నార్కట్‌పల్లి : మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామానికి ఓ ప్రత్యేక ఉంది. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు నేతలు 2009 నుంచి వివిధ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ, మునుగోడు స్థానాల్లో, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య బరిలో ఉంటున్నారు. వీరు గత ఎన్నికల్లోనూ వీరు ఇవే స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉండడం విశేషం.
వీరి రాజకీయ ప్రస్థానం ఇలా..
● బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఆయన 1999 ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అక్కడి నుంచే బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో మినహా మిగతా నాలుగు సార్లు ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
● కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంట్ బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఓటమి పాలయ్యారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున మునుగోడులో పోటీ చేసి విజయం సాధించారు. 2022లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.
● ఇదే గ్రామానికి చెందిన చిరుమర్తి లింగయ్య 2009 శాసనసభ ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నకిరేకల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment