సాక్షి,ఆదిలాబాద్: బోథ్ కాంగ్రెస్‌లో లొల్లి షురూవైంది. ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారై ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వన్నెల అశోక్‌ను అధిష్టానం మార్చబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. అసమ్మతి వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థి వన్నెల అశోక్ నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన ప్రచార రథాలు ఇప్పటికే సిద్ధమై తిరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో తాజా పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
అసమ్మతే కారణమా..!
కాంగ్రెస్ రెండో జాబితా అక్టోబర్ 27న విడుదలైంది. అందులోనే బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ వన్నెల అశోక్‌ను పార్టీ ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో అసమ్మతి వర్గం నిరసన తెలిపింది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నరేశ్‌జాదవ్‌తో పాటు ఆడె గజేందర్ ఇచ్చోడలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. పేరు ఖరారైన దృష్ట్యా ఇక పార్టీ నిర్ణయాన్ని మార్చదనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే బీ–ఫామ్ ఇవ్వకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే అధిష్టానం పిలుపుతో హైదరాబాద్ వెళ్లిన వన్నెల అశోక్ రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం నియోజకవర్గంలోని తాంసి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ప్రచార రథాలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాయి. నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. మరోపక్క అభ్యర్థిని మార్చుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
జోరుగా చర్చ..
పార్టీలో ఈ అంశంపై ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. అశోక్‌కు అధిష్టానం మరో భరోసా కూడా ఇచ్చిందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమా.. కాదా అన్నదానిపై స్పష్టత లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భీంపూర్ మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయించడంతో పాటు జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెడతారనే హామీ ఆయనకు ఇచ్చారని కొంత మంది ఆ పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.
మరోపక్క ఈనెల 8న జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఈ విషయంలో నిర్ణయం జరగవచ్చని చెప్పుకుంటున్నారు. అయితే అశోక్‌ను మార్చే విషయంలో పార్టీ అభిప్రాయం ఏవిధంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరమే. ప్రధానంగా ఆయన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వర్గంగా కొనసాగుతున్నారు.
ఒకవేళ ఈ నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటే ఆయన స్పందన ఎలా ఉంటుందనే దానిపై కూడా పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన స్థానంలో ఆడె గజేందర్‌ను ఖరారు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా నిర్ణయం జరిగితే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తీవ్రరూపం దాల్చే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment