సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వివిధ రాజకీయ పార్టీల ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. బీఆర్‌ఎస్ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించింది. కొద్దిరోజుల్లో పార్టీ బీఫాంలు అందజేయనుండగా వారిలో గుబులు మొదలైంది. కాగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. దసరాలోపు అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పెడతాయా? లేదా.. మరింత జాప్యం చేస్తాయా? అని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఎప్పుడో?
ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసినీరెడ్డి పోటీ పడుతున్నారు. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ టికెట్ ఆశిస్తున్నారు.
బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా పలువురు ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దసరా లోపే జాబితా ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీల్లో సర్వేల ఆధారంగా అభ్యర్థుల వడపోత జరగనుంది. ఆ తర్వాత మిగలిన పేర్లు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయా పార్టీలో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌లో ఇదీ పరిస్థితి..
కాంగ్రెస్ టికెట్ విషయంలో నియోజకవర్గాల వారీగా కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బోథ్ నుంచి ఇంకా ఎవరిపేరు తెరపైకి రాలేదు. అయితే ఆ పార్టీ నుంచి అభ్యర్థుల జాబితా ఖరారైనప్పుడే ఈ ఉత్కంఠకు తెరపడే పరిస్థితి ఉంది.
మహిళా అభ్యర్థుల ఆశలు..
కాంగ్రెస్ నుంచి గండ్రత్ సుజాత, బీజేపీ నుంచి చిట్యాల సుహాసినీరెడ్డి ఆయా పార్టీల అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది అమలుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మహిళా ఆశావహులపై పార్టీల పరిశీలన ఎలా ఉంటుందనే విషయంలో వారు ఆశలు పెట్టుకున్నారు. పార్టీలు అవకాశం కల్పిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మహిళా నేతలు ఆసక్తి కనబర్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment