ఈసారి పాగా వేసే పార్టీ ఏదో! | - | Sakshi
Sakshi News home page

ఈసారి పాగా వేసే పార్టీ ఏదో!

Published Sat, Nov 18 2023 1:42 AM | Last Updated on Mon, Nov 20 2023 11:17 AM

- - Sakshi

శ్రీరాంపూర్‌: ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న సింగరేణిలో కార్మికవర్గం ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఎలా ఉన్నా కార్మిక క్షేత్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటోంది. దీనికి గత 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా కారు జోరు కొనసాగినా కోల్‌బెల్ట్‌ ప్రాంతానికి వచ్చేసరికి భిన్నమైన తీర్పు వచ్చింది.

నాడు ఈ ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ మెజార్టీ సీట్లు కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. ఈసారి తీర్పు ఎలా ఉంటుంది? ఏ పార్టీకి పట్టం కడతారు? అని అంతటా చర్చ సాగుతోంది. కార్మి కుల అండ ఏ జెండాకు ఉంటుందనే దా నిపై పార్టీలన్నీ దృష్టి సారించి ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. పార్టీలు.. వాటి అనుబంధ కార్మిక సంఘాలకు సింగరేణిలో ఉన్న బలంతో గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో గత వైభవాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌, గులాబీ మయం చేయడానికి బీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి

ఆరు జిల్లాలు.. 11 స్థానాలు..
తెలంగాణలో సింగరేణి ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 11 అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యక్షంగా, మరో మూడు అసెంబ్లీ స్థానాల్లో పరోక్షంగా సింగరేణి ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఆరు స్థానాలను కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. మిగతా రెండింటిని టీడీపీ, ఆలిండియా ఫార్మర్డ్‌ బ్లాక్‌ కై వసం చేసుకున్నాయి. వీరిలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన తర్వాత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మినహా మిగతా వారంతా ఆ పార్టీని వీడి కారెక్కారు. నాడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వారే నేడు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో నిలవడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన అభ్యర్థుల బలం గెలుస్తుందా? పార్టీ బలం గెలుస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

చేసిన మేలే గెలిపిస్తుందని బీఆర్‌ఎ్‌స్‌..
కార్మికులకు తమ హయాంలో చేసిన మేలు, కల్పించిన హక్కులు, సదుపాయల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు. కార్మికుల చిరకాల కోరిక అయిన కారుణ్య ఉద్యోగాల కల్పన, టీబీజీకేఎస్‌ సాధించిన విజయాలు లాభం చేస్తాయని బీఆర్‌ఎస్‌ నాయకత్వం విశ్వసిస్తోంది. ఆదాయ పన్ను కూడా మాఫీ చేయిస్తానని ఇటీవల మందమర్రిలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి కార్మికుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ సింగరేణికి చేసిన అన్యాయాన్నే బీఆర్‌ఎస్‌ నేతలు నేటి ప్రచారంలో ఏకరువు పెడుతున్నారు. అందుకే కేసీఆర్‌ సింగరేణి మంచిర్యాల, కొత్తగూడెంలో ఇటీవల నిర్వహించిన సభల్లో సింగరేణి ఓట్లు రాబట్టేందకు తన ఉపన్యాసంలో నాటి సింగరేణి దుస్థితికి కారణం కాంగ్రెస్‌ అని, కాంగ్రెస్‌తోనే సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానిది అయ్యిందంటూ తుర్పారబడుతున్నారు.

పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌..
2018 ఎన్నికల్లో సింగరేణి ఆరు జిల్లాల్లో గెలిచిన మూడు బీఆర్‌ఎస్‌ స్థానాలు కూడా మంచిర్యాల జిల్లా నుంచి కావడం విశేషం. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల స్థానాలు మినహా మిగతా చోట్ల బీఆర్‌ఎస్‌ గెలవలేదు. కొత్త గనులు రాకపోవడం, సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణ, సంస్థలో పెరిగిన రాజకీయ జోక్యం, రూ.వేల కోట్లు ప్రభుత్వ సంస్థలు సింగరేణికి బాకీ పడటం తదితర సమస్యలను కాంగ్రెస్‌ ఏకరువు పెట్టి గత వైభవాన్ని కాపాడుకునేలా ప్రచారం చేస్తోంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర పోటీలో ప్రస్తుతం ఈ 11 స్థానాలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ తరుణంలో కార్మికులు ఇచ్చే తీర్పు ఎంతో కీలకం కానుంది.

వివిధ పార్టీల నుంచి గెలిచి కారెక్కి..

గత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలిచిన నేతలు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఆత్రం సక్కు, రామగుండంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి విజయం సాధించిన కోరుకంటి చందర్‌, భూపాలపల్లిలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్‌రావు, ఇల్లందులో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన బానోత్‌ హరిప్రియ, పినపాకలో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన రేగా కాంతారావు, సత్తుపల్లిలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.

2018లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

నియోజకవర్గం పార్టీ గెలిచిన అభ్యర్థి

ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ ఆత్రం సక్కు

బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ దుర్గం చిన్నయ్య

చెన్నూరు బీఆర్‌ఎస్‌ బాల్క సుమన్‌

మంచిర్యాల బీఆర్‌ఎస్‌ ఎన్‌.దివాకర్‌రావు

రామగుండం ఫార్వర్డ్‌ బ్లాక్‌ కోరుగంటి చందర్‌

మంథని కాంగ్రెస్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

భూపాలపల్లి కాంగ్రెస్‌ గండ్ర వెంకటరమణారెడ్డి

కొత్తగూడెం కాంగ్రెస్‌ వనమా వెంకటేశ్వర్‌రావు

ఇల్లందు కాంగ్రెస్‌ బానోత్‌ హరిప్రియ

పినపాక కాంగ్రెస్‌ రేగా కాంతారావు

సత్తుపల్లి టీడీపీ సండ్ర వెంకటవీరయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement