అంబర్‌పేట నియోజకవర్గం
2009లో నియోజకవర్గ పునర్ విభజనలో హిమాయత్‌నగర్ నియోజకవర్గం రద్దై అంబర్‌పేట నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.
అంబర్‌పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డిని టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసిన కొత్త అభ్యర్ది కాలేరు వెంకటేష్ ఓడిరచడం విశేషం. వరసగా మూడుసార్లు హిమయత్ నగర్, అంబర్‌పేటల నుంచి గెలిచిన కిషన్ రెడ్డి 2018లో 1016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కిషన్ రెడ్డి గెలుపొంది కేంద్రంలో సహాయ మంత్రి కావడం.. తదుపరి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందడం మరో ప్రత్యేకత. కాగా అంబర్‌పేటలో వెంకటేష్ తొలిసారి గెలిచారు. వెంకటేష్‌కు 61558 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డికి 60542 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ నుంచి పోటీచేసిన తెలంగాణ జనసమితి అభ్యర్ది రమేష్ ముదిరాజ్‌కు కేవలం నాలుగువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. కాలేరు వెంకటేష్ బీసి వర్గాలలోని వంజారా సామాజిక వర్గానికి చెందినవారు. అంబర్‌పేట నియోజకవర్గంలో 2014లో జి.కిషన్‌రెడ్డి మూడోసారి తన సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్ నేత ఎడ్ల సుధాకరరెడ్డిపై 62598 బారీ ఆదిక్యతతో విజయం సాధించారు. కిషన్‌రెడ్డి పార్టీ ఉమ్మడి రాష్ట్ర శాఖ అద్యక్షుడుగా, శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు 16575 ఓట్లు మాత్రమే తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ నేత వి.హెచ్ ఒకసారి హిమయత్ నగర్ నుంచి గెలుపొంది మంత్రిపదవి పొందారు. ఆ తర్వాత పిసిసి అద్యక్షుడు అయ్యారు. తదుపరి మూడుసార్లుగా రాజ్యసభ సభ్యత్వం పొందారు.
హిమాయత్‌నగర్ (2009లో రద్దు)
రాజధాని నగరంలో పలు సంచలనాలకు కేంద్రంగా ఉన్న హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం 1978లో ఏర్పడిది. ఈ నియోజకవర్గంలో ఎన్నికై ముఖ్యమ్కెన పదవులు చేపట్టాలనుకున్న కొందరు ముఖ్యులు ఓటమి పాలవడం ఇక్కడి ప్రత్యేకత. రెండు సార్లు జరిగిన ఉప ఎన్నికలలో ఇద్దరు ప్రముఖులు ఓటమికి గురి అయితే, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత ఎ.నరేంద్ర ఆ రెండుసార్లు గెలుపొందడం విశేషం. 1983లో శాసనసభకు ఎన్నికైన తెలుగుదేశం శాసనసభ్యుడు జి. నారాయణరావు గౌడ్ ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్రధారులలో ఒకరుగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర ఇక్కడ పోటీచేయగా, బిజెపి నేత నరేంద్ర చేతిలో ఆయన ఓడిపోయారు.
ఆ తర్వాత 1992లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.హనుమంతరావు రాజ్యసభకు ఎన్నికైన కారణంగా రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో ఒకరిగా ఉన్న సి.జగన్నాధరావు కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేయగా, అప్పుడు కూడా బిజెపి అభ్యర్దిగా పోటీచేసిన నరేంద్ర గెలుపొందడం విశేషం. వి.హెచ్ కూడా మంత్రి పదవి చేసి, తదుపరి ఏపిసిసి అధ్యక్షుడు అయి, అనంతరం రాజ్యసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. రెండు ఉప ఎన్నికలతో సహా 9సార్లు ఎన్నికలు జరిగితే బిజెపి నాలుగుసార్లు, టిడిపి మూడుసార్లు జనతా, కాంగ్రెస్ ఐలు ఒక్కొక్కసారి గెలిచాయి.
ఇక్కడ టిడిపి పక్షాన గెలిచిన కృష్ణయాదవ్ రాష్ట్ర మంత్రి అవడం ఒక విశేషమైతే ఆయన స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలవడం మరో ప్రత్యేకత. బిజెపి మాజీ నేత నరేంద్ర తదుపరి కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరి ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 1978లో జనతా పార్టీ తరపున హిమాయత్‌నగర్‌లో శాసనసభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ అంతకుముందు 1957లో ఖమ్మం నుంచి కూడా గెలిచారు. ఆమె తదుపరి మూడుసార్లు ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎమ్.పి.గా ఉన్నారు. ఇక్కడ తొమ్మిదిసార్లు బిసి నేతలు గెలుపొందగా ఒకసారి కమ్మ, మరోసారి రెడ్డి నేతలు గెలుపొందారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment