సాక్షిప్రతినిధి,కరీంనగర్/పెద్దపల్లి: ఎన్నికల పర్వంలో మరో ఘట్టం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌తో మొదలైన సభల సందడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ జైరాంరమేశ్‌తో ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి ప్రతీక. అందుకే, ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన వారే రాజధానిలో అధికారంలో ఉంటారన్న నమ్మకం అనాదిగా వస్తోంది. అందుకే, ఈ జిల్లాపై బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యేక దృష్టి సారించి, సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి.
ప్రముఖుల సభలతో ఊపు..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్‌కు ఉద్యమకాలం నుంచి ప్రత్యేక అభిమానం. అందుకే, ఆయన ఈ జిల్లాలో పలుమార్లు సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్‌తో మొదలు పెట్టిన సీఎం కేసీఆర్ తరువాత విడతల వారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆఖరుగా వేములవాడతో ఉమ్మడి జిల్లా సభలు ముగించారు. అలాగే కేటీఆర్ కూడా 13 నియోజకవర్గాల్లో పర్యటించారు.
– ప్రధాని మోదీ కరీంనగర్‌కు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా (జమ్మికుంట), యూపీ సీఎం యోగి (వేములవాడ), మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (ధర్మపురి)లు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు.
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, వేములవాడలో పర్యటించారు. వీరే కాక రేవంత్‌రెడ్డి, జైరాంరమేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ తదితరులు సభల్లో పాల్గొన్నారు.
50 రోజులు హోరెత్తిన ప్రచారం..
గతనెల 9న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా.. ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల ఖరారు, నామినేషన్లతో జోరందుకున్న ప్రచారంలో మొత్తంగా దాదాపు 50 రోజులుగా అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో దూసుకెళ్లారు. కొందరు అభ్యర్థులు భారీ బహిరంగ సభల ద్వారా బలప్రదర్శన చేయగా, మరికొందరు నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నమ్ముకున్నారు. ప్రజలకు తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలతో పాటు, తమదైన హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి యత్నించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు.
సైలెన్స్ పీరియడ్ మొదలు..
ఉమ్మడి జిల్లాల్లో 13 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సెలెన్స్ పీరియడ్‌గా ప్రకటించారు. అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ప్రసారంపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారం తర్వాత తెర వెనుక పంపిణీలపై ఎన్నికల అధికారులు దృష్టిపెట్టారు. బల్క్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలపైనా నిఘా పెట్టారు.
నియోజకవర్గం.. పోలింగ్ స్టేషన్ల వివరాలు..
కరీంనగర్ నియోజకవర్గంలో 390 పోలింగ్ స్టేషన్లు, చొప్పదండిలో 327, మానకొండూరులో 316, హుజూరాబాద్‌లో 305, రామగుండంలో 259, మంథనిలో 288, పెద్దపల్లిలో 290, వేములవాడలో 170, సిరిసిల్లలో 287, కోరుట్లలో 262, జగిత్యాలలో 254, ధర్మపురిలో 269 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
Comments
Please login to add a commentAdd a comment