సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు సొంత పార్టీలో కొందరి నాయకుల అత్యుత్సాహం పక్కలో బల్లెంల మారిందా? మనమే గెలుస్తామనే భ్రమ ఆయనకు మరోసారి చేటు చేస్తుందా? అనే ప్రశ్నలకు జవాబులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పిడింది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బెల్లంపల్లిలో మాత్రం ఆ గాలి ఎటు వైపు వీస్తు్‌ందోనని సందేహాలు వస్తున్నాయి.
వినోద్ ఆర్థికంగా ఉన్న నాయకుడిగా జనంతోపాటు నాయకులు, కార్యకర్తల్లో ముద్రపడ్డారు. ఎన్నికల వేళ పార్టీలో చేరుతున్న వారిలో ఎక్కువగా ఏదో ఆశించి చేరుతున్నారని ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. కొందరు అభిమానంతో ఉన్నారు. ఇంకొందరు ఆయన ప్రత్యర్థితో వైరంతో ఇటు వైపు చేరారు. మరోవైపు ఇన్నాళ్లు టికెట్ ఆశించి భంగపడిన గ్రూప్‌లో పనిచేసిన వారంతా ఇప్పటికిప్పుడు వినోద్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేస్తున్నారా? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. వినోద్ గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది కలుగుతుందని భావించేవారు ఆయన వెనకాలే ఉండి ఏం చేస్తారనే సందేహాలు ఉన్నాయి.
నమ్మకం ఎంతవరకు?
నియోజకవర్గంలో కొందరు నాయకులు ఎవరు ఎటు వైపు పని చేస్తున్నారో ప్రశ్నార్థకంగా మారింది. పైకి జై కొడుతూనే అటు, ఇటు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. పూటకో పార్టీ మార్చుతూ అనుమానాస్పదంగా మారారు. ధనవంతుడనే ఆశతో ఎన్నికల వేళ లబ్ధి కోరి చేరి, తీరా అనుకున్నది దక్కకపోతే మేలు కంటే కీడు చేసే వారు లేకపోలేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో లాగే ఆయన్ని మళ్లీ ముంచేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018ఎన్నికల్లో వినోద్ చెన్నూరు నుంచి టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించారు.
టికెట్ దక్కక ఆ పార్టీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు బీఎస్పీ నుంచి తొలిసారిగా బెల్లంపల్లి బరిలో నిలిచారు. నాడు, నేడు ప్రధాన ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో వినోద్ ఓటమి పాలయ్యారు. చిత్రంగా ఆ సమయంలో వినోద్ పక్కాగా గెలుస్తారని ప్రచారం జరిగింది. సర్వేలు అదే విషయం వెల్లడించాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోలింగ్‌కు ముందు చేసిన ప్రీపోల్ సర్వేలో తెలంగాణ ఫలితాలు అంచనా వేస్తూ, బెల్లంపల్లిలో వినోద్ గెలుపు పక్కా అని చెప్పడంతో అంతా అదే భ్రమలో ఉండిపోయారు.
కానీ ఫలితాల్లో బోల్తా పడ్డారు. సొంత నాయకులే డబ్బులు తీసుకుని తనను ఓడగొట్టారని వినోద్ ఆవేశంగా మాట్లాడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడేమి లేవనే విశ్లేషకులు భావిస్తున్నారు. అదే ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం సీపీఐ మద్దతు ఇస్తున్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
చల్లారని లోకల్ ‘చిచ్చు’
వినోద్ నియోజకవర్గంలో ఉండరనే పెద్ద అపవాదు మూటగట్టుకున్నారు. ఈసారి ప్రచారంలో నేను ఇక్కడే ఉంటానని పదే పదే చెబుతూ ప్రమాణాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే తీరుగా ఇక్కడే ఉంటాననే హామీలు ఇచ్చి కనిపించకుండాపోయి, ఎన్నికల సమయానికే వచ్చారని నాయకులే అంటున్నారు. ఇప్పటికీ బెల్లంపల్లిలో కాకుండా మంచిర్యాల నుంచే ప్రచారానికి వస్తూ వెళ్తున్నారు. మరోవైపు ఇ క్కడే ఉంటామని వినోద్ సతీమణి రమాదేవి, కూతురు వర్షతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రమాణాలను ఓటర్లు ఎంతవరకు నమ్ముతున్నారనేది వచ్చే ఫలితాలే చెప్పనున్నాయి. స్థా నికంగా ఉన్నవారికే గెలిపించాలనే ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో ఓట్లు ఎటు మల్లుతాయో వేచి చూడాలి. రూ.కోట్లు కుమ్మరిస్తున్న వినోద్ ఈసారైనా గెలుపు తీరం చేరుతారా? అని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment