హన్మకొండ: తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో విజయమే లక్ష్యంగా పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందు పడరాని పాట్లు పడుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ప్రలోభాలు మొదలు పెట్టారు. నగరం, పట్టణాల్లోని వార్డులు, కాలనీలు, గ్రామాల్లో పురవీధుల్లో అభ్యర్థులు పాదయాత్ర చేస్తూ ఇంటింటికీవెళ్లి నేరుగా ఓటర్లను కలుస్తూ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి తమ ప్రసంగాల ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతలను తమ నియోజకవర్గాలకు రప్పించుకుంటున్నారు. ప్రధానంగా ప్రజాకర్షణ ఉన్న నేతలను తీసుకువచ్చేందుకు పోటీ పడుతున్నారు.
నియోజకవర్గాల్లో నోట్ల వరద..
ప్రజల్లో తమ బలం చూపించుకునేందుకు అభ్యర్థులు ప్రచారం నుంచి మొదలు.. ప్రలోభాల వరకు పోటీ పడుతున్నారు. ప్రచార సమయంలో ప్రజలను పెద్ద ఎత్తున పోగు చేస్తున్నారు. అక్కడి నుంచే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న వారికి కూడా ఎంతో కొంత సొమ్ము ముట్ట చెప్పుతున్నారని బహిరంగ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా మరో వైపు కమ్యూనిటీ వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కుల వృత్తులు, ఉద్యోగ, కార్మిక, అసోసియేషన్లు, కాలనీ కమిటీల వారీగా కమ్యూనిటీ సమావేశాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పగలు మధ్యాహ్న భోజనం, రాత్రి విందు రాజకీయాలు జోరందుకున్నాయి. కమ్యూనిటీ మీటింగ్‌లకు వచ్చిన వారికి స్థాయికి తగ్గట్టు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.5వేల వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. కమ్యూనిటీ మీటింగ్‌ల్లో ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి ఉన్న వారికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వ్యక్తిగతంగా అందజేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల్లో నోట్ల వరద పారుతోంది.
ఎత్తుకు పైఎత్తులు..
పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు కోవర్టులను ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థి ఎత్తుగడలను తెలుసుకుంటూ వారికి దీటుగా మరో ఎత్తుగడ వేస్తూ ముందుకెళ్తున్నారు. ఎదుటి పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో వారు కోరుకున్న మేరకు.. చేసిన డిమాండ్ మేరకు సమర్పించుకుంటూ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకున్నారు.
వ్యూహాలకు పదును..
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల వారీగా, నగరాలు, పట్టణాల్లో వార్డులు, కాలనీ వారీగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుని అభ్యర్థులు వారికి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా తమ వ్యూహాలు మారుస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వారికి అవసర హామీలు ఇవ్వడం.. అవసరమైన ప్రలోభాలకు గురి చేయడం ద్వారా తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే క్రమంలో పార్టీ క్యాడర్‌ను పూర్తిగా నమ్మకుండా, తమకు నమ్మకమైన వ్యక్తుల ద్వారా కార్యాన్ని కానిస్తున్నారు. ఎదుటి పార్టీలు, అభ్యర్థులపై నిఘా పెడుతూ ప్రత్యర్థి పార్టీ ఎంత ఇస్తుంది.. మనమెంత ఇవ్వాలని లెక్కలు తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment