ఆదిలాబాద్: ‘మీ ఊరు చిన్నగా ఉంది. మీ ఊరు మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించాలి. దీనికి ఎకరం భూమి ఇస్తే.. రూ. 6 లక్షల విలువైన డబుల్ బెడ్‌రూం ఇస్తాం..’ అంటూ అధికారపార్టీ నేతలు మాటలు చెప్పి ఆ కుటుంబం నుంచి ఎకరం భూమిని సర్కారుకు దానం చేసినట్లు రాయించేశారు. ఏళ్లుగా ఈ విషయం తెలియని బాధితుడు ఇటీవల బయటపడటంతో కన్నీరుమున్నీరవుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. పెంబి మండలం, నాగాపూర్‌కు చెందిన బోసు లక్ష్మి, తిరుపతి దంపతులకు గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2018లో ఎకరం భూమిఇస్తే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని, మీకు డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, అప్పటి బీఆర్‌ఎస్ పెంబి మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు. వారు చెప్పినట్లు సంతకాలు పెట్టామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇల్లు రాకపోవడంతో భూమికోసం వెళ్తే అసలు విషయం బయట పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకున్న ఆధారాన్నీ ఇలా గుంజుకుంటే ఎట్లా బతకాలని కన్నీరుమున్నీరవుతున్నారు. తాజా మాజీ కలెక్టర్ వరుణ్‌రెడ్డిని కలిస్తే ప్రభుత్వానికి దానంగా ఇచ్చినట్లు ఉందని చెప్పారన్నారు. తమకు తెలియకుండా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీన్ని రద్దు చేసి తమ భూమి తమకివ్వాలని ఆ బాధిత దంపతులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మణ్‌ని వివరణ కోరగా రిజిస్ట్రేషన్ 2018లో జరిగింది. అప్పట్లో నేను ఇక్కడ విధులు నిర్వహించలేదు. ఈ విషయం నాకు పూర్తిగా తెలియదని చెప్పారు. త్వరలోనే పరిశీలిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment