
మల్బరీ తోట
● పట్టు పరిశ్రమలో గూడు కట్టిన అవినీతి ● కమీషన్ ఇస్తేనే బిల్లు మంజూరు.. లేదంటే కాలయాపనే ● సంబంధితశాఖలో బహిరంగంగా వసూళ్లు
బ్లీచింగ్ కిట్టు సప్లై చేయలేదు
పట్టుపురుగులు పెంచేందుకు బ్లీచింగ్ కిట్టు ఎంతో అవసరం ఉంటుంది. దానికోసం పట్టు పరిశ్రమ శాఖ ఏడీ ఇతేందర్‌కు డబ్బులు చెల్లించాం. మాకు బ్లీచింగ్ కిట్టులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు మమ్మల్ని బెదిరిస్తున్నాడు.
– సామల ప్రతాపరెడ్డి, తుమ్మనపల్లి
పదివేలు ఇస్తేనే డబ్బులు మంజూరు చేశారు
మల్బరి, పట్టుసాగుకు షెడ్డు నిర్మించుకున్నాం. మాకు ప్రభుత్వం నుండి రెండు లక్షల రూపాయలు అందాల్సి ఉండగా పట్టు పరిశ్రమశాఖ ఏడీ యతిందర్ రూ.20వేలు ఇస్తేనే డబ్బులు మంజూరు చేస్తామని డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక రూ.10 వేలు చెల్లించాం. – గొడిశాల శ్రీనివాస్,
మల్బరీ రైతు, తుమ్మనపల్లి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పట్టు పరిశ్రమశాఖలో అవినీతి గూడు కట్టింది. కమీషన్ ఇస్తేనే ఫైల్ కదులుతుండగా నో అంటే సంవత్సరాలైనా అంతే. పట్టుగూళ్ల ద్వారా గణనీయవృద్ధి సాధించవచ్చని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుండగా అధికారుల తీరుతో ఆశించిన లక్ష్యం నీరుగారుతోంది. వాస్తవానికి ఈ సాగురంగంపై జిల్లా రైతులకు పెద్దగా అవగాహన లేకపోగా ముందుకొచ్చే కొద్దిపాటి రైతులకు మామూళ్ల బెడద కుంగదీస్తోంది.
ఆర్‌కేవీవై అధికారులకు వరం
పట్టు పురుగుల పెంపకం రైతులకు లాభసాటి కాగా ఆ దిశగా చైతన్యపరచడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. జిల్లాలోని సైదాపూర్, హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి, రామచంద్రాపూర్, దుద్దెనపల్లి, కాట్నపల్లి, చొప్పదండి, రాగంపేట గ్రామాల్లో సుమారు 200మంది రైతులు సాగుచేస్తున్నారు. ప్రభుత్వం ఆర్‌కేవీవై పథకం ద్వారా రైతులకు షెడ్డు నిర్మాణానికి రూ.2లక్షలు చెల్లిస్తోంది. షెడ్ల నిర్మాణం జరిగిన నాలుగేళ్లకు ఇటీవల నిధులు విడుదల కాగా పలువురు అధికారులు అందినకాడికి దండుకున్నారు. రూ.50వేలు ఇస్తేనే రూ.2లక్షలు వస్తాయని బేరసారాలకు దిగుతున్నారు.
వసూళ్లే వసూళ్లు
ఇక పట్టు పరిశ్రమకు సంబంధించిన ప్రతీ పనికి ఓ రేట్ నిర్ణయించినట్లు సమాచారం. తాము కార్యాలయానికి వెళ్తే చాలు పిక్కుతింటారని అన్నదాతలు వాపోయారు. ఆర్‌కేవీవై స్కీంలో రూ.2లక్షలకు గానూ కమీషన్ ఇస్తేనే ఫైల్‌పాస్ చేశారని రైతులు శ్రీనివాస్, ప్రతాపరెడ్డి వివరించారు. ఒక్క తుమ్మనపల్లి గ్రామంలోనే 15 మంది రైతుల వద్ద రూ.10వేల నుంచి రూ.50వేల వరకు కమీషన్ తీసుకున్నారని తెలుస్తోంది. పట్టుపురుగులు సాగుచేసే రైతుల కోసం ముందుగా మల్బరీనర్సరీ పెట్టేందుకు రెండు ఎకరాలకు గాను రూ.25వేల సబ్సిడీ సర్కారు అందిస్తోంది. మల్బరీ నర్సరీ ప్లాంటేషన్ చేసుకున్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.25 వేలల్లో తనకు రూ.5 వేలు ఇస్తేనే డబ్బులు వస్తాయి లేదంటే అంతేనని ఓ అధికారి వేధిస్తుండటం విశేషం.
అతని మాటే వేదం
పట్టు పరిశ్రమశాఖలో పనిచేస్తున్న ఓ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పై అధికారిని మచ్చిక చేసుకుని తాననుకున్నట్లు చక్రం తిప్పుతున్నారు. తాను చెప్పినట్టే వినాలని కార్యాలయ సిబ్బందిని సైతం ఇబ్బంది పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టుపురుగుల పెంపకం మీద సరైన అవగాహన లేకపోగా పరిధికి మించి వ్యవహరిస్తున్నారు. పట్టుపురుగుల షెడ్డు విషయంలో అవినీతిపై ఏడీ యతిందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అదంతా అబద్ధమని కొట్టిపారేశారు. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment