‘రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్‌ తమ్మీ..’ | - | Sakshi
Sakshi News home page

‘రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్‌ తమ్మీ..’

Published Wed, Nov 22 2023 12:14 AM | Last Updated on Wed, Nov 22 2023 1:23 PM

- - Sakshi

నిర్మల్‌:‘రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్‌ తమ్మీ..’ ఓ సినిమాలో డైలాగ్‌ ఇది. ఈ మాట కూడా వాస్తవమే. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఎవరెవరు శత్రువులు.. ఎవరికి ఎవరు మిత్రులు.. అని చెప్పడమూ అసాధ్యమే. ఒకప్పుడు ఒకరిపై ఒకరు పోటీచేసి, కత్తులు దూసుకున్న వాళ్లే.. ఇప్పుడు చెట్టాపట్టాల్‌ వేసుకు తిరగొచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా జిల్లా రాజకీయాల్లోనూ మిత్రులనుకున్న వాళ్లు.. ప్రత్యర్థులయ్యారు. శత్రువులనుకున్న వాళ్లు మిత్రులుగా మారారు.

జిల్లా వినూత్నం..
నిర్మల్‌ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌కు రాజకీయ కేంద్రంగా గుర్తింపు ఉంది. ఇలాంటి చోట రాజకీయ సమీకరణలు ఎప్పుడెలా మారుతాయో.. సాధారణ ఓటర్‌కు అంతుచిక్కదు. కొంతమంది ఐదేళ్లపాటు ఒకపార్టీలో ఉండి.. ఎన్నికల వేళకు మరోపార్టీలోకి మారారు. కొత్తపార్టీ నుంచి.. ప్రజలకు పూర్తిగా పరిచయం కాని పార్టీ నుంచి.. విజయాలను అందుకున్నారు. రాజకీయ జీవితాన్నిచ్చిన వారిపైనే పోటీ చేసి నెగ్గారు. చిరకాల ప్రత్యర్థులు అనుకున్నవారు ఏకమై పార్టీ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. ఒకప్పుడు తమ ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నారు. ఇలా జిల్లా రాజకీయాలు ఎవరికీ అంతుబట్టకుండా సాగుతున్నాయి.

మిత్రులు.. ప్రత్యర్థులు..
నిర్మల్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నేతల్లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి ఇద్దరూ ఒకరితర్వాత ఒకరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగుదేశంలో కలిసి పనిచేశారు. 1985లో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్‌గా, 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991లో ఎంపీగా టీడీపీ నుంచి అల్లోల పనిచేశారు. ఇదే పార్టీలో ఉన్న చారి 1985 నుంచి1994 వరకు నిర్మల్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. 1991లో ఎంపీగా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి పరిస్థితుల్లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్‌లో కొనసాగారు. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వీరిద్దరు 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇందులో టీడీపీ నుంచి పోటీ చేసిన చారి గెలుపొందారు. 2008 లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో మరోసారి వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా ఈసారి చారిపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇంద్రకరణ్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు చారి బీఆర్‌ఎస్‌లో చేరి, ముధోల్‌ నుంచి పోటీచేసి ఓడారు. ఇదే ఎన్నికల్లో నిర్మల్‌లో బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచి, బీఆర్‌ఎస్‌లో చేరారు. అలా మళ్లీ పాత మిత్రులు ఒకే పార్టీలో కలిశారు. ప్రస్తుతం ఇద్దరూ జిల్లాలో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేస్తున్నారు.

గురుశిష్యుల పోటీ..
నిర్మల్‌ నియోజకవర్గ రాజకీయాల్లో గురుశిష్యులు గా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావు ఆ తర్వాత ప్రత్యర్థులుగా, మళ్లీ మిత్రులుగా ఇటీవల మళ్లీ ప్రత్యర్థులుగా మారారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, మహాకూటమిలో భాగంగా బీఆర్‌ఎస్‌ నుంచి శ్రీహరిరావు పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో వీరిద్దరూ కాకుండా ప్రజా రాజ్యం నుంచి పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి శ్రీహరి రావు, బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి మళ్లీ తలపడగా, అల్లోల గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీ ఆర్‌ఎస్‌లో చేరి మంత్రి కావడం, మొదట్లో శ్రీహరి రావుతో విభేదాలు కొనసాగడం నడిచాయి. 2018 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ అధిష్టానం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. ఆ ఎన్నికల్లో శ్రీహరిరా వు పోటీ నుంచి తప్పుకుని అల్లోల గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ వారిద్దరి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. కొన్ని నెలల క్రితం పార్టీ ని వీడిన శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరి మరోసారి ఎన్నికల్లో అల్లోలకు ప్రత్యర్థిగా నిలిచారు.

ప్రత్యర్థులు.. ప్రచారకర్తలు..
► నిర్మల్‌ నియోజకవర్గంలో గతంలో ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఇప్పుడు ఒకే అభ్యర్థి కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లకొండ సత్యనారాయణగౌడ్‌ పోటీచేశారు. అప్పుడు కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న అల్లోల గెలిచారు. అనంతరం సత్యనారాయణగౌడ్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన సతీమణి శోభారాణి జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యారు. ప్రస్తుతం సత్యనారాయణగౌడ్‌ అల్లోల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.

► 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి స్వతంత్ర అభ్యర్థి అర్గుల కమలాధర్‌గుప్తాపై గెలుపొందారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే బరిలో దిగిన నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీలో చేరి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోసం పనిచేస్తున్నారు.

► ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు అప్పటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి కొన్నిరోజులు ఒకే పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు.

► ఖానాపూర్‌ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన హరినాయక్‌ రమేశ్‌రాథోడ్‌కు ప్రత్యర్థిగా ఉండేవారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాథోడ్‌ కోసం హరినాయక్‌ ప్రచారం చేస్తున్నారు.

► ముధోల్‌ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి విఠల్‌రెడ్డి భంగపడ్డారు. కాంగ్రెస్‌ నారాయణరావుపటేల్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో విఠల్‌రెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీచేశారు. వేణుగోపాలచారి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీపడ్డారు. కేవలం 180 ఓట్ల తేడాతో చారి చేతిలో విఠల్‌రెడ్డి ఓడిపోయారు. 2014 ఎన్నిక సమయంలో విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకోగా, బీఆర్‌ఎస్‌ నుంచి వేణుగోపాలచారి, బీజేపీ నుంచి పడకంటి రమాదేవి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో నారాయణరావు పటేల్‌ బరిలో దిగలేదు. ఇందులో విఠల్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం విఠల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ రమాదేవి కూడా కారెక్కారు. దీంతో ప్రత్యర్థులుగా ఉన్న విఠల్‌రెడ్డి, వేణుగోపాలచారి, రమాదేవి ఒకే పార్టీ సభ్యులయ్యారు. ఇప్పుడు విఠల్‌రెడ్డి కోసం రమాదేవి ప్రచారం చేస్తున్నారు. వేణుగోపాలచారి వర్గం మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement