్లపై స్థల పరిశీలన చేస్తూ, అలయం పక్కనే ఉన్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్ సహఫంక్తి భోజనం చేసే ఏర్పాట్లు, పక్కన ఖాళీ స్థలంలో గ్రామస్తులంతా భోజనం చేసే విధంగా ఏర్పాట్లపై కలెక్టరు, సీపీ జోయల్ డేవిస్, ఏసీపీ రామేశ్వర్, అధికారిక, ప్రజాప్రతినిధులతో చర్చించారు. వన భోజనాల వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులో 10 ఎకరాలలో సీఎం కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించనున్న బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహస్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు శ్రవణ్, రామలక్ష్మి, సుదర్శణ్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, సరోజ, పలు శాఖ అధికారులు, రూరల్ తహసీల్దారు రమేష్, గ్రామ సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారి సిద్దిపేటరూరల్: కేసీఆర్ చింతమడక పర్యటన నేపథ్యంలో 30 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట సమీకృత కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, పలు అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సర్వే చేసిన అధికారులే గ్రామస్తులకు ఇంటింటికీ వెళ్లి ఐడీ కార్డులను అందించాలన్నారు. గ్రామంలో ఉన్న 630 గృహాలకు గాను 30 ఇళ్లకు ఒక ఎంపీడీఓ, మరో ప్రత్యేక అధికారి నియమించనున్నట్లు తెలిపారు. 30 ఇళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ స¿సమావేశం పూర్తయ్యే వరకు బాధ్యత అధికారిదేనన్నారు. అదే విధంగా పలు అధికారులతో సమీక్షించి త్వరితగతిన గ్రామంలో జరుగుతున్న పనులు, పెద్ద చెరువు సుందరీకరణపై ఇరిగేషన్ అధికారులతో చర్చించి, కావాల్సిన ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని సూచించారు. సీఎం రాక సందర్భంగా సభ, సమావేశంలో ఉండాల్సిన వసతులు, అలాగే గ్రామస్తులు, వీఐపీ, మీడియా ప్రతినిధులకు భోజనాల వద్ద ఉండాల్సిన అధికారిక యంత్రాంగం వంటి అంశాలమీద చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవిందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్ స్వగ్రామంలో పటిష్ట బందోబస్తు
సాక్షి, సిద్దిపేట: త్వరలో సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకకు రానున్న నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ గ్రామాన్ని సందర్శించారు. గురువారం ఆయన గ్రామంలో తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శాశ్వత హెలీప్యాడ్, సమావేశ స్థలం, కేసీఆర్ గ్రామస్తులతో సహఫంక్తి భోజనం చేసే స్థలం, పార్కింగ్, బీసీ గురుకుల పాఠశాల, సీఎం ప్రయాణించే దారులు అన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున భారీకేడ్లను ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు కల్పించేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) నర్సింహారెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ కోటేశ్వర్రావు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి చిరకాలం గుర్తుండాలి
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో జరిగే అభివృద్ధి ప్రజలు చిరకాలం సీఎంను వారి హృదయాల్లో ఉంచుకునేలా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో చింతమడకలో చేయనున్న ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి మంచి ఇళ్లు ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. ఇళ్లు లేని ప్రతీ కుటుంబానికి యజమానులు ఇష్టం ఉన్నట్లుగా వారి స్థలంలో కట్టుకునేలా అవకాశం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్రామంలోని ప్రతీ కుటుంబంతో సుదీర్ఘంగా చర్చించి వారి అవసరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓలకు సూచించారు. అలాగే అసైన్డ్ భూముల్లో ఎస్సీలకు మోటార్లు, బోరుబావుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్‌ను ఆదేశించారు. పంచాయతీ శాఖతో గ్రామంలోని పాఠశాల అదనపు తరగతి గదులు, భూమి లేనివారికి ట్రాక్టర్స్ ఇవ్వడం, భూమి ఉంటే డైరీ, రూ. 10 లక్షలతో హార్వేస్టర్, హర్టీకల్చర్తో మల్బరిసాగు, చెరువు సుందరీకరణ, గ్రామంలోని ప్రతీ కుటుంబం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచించారు. అన్ని వివరాలతో నివేదిక అలాగే గ్రామంలోని నిరుద్యోగ యువత కోసం వారితో చర్చించి ఆటోలు, కార్లు, వంటి వాహనాలు అందించే ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు చేసిన సర్వేను ర్యాండమ్ పద్ధతిన ఎంపిక చేసి స్వయంగా తానే విచారణ చేస్తానని తెలిపారు. గ్రామంలో 100 ఎకరాల్లో అడవి అభివృద్ధి కోసం ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చింతమడక గ్రామ ప్రజల సుస్థిరమైన అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు నివేదిక రూపంగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీఓల బృందతో కలిసి చింతమడక గ్రామ సమగ్ర సర్వే నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా అదికారులు పాల్గొన్నారు. నేడు చింతమడకకు హరీశ్‌రావు.. చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్ వస్తున్న క్రమంలో నేడు ఉదయం 7 గంటలకు హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు గ్రామంలో పర్యటించనున్నారు. మూడు రోజులుగా అధికారులు చేపట్టిన గ్రామ సమగ్ర కుటుంబ సర్వే, అక్కడి ప్రజల అవసరాలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని , ప్రత్యేక ప్రజా అవసరాలపై, జీవన స్థితిగతులపై ఆరా తీయనున్నట్లు తెలిపారు. -
బాధ్యతగా ఓటేశారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా సినీతారలు, క్రీడాకారులు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఓటేసిన తరువాత అందరూ తప్పకుండా ఓటేయాలని మీడి యా ద్వారా తమ అభిమానులకు పిలుపునిచ్చారు. చింతమడకలో కేసీఆర్.. మరోవైపు రాజకీయ నేతల్లో అధికశాతం తాము పోటీ చేస్తోన్న సీట్లలో కాకుండా మరో చోట ఓటువేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామం లో ఓటు వేశారు. మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలో ఓటేశారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆజంపురాలో, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాం పెయినర్ విజయశాంతి (బంజారాహిల్స్), జైపాల్‌రెడ్డి (జూబ్లీహిల్స్), వి.హనుమంతరావు (అంబర్‌పేట) కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నల్లగొండలో ఓటేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ (చిక్కడపల్లి), కిషన్‌రెడ్డి (కాచిగూడ), ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (రాజేంద్రనగర్), టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ (జగిత్యాల), టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (తార్నాక), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (శేరిలింగంపల్లి), సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ (హిమాయత్‌నగర్), సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (హుస్నాబాద్), ప్రజాగాయకుడు గద్దర్ (అల్వాల్) ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్ దంపతులు (ఎంఎస్ మక్తా), ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి (ప్రశాసన్‌నగర్), తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (కుందన్‌బాగ్), ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ దంపతులు (ఖైరతాబాద్)లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్– సుజాత దంపతులు (వరంగల్‌లో) ఓటేశారు. సినీతారలు సైతం.. కృష్ణ–విజయనిర్మల, చిరంజీవి–సురేఖ, నాగార్జున–అమల, వెంకటేశ్, నిర్మాత సురేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, ఆయన తల్లి శాలిని, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రాణా, గోపీచంద్, రాజమౌళి దంపతులు, నితిన్, బండ్ల గణేశ్, రామ్ పోతినేని, శేఖర్ కమ్ముల, కోచ్ గోపీచంద్, పీవీ సింధు, సానియా మీర్జా, వందేమాతరం శ్రీనివాస్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, తొట్టెంపూడి వేణు, మంచులక్ష్మి, జగపతిబాబు, ఆర్పీ పట్నాయక్, వరుణ్‌తేజ్, నాగబాబు, చార్మి, శ్రీకాంత్–ఊహ, బ్రహ్మాజీ, నిఖిల్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను, సుమ, ఉపాసన, సమంత, ఝాన్సీ, రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు హైదరాబాద్‌లో ఓటేశారు. ఓటు వేసేందుకు వస్తున్న మహేశ్‌బాబు -
వచ్చేది.. మన సర్కారే
సాక్షి, సిద్దిపేట: ‘ఎక్కడా ఏమీ అనుమానం లేదు.. అంతా సర్దుకుంది. ప్రభుత్వంలో ఎటువంటి మార్పు ఉండదు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సతీమణి శోభారాణితో కలసి సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. జిల్లాలోని కొండపాక మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన సిద్దిపేట రూరల్ మండలం చింతమడకకు వచ్చారు. హెలికాప్టర్ దిగగానే తన చిన్నాన్న బాలకిషన్‌రావుకు పాదాభివందనం చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడే వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి స్నేహితులతో కేసీఆర్ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని అన్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, మహిళలు ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని.. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందడి అయిపోయి.. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదిహేను రోజుల్లో గ్రామానికి మళ్లీ వస్తానని, మీ ఆశీస్సులు తీసుకొని గ్రామాభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోశ్ తదితరులు ఉన్నారు. -
చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్
సిద్దిపేట రూరల్: సీఎం కేసీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామమైన చింతమడకలో ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశా ల పోలింగ్ బూత్‌లో ఆయనకు ఓటు హక్కు ఉం ది. సీఎం రాక నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, సీఎం సెక్యూరిటీ చీఫ్ ఎం.కె.సింగ్‌ల ఆధ్వర్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. -
కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్‌కు చేదు అనుభవం
సిద్ధిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సిద్ధిపేట రూరల్ మండలంలోని చింతమడకలో ఇటీవలే ఓ రైతు ఆత్మహత్యకుపాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకుగానూ రేవంత్ బుధవారం చింతమడకకు బయలుదేరారు. టీడీపీ ఎమ్మెల్యే రాకను నిరసిస్తూ చింతమడక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. రేవంత్ ఊర్లోకి రాకుండా రహదారిపై టైర్లు, ముళ్లకంపలను పేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. చింతమడకకు రెండు కిలోమీటర్ల దూరంలోనే రేవంత్ రెడ్డి కారును ఆపేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నందున పర్యటన మానుకోవాలని పోలీసులు చేసిన అభ్యర్థనను రేవంత్ తృణీకరించారు. టూ వీలర్ ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. చివరికి రేవంత్ కాలినడకన చింతమడక వైపునకు కదిలారు. -
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి?
పై ఫోటోలో కింద వరుసలో కూర్చున్న బాలుడు (సర్కిల్) ఎవరో గుర్తు పట్టండి. గుర్తు పట్టలేదా? ఇంకాస్త దగ్గర నుంచి చూడండి. గుర్తు పట్టలేకపోతున్నారా? అయితే మీకో క్లూ ఇస్తాం...కనుక్కోండి! ఓ మాజీ ప్రధానమంత్రిని ఉద్దేశించి 'ఆయన కంటే చెప్రాసీలు నయం' అని ఒకసారి...'ఆంధ్రోళ్లు ఆఫీసర్స్, తెలంగాణోళ్ళు చెప్రాసీలా?' అంటూ మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తుకొచ్చిందా...! అవును మీరు అనుకున్నంటున్న పేరు నిజమే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్. 48 ఏళ్ల కిందట ఏక్ దిన్కా చెప్రాసీగా పని చేశారు. 1967-68 విద్యా సంవత్సరంలో స్వపరిపాలన రోజు కేసీఆర్ అటెండర్ పాత్ర పోషించారట. అప్పుడాయన దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు పాఠశాల రికార్డులను బట్టి తెలుస్తోంది. నెత్తిమీద ఖద్దరు టోపీ... చంకలో అటెండెన్స్ రిజిష్టార్ పట్టుకుని పెద్దసారు (హెడ్ మాస్టర్) ముందు నడుచుకుంటూ వచ్చి టేబుల్ పై పెడుతూ ఆనందపడేవారని ఆయన బాల్య స్నేహితులు చెప్తున్నారు. కేసీఆర్ సొంత ఊరు చింతమడక నుంచి దుబ్బాక హైస్కూల్‌కు తన సోదరి సుమతితో కలిసి నడుచుకుంటూ వచ్చేవారని కేసీఆర్ సీనియర్ స్టూడెంట్ లక్ష్మీనారాయణ 'సాక్షి'తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆనాటి స్వపరిపాలన మధుర క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. -
చింతమడకలో ఓటేసిన కేసీఆర్
-
చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
చింతమడక : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన తన స్వగ్రామం అయిన చింతమడకలో ఓటు వేశారు. ఎన్నికలు జరిగినప్పుడల్లా కేసీఆర్ తన స్వగ్రామానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి చింతమడక వెళ్లి ఓటు వేశారు. మరోవైపు మధ్యాహ్నం 12గంటల వరకు 48 శాతం ఓటింగ్ నమోదైంది. -
ఓటు వేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లిన కేసీఆర్
మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం ఓటు వేసేందుకు తన ఫామ్ హౌస్ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరారు. సిద్ధిపేట నియోజకవర్గం చింతమడకలో ఆయన ఓటు వేశారు. కేసీఆర్ సతీమణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీగా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఇక సిద్ధిపేటలో టీఆర్ఎస్ తరపున హరీష్ రావు బరిలో ఉన్నారు. కాగా కేసీఆర్ ఫిబ్రవరి 17, 1954న మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడకలో జన్మించారు. ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ కొంతకాలం డిప్యూటి స్పీకరుగా పదవి నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నేపథ్యంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.