సనత్ నగర్ నియోజకవర్గం
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి గెలిచారు. దీనితో ఆయన ఐదుసార్లు గెలిచినట్లయింది. ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు సికింద్రాబాద్ నుంచి, రెండుసార్లు సనత్‌నగర్ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల వరకు ఆయన టిడిపిలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. 2018లో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి మరోసారి గెలిచి మళ్లీ మంత్రి కాగలిగారు. తలసాని తన సమీప తెలుగుదేశం ప్రత్యర్ది కూన వెంకటేష్ గౌడ్‌పై 30651 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు.
తలసానికి 66464 ఓట్లు రాగా, వెంకటేష్ గౌడ్‌కు 35813 ఓట్లు తెచ్చుకున్నారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీచేసింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన బవర్ లాల్ వర్మకు 14200 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. తలసాని యాదవ వర్గానికి చెందినవారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 2014లో తలసాని శ్రీనివాసయాదవ్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి విఠల్‌పై 27461 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కేంద్ర ప్రకృతి వైపరీత్యాల సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిదర్ రెడ్డి కనీసం రెండో స్థానంలో కూడా లేకపోవడం విశేషం.
శశిదర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కుమారుడు. సనత్‌నగర్‌లో నాలుగుసార్లు విజయం సాధించారు. 1989లో ఇక్కడ నుంచి చెన్నారెడ్డి గెలిచాక ఓ ఏడాదిపాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. అనంతరం ఆయన గవర్నరు పదవి చేపట్టడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా 1992లో జరిగిన ఉప ఎన్నికలో శశిధర్‌రెడ్డి గెలిచారు. తదుపరి మరో మూడుసార్లు గెలుపొందారు. చెన్నారెడ్డి వికారాబాద్, తాండూరు, మేడ్చల్ నుంచి కూడా గతంలో గెలుపొంది మొత్తం ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
సనత్‌నగర్ అసెంబ్లి స్థానానికి కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు గెలిచాయి. టిఆర్‌ఎస్ ఒకసారి గెలిచింది. శ్రీనివాసయాదవ్ గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో కూడా పనిచేశారు. టిడిపి నేత శ్రీపతి రాజేశ్వర్ సనత్‌నగర్‌లో రెండుసార్లు, అంతకు ముందు ముషీరాబాద్‌లో ఒకసారి గెలిచారు. ఎన్.టి.ఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా పేరొందిన రాజేశ్వర్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లో సభ్యునిగా కూడా వున్నారు. శశిధర్‌రెడ్డి అప్పట్లో కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లో పనిచేశారు. సనత్ నగర్‌లో ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు గెలిస్తే ఐదుసార్లు బిసి నేతలు, ఒకసారి కమ్మ నేత గెలుపొందారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment