సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున కాంగ్రెస్ హవా కొనసాగగా, పశ్చిమ జిల్లాలో కమలం వికసించింది. మధ్యలో కారు ప్రయాణం సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమన్యాయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల చరిత్రలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం.
కలిసొచ్చిన ముక్కోణ పోటీ..
నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ), అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(బీఆర్‌ఎస్), కూ చాడి శ్రీహరిరావు(కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చివరికి బీజేపీ బయటపడింది. సిర్పూర్‌లో బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ బరిలో ఉండడంతో ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఓట్లు పంచుకున్నాయి.
ముథోల్‌లో బీఆర్‌ఎస్‌కు మై నార్టీ ఓట్లు కలిసి రాగా, ఇక్కడ కాంగ్రెస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోవడంతో మిగతా వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. ఆదిలాబాద్‌లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 6వేల మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదట బోథ్ స్థానంలోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నిలిచింది. ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు బీఆర్‌ఎస్ 22వేల మెజార్టీ సాధించింది.
ఎస్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్..
పది స్థానాల్లో ఎనిమిది చోట్ల చతికిల పడ్డ బీఆర్‌ఎస్ మూడు ఎస్టీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ బీఆర్‌ఎస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కోవ లక్ష్మీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాదని అనిల్ జాదవ్‌కు అవకాశం ఇస్తే, గెలిచారు. ఈ మూడు స్థానాల్లో ఖానాపూర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అప్పటి టీఆర్‌ఎస్‌కు రాగా ఆసిఫాబాద్ ఎస్టీ స్థానం మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చింది. ఇక్కడ ఈసారి బీఆర్‌ఎస్ గెలుచుకుంది.
అసెంబ్లీకి కొత్త ముఖాలు..
రెండో ప్రయత్నంలో రామారావు పాటిల్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్‌బాబు, ఆదిలా బాద్ నుంచి పాయల్ శంకర్, బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తొలిసారిగా శాసనభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వినోద్, కోవ లక్ష్మీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు.
సిట్టింగ్‌ల ఓటమి!
సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పది మంది ఓటమి పాలయ్యారు. నిర్మల్‌లో సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాలుగు సార్లు గెలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, సిర్పూర్‌లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లి చిన్నయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు బీఆర్‌ఎస్ నుంచి టికెట్లు రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment