అభ్యర్థుల పోటాపోటీ
ఖర్చు చేయడంలో రెండు ప్రధాన పార్టీలు ముందున్నాయి. మంచిర్యాల నియోజకవర్గం, బెల్లంపల్లి, చెన్నూరులో పోటాపోటీగా సాగుతున్నాయి. ఇప్పటికే జన సమీకరణ, బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఇతర పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తల చేరికల కోసం రోజువారీగా అభ్యర్థులకు రూ.లక్షల్లో ఖర్చవుతోంది. ఇక రవాణా, భోజనాలు రో జువారీగా వందలాది మందికి చేయించాల్సి వస్తోంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఖర్చు మొదలైనప్పటికీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత ఎక్కువైంది. ప్రధాన అభ్యర్థులు తేలాక, నామినేషన్లు, బరిలో ఉన్నవారు ఎవరో స్పష్టమైతే ఇప్పుడున్న ఖర్చుకు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో దసరా పండుగ కలిసి రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. గెలుపే లక్ష్యంగా ఒకరితో మరొకరు పోటీ పడి ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా ఖర్చు చేస్తుండడంతో వ్యయం పెరిగిపోతోంది. ఇప్పటికే బతుకమ్మ సంబరాలకు ముందే అభ్యర్థులు సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో బహిరంగంగా కా కుండా ఇంకా చాటుమాటున తాయిలాలు అందిస్తున్నారు. ఇక తొమ్మిది రోజుల బతుకమ్మ, దుర్గాదేవీ వేడుకల కోసం మహిళలకు డీజే బాక్సులు అందజేశారు. ఎవరో ఒకరు ఈ తరహా పంపిణీ ప్రారంభించడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులపై వాటి ప్రభావం పడింది. దీంతో కొందరికి కొనిచ్చి మరికొందరికి ఇవ్వకపోతే లేనిపోని చిక్కులని ఒకరిద్దరు అభ్యర్థులు వాటి జోలికి వెళ్లలేదు. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు కొన్ని చోట్ల డీజే బాక్సులు అందించారు. దుర్గాదేవీ ప్రతిష్టించిన చోట పలు రకాలుగా సాయం అందిస్తున్నారు. దీంతో మిగతా వారు సైతం తమకు కూడా ఇవ్వాలంటూ అందరూ బారులు తీరడంతో మధ్యలోనే నిలిపివేశారు. భీమారంలో ఇటీవల ఓ బీఆర్‌ఎస్ నాయకుడు సౌండ్ సిస్టం బాక్సులు పంపిణీ చేయడం తెలిసిందే. దండేపల్లి మండలంలో ఓ జాతీయ పార్టీ ఓటర్లకు మందు క్వార్టర్ల కోసం టోకెన్లు పంపిణీ చేసింది.
నేరుగా అడుగుతున్న వైనం
అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకుని పోలింగ్ వరకు తమ వర్గంగా ఉండేందుకు ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని కొందరు నేరుగా పండుగకు తమకు ఏమిస్తారని కింది స్థాయి నాయకుల వద్ద అడుగుతున్నారు. దీంతో దసరా పండుగకు ఓటర్లకు జీవాలు ఇచ్చి మటన్, చికెన్, మద్యం బాటిళ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రామాల్లో ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు కుల సంఘాలు, యువజన సంఘాలు, తదితర గ్రూపుల వారీగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. పండుగ వేళ వచ్చిన వారందరినీ ఏదో ఒక రకంగా ప్రసన్నం చేసుకునేందుకు దసరా దావత్ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పోలింగ్ సమ యం దాకా అభ్యర్థులకు అనుచర వర్గం, నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లను భరించక తప్ప డం లేదు. దీంతో జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు పండుగ పూట మరింత అదనపు భారం తప్పేలా లేదు.
Comments
Please login to add a commentAdd a comment