ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విషయంలో ఉత్కంఠకు తెర పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్టీపరంగా బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రాష్ట్రంలో అధికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చోటు దక్కగా, ఉమ్మడి జిల్లా పరంగా పరిశీలిస్తే.. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కులకు చుక్కెదురైంది.
ఇక్కడ బోథ్ నుంచి జెడ్పీటీసీ జాదవ్ అనిల్ కుమార్, ఖానాపూర్ నుంచి భూక్యా జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మిలను ప్రకటించారు. ఇక ఆదిలాబాద్ జనరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి బరిలో నిలవనున్నారు.
తీవ్ర ప్రయత్నాలు..
బోథ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మరోసారి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు నిరాశే ఎదురైంది. మాజీ ఎంపీ గొడం నగేశ్ కూడా విస్తృతంగా ప్రయత్నించారు. ఆయనకు కూడా మొండి చెయ్యి ఎదురైంది. ఖానాపూర్ నుంచి రేఖానాయక్‌కు అధిష్టానం ఆశీస్సులు దక్కలేదు. ఆమెతో పాటు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ శర్వన్ నాయక్ సైతం ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌కు ఆప్తుడుగా ఉన్న జాన్సన్ నాయక్ రానున్న ఎన్నికల్లో పార్టీ పరంగా అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.
బీఆర్‌ఎస్ సంబరాలు..
ఎమ్మెల్యే జోగు రామన్నకు మరో సారి టికెట్ ఖరారుకావడంపై స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు సంబ రాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ఎమ్మెల్యే రామన్నను భుజాన ఎత్తుకొని నృత్యాలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్‌రంజాని, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అజయ్, అష్రఫ్, నాయకులు సాజిద్ పాల్గొన్నారు. అలాగే బోథ్ నియోజకవర్గంలో అనిల్‌జాదవ్‌కు టికెట్ దక్క డంపై పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు.
ఆరోసారి బరిలో.. ఎమ్మెల్యే జోగు రామన్న
ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆరోసారి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి నాలుగోసారి పోటీకి రెడీ అంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తిరిగి ఆయనకు చోటు దక్కింది. నాలుగు సార్లు శాసన సభ్యుడిగా గెలిచిన ఆయన 2014 తెలంగాణ మొదటి శాసనసభకు ఎన్నికై రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఓటమి..
జోగు రామన్న రాజకీయ చరిత్రలో గెలుపోటములు ఉన్నాయి. 2004లో టీడీపీ అభ్యర్థిగా ఆది లాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సి.రాంచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009లో టీడీపీ నుంచి పో టీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సీఆర్‌ఆర్‌పైనే గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 2011లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఆ ఏడాది నవంబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి సీఆర్‌ఆర్‌పై గెలిచారు. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై గెలుపొందారు. 2018లోనూ మరోసారి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన శంకర్‌పై గెలుపొందారు.
రాజకీయ చరిత్ర..
టీడీపీతో జోగు రాజకీయ ఆరంగేట్రం జరిగింది. 1984లో పార్టీలో చేరారు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్‌గా వ్యవహరించారు. 1995 నుంచి 2001 వరకు జైనథ్ ఎంపీపీగా కొనసాగారు. తర్వాత జైనథ్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. కిందిస్థాయి పదవుల నుంచి ఎమ్మెల్యే, మంత్రి వరకు ఎదిగారు.
బీఆర్‌ఎస్‌తో కలిసొచ్చేనా.. అనిల్ జాదవ్
గతంలో మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిల్ జాదవ్ ఈసారి బీఆర్‌ఎస్ నుంచి కలిసొస్తుందో.. లేదోననేది కాలం నిర్ణయించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్టీ పరంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించగా, అందులో బోథ్‌ని యోజకవర్గం నుంచి అనిల్ జాదవ్ పేరు ఉంది.
అధికార పార్టీ నుంచి బీఆర్‌ఎస్ జెడ్పీటీసీగా కొనసాగుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ పరంగా టికెట్ సాధించాలని విశ్వప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో ఉండడం ద్వారా అధిష్టానం దృష్టిలో పడడంతో పాటు నియోజకవర్గంలోని ఇతర ద్వితీయశ్రేణి నేతల సపోర్ట్‌ను సాధించడంలో విజయం సాధించారు.
రెండు దశాబ్దాల రాజకీయం..
అనిల్ జాదవ్ రెండు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మొదట టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి మాతృ పార్టీలోనే చేరి ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామపంచాయతీకి నాలుగు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు.
మొత్తంగా రాజకీయ కుటుంబం నుంచే అనిల్ జాదవ్ వచ్చారు. ఉద్యమ కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరిన అనిల్ జాదవ్ 2004లోనే బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే అప్పట్లో అనూహ్యంగా టీఆర్‌ఎస్ నుంచి సోయం బాపురావుకు టికె ట్ దక్కడంతో నిరుత్సాహం చెందారు. అప్పటికీ పార్టీలోనే కొనసాగినప్పటికీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.
2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికి అప్పుడు టీడీపీ అభ్యర్థి గొ డం నగేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయ న టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు చేతిలో ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్ టిక్కెట్ బోథ్ నుంచి సోయం బాపురావుకు దక్కడంతో అనిల్‌జాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచినప్పటికీ 28,206 ఓట్లు సాధించడం ద్వారా గుర్తింపు పొందారు.
బాపురావుకు.. నో..
ప్రస్తుతం బోథ్ నుంచి ఎమ్మెల్యేగా రాథోడ్ బాపురావు ఉన్నారు. అయితే మూడోసారి పార్టీ పరంగా పోటీ చేయాలనుకున్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవల ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ వెళ్లిన ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్‌రావును కలిశారు. అప్పుడే ఈసారి టికెట్ ఇవ్వడంలేదని వారు చెప్పడం జరిగింది.
అయితే అప్పటి నుంచి అక్కడే ఉన్న ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆదివారం తన అనుచరులు జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి మరోసారి రాథోడ్ బాపురావుకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బయట జరిగే ప్రచారాలు, ఊహగానాలు నమ్మవద్దని చెప్పారు. చివరికి జాబి తాలో చోటు దక్కకపోవడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.
వరుసగా రెండుసార్లు..
ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్(ప్రస్తుత బీఆర్‌ఎస్)లో కొనసాగిన రాథోడ్ బాపురావు అప్పట్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. 2014లో పార్టీ పరంగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జాదవ్ అనిల్‌పై గెలుపొందారు. 2018లోనూ మరోసారి టికెట్ దక్కించుకొని పార్టీ పరంగా పోటీచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపురావుపై గెలుపొందారు. మూడోసారి పార్టీ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు.
టికెట్ దక్కని ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు. జిల్లాకు తిరిగి వచ్చిన ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచిచూడాల్సిందే. పార్టీ అభ్యర్థికి సహకరించాలన్న అధిష్టానం సూచనలు పాటిస్తారా.. లేనిపక్షంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment