ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ టికెట్ విషయంలో నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ పేరు తెరపైకి వచ్చింది. శనివారం ఉదయం నుంచి ఇది మొదలైంది. ప్రస్తుతం స్థానికంగానే ఉన్న ఆయనను నేరడిగొండలోని తన నివాసంలో రోజంతా పలువురు నాయకులు కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన గృహానికి తరలివస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనని అంటున్నారు. మొదటి జాబితాలోనే బోథ్ నియోజకవర్గ అభ్యర్థిని పార్టీ ప్రకటించనున్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
నగేశ్‌కు చుక్కెదురు..
మాజీ ఎంపీ గోడం నగేశ్‌కు టికెట్ విషయంలో చుక్కెదురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో ఆయన కూడా హైదరా బాద్ బయల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం ఆయన కేటీఆర్, హారీశ్ రావును కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగేశ్ ఆశిస్తున్న బోథ్ టికెట్ ఇవ్వడం కుదరదని ఆ నేతలు చెప్పినట్లు సమాచారం. తనకు ఎలాంటి హామీ లభించకపోవడంతో నగేశ్ నిరుత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేశ్‌తో నేతల భేటీలు వేర్వేరుగా జరిగినట్లు తెలుస్తోంది.
రాథోడ్ బాపురావుకు బుజ్జగింపులు..
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో శుక్రవారం ఆయన ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఈసారి పార్టీ పరంగా టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, వివరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలపరిచే అభ్యర్థికి సహకరించాలని సూచించారు.
గిరిజన కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాథోడ్ బాపురావు ఉద్యమకాలంలో పార్టీ వెంట ఉన్నానని, టీచర్ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లో రావడం జరిగిందన్నారు. రెండుసార్లు ప్రజలు ఆదరించారని, ఈ సారి కూడా తాను గెలుస్తానన్న నమ్మకం ఉందని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఇరువురు ముఖ్యనేతలతో భేటీ అనంతరం బాపురావు నిరాశగా వెనుదిరిగినట్లు తెలుస్తోంది. శనివారం సీఎంతో భేటీ అయ్యేందుకు ప్రగతిభవన్‌లో ఉన్నారు. అయితే ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు.
భవిష్యత్ కార్యాచరణ..
ఎమ్మెల్యే బాపురావుకు అధిష్టానం బుజ్జగింపుల అనంతరం శనివారం సాయంత్రం నుంచి ఆయన అనుచరులు కొంతమంది వాట్సాస్ స్టేటస్‌లలో టికెట్ ఎవరికి వచ్చినా తాము కార్యకర్తలుగా పార్టీకోసం పని చేస్తామని పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఉన్న బాపురావు శనివారం రాత్రి బయల్దేరి ఇక్కడి చేరుకుంటారని, ఆదివారం కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment