బండి సంజయ్‌ని సన్మానిస్తున్న గోపాల్‌పూర్ గ్రామస్తులు
సాక్షి, కరీంనగర్: ‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం పోరాడిన. 74 కేసులు పెట్టిండ్రు. మరి కమలాకర్ ఏం సాధించిండు? ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నయి. బీసీ స్టడీసర్కిల్ శిక్షణా తరగతులు, విద్యార్థుల్లేక వెక్కరిస్తోంది. తీగల వంతెన వాహనాలు వెళ్లడానికి పనికి రాకుండా వీక్లీడాన్స్ క్లబ్‌లా తయారైంది.
ఇదేనా మీరు చేసిన అభివృద్ధి’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను ప్రశ్నించారు. కరీంనగర్‌లోని అశోక్‌నగర్, గోపాల్‌పూర్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ మంత్రిగా ఉంటూ ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేని వ్యక్తికి ఓట్లేలా వేస్తారని ప్రశ్నించారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు మంజూరు చేసినా కేసీఆర్, గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఒక్కఇల్లు కట్టివ్వకుండా ఆ నిధులు దారి మళ్లించారని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులది భూ కబ్జాల చరిత్ర అన్నారు. వాళ్లపై ఉన్న కేసులన్నీ కబ్జాలు, ఫోర్జరీలు, అక్రమ సంపాదన, ఐటీ కేసులే అని, ఎన్నికలైపోగానే వాళ్లద్దరూ ఒక్కటై రాజీ చేసుకుంటారని అన్నారు. అశోక్‌నగర్‌లో గుడిని కూల్చేసేందుకు గంగుల కమలాకర్ సిద్ధమైతే అడ్డుకుంది తానేనని అన్నారు. అనంతరం జ్యోతినగర్, చైతన్యపురి, విద్యానగర్‌కు చెందిన సుమారు 500మంది యువత బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
బండి వెంటే కురుమ సంఘం..
బండి సంజయ్ కుమార్‌కు గోపాల్‌పూర్ ప్రజలు నీరాజనం పట్టారు. ఊరంతా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్‌వారితో కలిసి దాదాపు అరగంటకుపైగా ముచ్చటించారు. కురుమ సంఘం కమ్యూనిటీ హాల్‌ను సందర్శించారు. బండి సంజయ్ వెంటే ఉంటామని కురుమ సంఘంవాళ్లు హామీ ఇచ్చారు.
27న లక్ష మందితో మోదీ సభ
ఈనెల 27న కరీంనగర్‌లోని ఎస్సారార్ మైదానంలో జరిగే బహిరంగసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్న నేపథ్యంలో విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రధానంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా హాజరుకావాలని పిలు పునిచ్చారు. శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులు, శక్తికేంద్ర ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు.
మోదీసభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి లక్షమంది తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు 50వేల మంది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అవకా శం ఉందన్నారు. సభకు హాజరయ్యే ప్రజల కు నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంవద్దని, ఆ బాధ్యత సంబంధిత మండల నాయకులపైనే ఉందని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment