సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ జలగం వెంగళరావు పరిచయం అక్కరలేని పేరు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, హోంమంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్.. ఇలా చెబుతూ పోతే ఎన్నో పదవులు అలంకరించి జిల్లా రాజకీయాలపై ఆయన చెరగని ముద్ర వేశారు. తద్వారా జలగం కుటుంబం ఉమ్మడి జిల్లాలో అందరికీ సుపరిచితమనే చెప్పాలి. డీసీసీబీ చైర్మన్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, పంచాయితీరాజ్ మంత్రి తదితర పదవులను ఈ కుటుంబంలోని నేతలు నిర్వర్తించారు. జలగం వెంగళరావు సహా కొండలరావు, ప్రసాదరావు, వెంకటరావు ఆ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
జలగం కొండలరావు
జలగం వెంగళరావు కుటుంబం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది ఆయన సోదరుడు జలగం కొండలరావు. 1957లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఒకసారి, ఖమ్మం ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచారు.
జలగం వెంగళరావు
జలగం వెంగళరావు తొలిసారి 1959లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే, 1962లో వేంసూరు(ప్రస్తుత సత్తుపల్లి) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేశారు. ఆతర్వాత 1973 డిసెంబర్ 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1978మార్చి వరకు కొనసాగారు. ఆ సమయాన దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోగా, జలగం వెంగళరావు ఇందిరాగాంధీతో విబేధించి కాంగ్రెస్(ఆర్)ను స్థాపించారు. 1978 ఎన్నికల్లో గెలుపొందినా రాష్ట్రంలో 30సీట్లకే పరిమితం కావడంతో రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1986లో ఖమ్మం ఎంపీగా గెలిచి కేంద్ర పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లోనూ ఖమ్మం ఎంపీగా రెండోసారి గెలిచిన వెంగళరావు రాజకీయాల నుంచి విరమించుకోగా, 1999జూన్ 12న కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment