సాక్షి, చింతమడక : చింతమడక గడ్డపై పుట్టడం తన అదృష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు సోమవారం స్వగ్రామం విచ్చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలతో ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘నన్ను ఇంతటివాడిని చేసిన చింతమడక గ్రామస్తులకు నమస్కారం. చింతమడక వాస్తు అద్భుతం. ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం. చింతమడకను చింతలు లేకుండా చేస్తా. మూడు, నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తవ్వాలి. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేయిస్తాం. వైద్యానికి కావాల్సిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. చింతమడక నుంచే ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలకాలి. క్షణాల్లో వైద్యం అందేలా తెలంగాణ మారాలి. గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ది చేకూరాలి.
చదవండి: సొంతూరుకు సీఎం..
రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. ఈ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి. చింతమడక చాలా మంచి ఊరు. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశాను. మీకు మంచిగా పని చేసే జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఒక్క చింతమడకే కాదు... నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తాం. చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తాం. చింతమడకలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తా. గ్రామంలో నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. అంతకు ముందు గ్రామంలోని బాల్య స్నేహితులను సీఎం కేసీఆర్ అప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామస్తులు ఇచ్చిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. అంతేకాకుండా తన ప్రసంగంలో చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పదో తరగతిలోనే పద్యాలు రాసే స్థాయికి తనను ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment