గూడెం చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్)
ఆదిలాబాద్: రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తంలో నగదుతో బయటకు వెళ్లినా ప్రయాణాలు చేసినా తస్మత్ జాగ్రత్త.. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధిక మొత్తంలో డబ్బులతో పోలీసులకు దొరికితే జప్తు.. లేదా పేకాట పేరుతో కేసులు నమోదు చేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో పెద్దమొత్తంలో డబ్బు, మద్యం, ఆయుధాలు అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అంతర్‌జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిరంతరం వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు.
ఆధారాలు లేకుంటే జప్తే..
ఎన్నికల సమయంలో నగదు, బంగారం, మద్యం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. సొంతడబ్బు అయినా లెక్క చూపాల్సిందే. రూ.50 వేలకు పైగా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే వాటికి తగిన ఆధారాలు చూపించాలి. లేదంటే జప్తు చేయక తప్పదు. ఎక్కువ మాట్లాడితే పేకాట పేరుతో కేసులు నమోదు చేయడం ఖాయం.
రికవరీ ఏజెంట్లు..
ఏదైనా సంస్థలో రికవరీ ఏజెంట్లుగా పనిచేసేవారైతే పనిచేస్తున్న కంపనీ గుర్తింపుకార్డు, కలెక్షన్ చేయాల్సిన బాధితుడి పేరు, సెల్‌నంబర్‌తో కూడిన లిస్టు, ఆరోజు ఎవరెవరు ఎంత కలెక్షన్ ఇచ్చారో వారి సంతకంతో కూడిన వివరాలు అధికారులకు చూపించాలి.
అప్పుగా తీసుకుంటే..
అవసరం నిమిత్తం ఎవరి వద్దనైనా అప్పుగా తీసుకుని వెళ్తుండగా పోలీసులకు పట్టుబడితే ఎవరివద్ద తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? తదితర వివరాలతో పాటు ప్రామిసరీ నోటు వెంట ఉంచుకోవాలి. ఒకవేళ ఆస్పత్రి బిల్లులు కట్టాల్సివస్తే పేషెంట్ పేరు, ఆస్పత్రికి సంబంధించిన బిల్లులు వెంట ఉంచుకోవాలి.
నిబంధనలు తప్పనిసరి..
ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 69–ఏ ప్రకారం ఎవరైనా తమవద్ద ఉన్న డబ్బు, బంగారం, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఒకచోట నుంచి మరోచోటుకు తరలించే ముందు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించడం తప్పనిసరి.
ఆధారాలు లేకుంటే అంతే..
రానున్న సాధారణ ఎన్నికల దృశ్యా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి సమయంలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడితే తగిన ఆధారాలు చూపించని పక్షంలో డబ్బు జప్తు చేయబడుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు.
ఆధారాలు చూపించకుంటే వాటిని ఆదాయపుపన్ను శాఖ ఖాతాలో వేస్తారు. అక్కడి నుంచి డబ్బు పొందాలంటే చుక్కలు లెక్క పెట్టాల్సిందే. లేదంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆధారాలు సరిగా లేకపోతే 30 శాతం పన్నుకింద తీసుకుని మిగతా డబ్బులు ఇస్తారు. ఈ నిబంధనలు తెలియక చాలామంది పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తూ చెక్‌పోస్టుల వద్ద పట్టుబడుతుంటారు.
బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే..
బ్యాంకు నుంచి రూ.50 వేలకంటే ఎక్కువగా విత్‌డ్రా చేస్తే ఆధారాలు అవసరం. బ్యాంకు అధికారి ఇచ్చిన ఓచర్ స్లిప్ విధిగా వెంట ఉంచుకోవాలి. సెల్ఫ్ చెక్ ద్వారా అయితే సంబంధిత చెక్ జిరాక్స్ కాపీ, ఏటీఎం ద్వారా డ్రా చేస్తే మిషన్ ద్వారా వచ్చిన స్లిప్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటే వ్యక్తిగత డిక్లరేషన్, బ్యాంకు పాస్‌బుక్ వెంట ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment