సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన రోజే ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు. ప్రియాంకాగాంధీ రోడ్డు షోకు సునామీలా వచ్చారు. దీంతో జనమే కాంగ్రెస్ బలమని నిరూపితమైంది. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో సీపీఐ గెలుస్తుంది. ఒక్క పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న నేపథ్యాన వచ్చేనెల 9న కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. పాలేరు ప్రజలకు భవిష్యత్‌లో ఏం కావాలో శ్రీనివాసరెడ్డికి తెలుసు, ఉపేందర్‌రెడ్డిని చూసో.. వారి బాస్‌ను చూసో నేనేం భయపడటం లేదు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు’ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..
పాలేరు అక్కున చేర్చుకుంటోంది..
ప్రచారంతో పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పలుమార్లు తిరిగా. వారి కళ్లల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పడిన ఇబ్బందులు కనిపించాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు తీరుతాయనే ఆనందాన్నీ చూశాను. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ బాధలను చెబుతున్నారు. తెలంగాణ తెచ్చుకుంది వీరిని బాధల్లోకి నెట్టడానికా? తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేందుకే సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ ప్రజల కలలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్లలు చేసింది. మేం అధికారంలోకి రాగానే పాలేరులోనే కాదు.. రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరుతాయి.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...
తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకే కాంగ్రెస్ నేతల సంస్థలపై ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరేం చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 75 నుంచి 78 సీట్లు తప్పకుండా వస్తాయి. డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆరు గ్యారంటీలను అమలుచేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మా పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన సీపీఐ గెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సీపీఐ నేతల పర్యటనతో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోయింది. ఈ జనసంద్రం రాష్టమంతా ఉంది.
ప్రతీ కార్యకర్త కష్టపడాలి..
కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని అహర్నిశలు కష్టపడి, అవమానాలను, కేసులను ఎదుర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే సమయం ఉంది. ఆతర్వాత ఈ ప్రభుత్వాన్ని సాగనంపడమే. కార్యకర్తలు, అభిమానులు .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపు కోసం కృషి చేయాలి. బంధువులు, శ్రేయోభిలాషులంతా కాంగ్రెస్‌కు ఓటు వేసేలా చూడండి. వచ్చే ఐదేళ్లలో ఏ ఎమ్మెల్యేతోనూ అభద్రతాభావం ఎదురుకాదు. పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం.
తాగేందుకు నీరు లేని గ్రామాలు
మినరల్ వాటర్ మాదిరి తాగునీరు ఇచ్చామని బీఆర్‌ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో 34 నుంచి 35 శాతం పైగా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. పాలేరు నియోకజకవర్గంలో కొన్ని గ్రామాలకు వెళ్తే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కావాలని కోరుతున్నారు. ప్రస్తుత పాలకులు ఇవన్నీ చేస్తే ఎందుకు అడుగుతారు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితేంటి. డ్యామ్ నెర్రెలిచ్చింది. కేంద్ర అధికారులే నివేదికలు ఇచ్చారు. ఇలా ఏ పనినీ కేసీఆర్ ప్రభుత్వం సక్రమంగా చేయలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులు తీరుతాయనే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment