జనగామ నియోజకవర్గ గొప్ప రాజకీయ చరిత్ర.. ఈ సారి మాత్రం.. | Rich Political History Of Janagama Constituency | Sakshi
Sakshi News home page

జనగామ నియోజకవర్గ గొప్ప రాజకీయ చరిత్ర.. ఈ సారి మాత్రం..

Published Thu, Aug 10 2023 12:26 PM | Last Updated on Thu, Aug 17 2023 1:21 PM

Rich Political History Of Janagama Constituency - Sakshi

జనగామ నియోజకవర్గం

2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చేర్యాల నియోజకవర్గం రద్దై జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

జనగామ నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై 28490ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. యాదగిరి రెడ్డిపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా, ఆయన భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. కాగా పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్‌ ఐ పార్టీ చివరి వరకు టిక్కెట్‌ ఖరారు చేయలేదు. మద్యలో తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్‌ ఇక్కడ నుంచి పోటీచేస్తారని భావించారు. కానీ చివరికి బిసి నేతగా పొన్నాలకే కాంగ్రెస్‌ ఐ టిక్కెట్‌ ఇచ్చింది. అయినా పలితం దక్కలేదు.

ముత్తిరెడ్డికి 91036 ఓట్లు రాగా పొన్నాలకు 62546 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్‌.ఎఫ్‌ బి అభ్యర్దిగా పోటీచేసిన లక్ష్మణ్‌ భీమాకు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ ఆవిర్భావం బిల్లు ఆమోదం పొందాక తెలంగాణ కాంగ్రెస్‌ఐకి  అద్యక్షుడుగా అయిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన సొంత నియోజకవర్గం జనగామలో 2014లో కూడా భారీతేడాతో ఓడిపోయారు. తెలంగాణలో అదికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఆశించగా, ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీకి అప్రతిష్టగా మారింది.

2014లో పొన్నాల టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎమ్‌.యాదగిరిరెడ్డి చేతిలో 32695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్దిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి 21113 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా ఆంద్రప్రదేశ్‌ సమైఖ్య రాష్ట్రంలో పనిచేసిన రికార్డు పొందారు. లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలిచి, నేదురుమల్లి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో గెలిచాక వై.ఎస్‌. క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. అనంతరం రోశయ్య, కిరణ్‌ క్యాబినెట్‌లలో మంత్రిగా కొనసాగారు.

2004, 2008 ఉప ఎన్నికలోను చేర్యాలలో గెలుపొందిన టిఆర్‌ఎస్‌ నేత కె.ప్రతాపరెడ్డి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో జనగామ నుంచి పోటీచేశారు. 2009లో టిఆర్‌ఎస్‌ తరపున, 2014లో బిజెపి తరపున పోటీ చేసి ఓటమి చెందారు. జనగామలో ఏడుసార్లు రెడ్లు, ఆరుసార్లు బిసి (మున్నూరుకాపు), రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఎస్‌.సిలు గెలుపొందారు. జనగామలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి తొమ్మిదిసార్లు, సిపిఎం రెండు సార్లు, టిడిపి ఒకసారి, టిఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచాయి.

ఒకసారి పిడిఎఫ్‌ గెలిచింది. అయితే ఈ నియోజకవర్గం  ద్విసభ్య స్థానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌తోపాటు పిడిఎఫ్‌ కూడా ఒక సీటు గెలుచుకుంది. 1967లో ఇక్కడ గెలిచిన కమాలుద్దీన్‌ అహ్మద్‌ 1962లో చేర్యాలలో నెగ్గారు. ఈయన వరంగల్‌ నుంచి ఒకసారి, హనుమకొండ మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పిసిసి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. కొద్దికాలం బిజెపిలో చేరి ప్రణాళిక సంఘం సభ్యునిగా కూడా వ్యవహరించారు. గోకా రామలింగం ఇక్కడ ఒకసారి, భువనగిరిలో మరోసారి గెలుపొందారు. అయితే 1962లో రామలింగం ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించి సిపిఐకి చెందిన రాఘవులు ఎన్నికైనట్లు ప్రకటించింది.

చేర్యాల (2009లో రద్దు)

1962లో ఏర్పడిన చేర్యాల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ (ఐ)లు కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి. టి.ఆర్‌.ఎస్‌. 2 సార్లు,  గెలిచింది. తెలుగుదేశం అభ్యర్దిగా నిమ్మ రాజిరెడ్డి నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా మహమ్మద్‌ కమాలుద్దీన్‌ 1962లో చేర్యాలలోను, 1967లో జనగామలోను గెలుపొందారు.

కమాలుద్దీన్‌ లోక్‌ సభకు కూడా ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బిజెపిలో చేరి ప్రణాళికా సంఘం సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు. నిమ్మ రాజిరెడ్డి 1989లో ఎన్‌.టి.ఆర్‌.క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2009లో ఈ నియోజకవర్గం రద్దు అయింది. ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, రెండుసార్లు ముస్లింలు గెలుపొందారు.

జనగామ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement