సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల కంటే ముందే గులాబీ బాస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. గతంలో మాదిరిగానే షెడ్యూల్ రాకుండానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు కేసీఆర్. అభ్యర్థులంతా ఎప్పటినుంచో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ప్రతి రోజూ మూడు నాలుగు సభల్లో ప్రసంగిస్తూ దూకుడు పెంచారు.
నామినేషన్లును పూర్తిచేసిన అభ్యర్థులు..
అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులంతా నామినేషన్లు వేసేశారు. ఇక ప్రచార జోరు తీవ్రం కానుంది. రెండు నెలల క్రితమే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం..ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అభ్యర్థులందరికీ బి ఫామ్స్ కూడా అందజేయటం పూర్తి చేసింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలుండగా...తొలి విడతలోనే 115 స్థానాలకు సెప్టెంబర్ 21న అభ్యర్థులను ప్రకటించించారు. నాంపల్లి, గోషామహల్, జనగామ, నర్సాపూర్ అభ్యర్థులను మాత్రం అప్పుడు పెండింగ్‌లో ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. మరికొద్ది రోజులకు నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డికి, ఇంకో రెండు స్థానాలకు టిక్కెట్లు కేటాయించారు.
రెండుస్థానాల్లో మార్పులు..
అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగించి...వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి...భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ...గులాబీ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళుతోంది. అందరికంటే ముందుగా జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అందులో రెండు స్థానాల్లో మాత్రమే మార్పులు చేసింది. మల్కాజ్‌గిరి స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ కేటాయించినప్పటికీ..ఆయన కొడుక్కి మెదక్ టిక్కెట్ రాకపోవడంతో పార్టీ మీదు బురద జల్లి...బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్‌లో చేరి తనకు మల్కాజ్‌గిరి, తన కొడుక్కి మెదక్ టిక్కెట్ తెచ్చుకుని బరిలోకి దిగారు. దీంతో మల్కాజ్‌గిరి స్థానం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్‌ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించింది. అలాగే ఆలంపూర్ నియోజకవర్గానికి మొదటి లిస్టులోనే అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ అక్కడి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవని గ్రహించి విజయుడుకు అవకాశం కల్పించారు. ఇలా రెండు స్థానాల్లో మినహా గులాబీ పార్టీలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బీ ఫార్మ్స్ నింపాలి..
2018లో ఎదురైన సమస్యలు.. అనుభవాల దృష్ట్యా నామినేషన్ల దాఖలు, బీ ఫామ్స్ భర్తీ విషయంలో గులాబీ పార్టీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నిపుణుల సమక్షంలోనే ఫార్మ్స్ నింపాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల పేపర్లు నింపేటప్పుడు ఏమరుపాటు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే నింపాలని కూడా ఆదేశించారు.
గతంలో గెలుపొందిన అభ్యర్థుల్లో పది మందికి పైగా అనర్హత కేసులు ఎదుర్కొనడమే గాకుండా వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావటంతో ఈ అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది పార్టీ. వాటి వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కచ్చితంగా ఈసారి ఏ చిన్న అవకాశం కూడా పక్క పార్టీలకు ఇవ్వకూడదని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ఇక ప్రచారం విషయంలో కూడా రాబోయే 15 రోజులు గులాబీదళం కీలకంగా వ్యవహరించనుంది.
కేసీఆర్ రాకతో గ్రౌండ్ లెవెల్‌లో మార్పులు..
పార్టీ అభ్యర్థుల కోసం గులాబీ బాస్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికి తొలివిడత ప్రచారం ముగిసింది. దీపావళి తర్వాత రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. గ్రౌండ్ లెవెల్ లో మొదటి విడత షెడ్యూల్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఏ విధంగా ఉందనే దానిపై కేసీఆర్ ఆరా తీశారు. అంతకుముందున్న కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ.. కేసిఆర్ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే పరిస్థితిలో మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment