
హుజూరాబాద్: ఉద్యమాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ 1957లో (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గంగా ఏర్పడి మూడేళ్లకే జనరల్ స్థానంగా మారింది. ఇందులో హుజూరాబాద్, భీమదేవరపల్లి తాలూకాలుగా ఉండేవి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగుసార్లు, టీడీపీ, స్వతంత్రులు మూడుసార్లు చొప్పున, ఇక బీఆర్‌ఎస్ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. 2021లో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రులుగా పని చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గకేంద్రంతోపాటు ఆ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట(కొత్తగా ఏర్పడిన మండలం), హుజూరాబాద్ (మొత్తం ఐదు మండలాలు)తో కలిపి ముఖచిత్రంగా మారింది. ఇక కమలాపూర్ నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైంది.
1957లో ఏర్పడిన హుజూరాబాద్‌కు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఈ నియోజకవర్గంలో ఉన్న సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో.. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు జమ్మికుంట, వీణవంక మండలాలను హుజూరాబాద్‌లో కలిపారు. అప్పటివరకు ఉన్న శంకరపట్నం, మానకొండూర్ మండలాలను విడదీసి కొత్తగా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గంలో కలిపారు. హుజూరాబాద్ నుంచి 1957లో ఇద్దరు స్వతంత్రులే బరిలో దిగగా.. పోలుసాని నర్సింగరావును గెలిపించారు.
1962లో గాడిపల్లి రాములు (కాంగ్రెస్), 1967లో తిరిగి పోలుసాని నరసింగరావు (కాంగ్రెస్), 1972లో వొడితెల రాజేశ్వరరావు (కాంగ్రెస్), 1978లో దుగ్గిరాల వెంకట్రావు (కాంగ్రెస్), 1983లో కొత్త రాజిరెడ్డి (స్వతంత్ర), 1985లో దుగ్గిరాల వెంకట్రావు (టీడీపీ), 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు. ఇక 1994, 1999లో వరుసగా ఇనుగాల పెద్దిరెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఆదరించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ లక్ష్మీకాంతారావు టీఆర్‌ఎస్ నుంచి గెలిచారు.
పునర్విభజన అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈటల ఘన విజయం సాధించారు. 2014, 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004వరకు జమ్మికుంటలో నామినేషన్ వేసే ఇక్కడి అభ్యర్థులు.. 2009 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే వేస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఇలా
1957 పి.నరసింగరావు స్వతంత్ర గాడిపెల్లి రాములు స్వతంత్ర
1962 గాడిపెల్లి రాములు కాంగ్రెస్ నాయిని దేవయ్య సీపీఐ
1967 పి.నరసింగరావు కాంగ్రెస్ కొత్త రాజిరెడ్డి స్వతంత్ర
1972 వి.రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ ఎ.కాశీవిశ్వనాథరెడ్డి స్వతంత్ర
1978 డి.వెంకట్రావు కాంగ్రెస్ ఎ.కాశీవిశ్వనాథరెడ్డి జనతా
1983 కొత్త రాజిరెడ్డి స్వతంత్ర డి.వెంకట్రావు స్వతంత్ర
1985 డి.వెంకట్రావు టీడీపీ భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్
1989 కేతిరి సాయిరెడ్డి స్వతంత్ర డి.వెంకట్రావు టీడీపీ
1994 ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ బి.లక్ష్మీకాంతరావు కాంగ్రెస్
1999 ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ కేతిరి సాయిరెడ్డి కాంగ్రెస్
2004 బి.లక్ష్మీకాంతరావు టీఆర్‌ఎస్ ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ
2008 వి.లక్ష్మీకాంతరావు టీఆర్‌ఎస్ కె.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్
2009 ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ వీ.కృష్ణమోహన్‌రావు కాంగ్రెస్
2010 ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ ఎం.దామోదర్‌రెడ్డి టీడీపీ
2014 ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ కే.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్
2018 ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్
2021 ఈటల రాజేందర్ బీజేపీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ టీఆర్‌ఎస్
నియోజకవర్గ ప్రత్యేకతలు
నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం. ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే కాకతీయకాలువ ద్వారా ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 59 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జమ్మికుంటలోని పత్తిమార్కెట్ ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. సీడ్ ఉత్పత్తిలోనూ హుజూరాబాద్ దేశంలోనే పేరుగాంచింది. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వ్యవసాయంలో సూచనలు చేస్తూ కొత్త వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. జమ్మికుంట, ఉప్పల్, బిజిగిర్‌షరీఫ్‌లో ఉన్న రైల్వేస్టేషన్ ద్వారా ప్రయాణికులకు రవాణా సులువవుతోంది.
మొత్తం ఓటర్లు 2,44,514
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 106 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా, మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,44,514 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,19,676 మంది పురుషులు, 1,24,833 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు.



Comments
Please login to add a commentAdd a comment