anil jadav
-
‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే.. -
TS Election 2023: బోథ్ బీఆర్ఎస్ టికెట్ దాదాపుగా ఖరారు.. తెరపైకి అనిల్ జాదవ్ పేరు!
ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ టికెట్ విషయంలో నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ పేరు తెరపైకి వచ్చింది. శనివారం ఉదయం నుంచి ఇది మొదలైంది. ప్రస్తుతం స్థానికంగానే ఉన్న ఆయనను నేరడిగొండలోని తన నివాసంలో రోజంతా పలువురు నాయకులు కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన గృహానికి తరలివస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనని అంటున్నారు. మొదటి జాబితాలోనే బోథ్ నియోజకవర్గ అభ్యర్థిని పార్టీ ప్రకటించనున్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నగేశ్‌కు చుక్కెదురు.. మాజీ ఎంపీ గోడం నగేశ్‌కు టికెట్ విషయంలో చుక్కెదురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో ఆయన కూడా హైదరా బాద్ బయల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం ఆయన కేటీఆర్, హారీశ్ రావును కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగేశ్ ఆశిస్తున్న బోథ్ టికెట్ ఇవ్వడం కుదరదని ఆ నేతలు చెప్పినట్లు సమాచారం. తనకు ఎలాంటి హామీ లభించకపోవడంతో నగేశ్ నిరుత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేశ్‌తో నేతల భేటీలు వేర్వేరుగా జరిగినట్లు తెలుస్తోంది. రాథోడ్ బాపురావుకు బుజ్జగింపులు.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో శుక్రవారం ఆయన ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఈసారి పార్టీ పరంగా టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, వివరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలపరిచే అభ్యర్థికి సహకరించాలని సూచించారు. గిరిజన కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాథోడ్ బాపురావు ఉద్యమకాలంలో పార్టీ వెంట ఉన్నానని, టీచర్ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లో రావడం జరిగిందన్నారు. రెండుసార్లు ప్రజలు ఆదరించారని, ఈ సారి కూడా తాను గెలుస్తానన్న నమ్మకం ఉందని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఇరువురు ముఖ్యనేతలతో భేటీ అనంతరం బాపురావు నిరాశగా వెనుదిరిగినట్లు తెలుస్తోంది. శనివారం సీఎంతో భేటీ అయ్యేందుకు ప్రగతిభవన్‌లో ఉన్నారు. అయితే ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు. భవిష్యత్ కార్యాచరణ.. ఎమ్మెల్యే బాపురావుకు అధిష్టానం బుజ్జగింపుల అనంతరం శనివారం సాయంత్రం నుంచి ఆయన అనుచరులు కొంతమంది వాట్సాస్ స్టేటస్‌లలో టికెట్ ఎవరికి వచ్చినా తాము కార్యకర్తలుగా పార్టీకోసం పని చేస్తామని పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఉన్న బాపురావు శనివారం రాత్రి బయల్దేరి ఇక్కడి చేరుకుంటారని, ఆదివారం కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది. -
రసవత్తరంగా రెండో దశ!
నేటి శుక్రవారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత ఎన్నికలు పలువురు అధికార పార్టీ ముఖ్య నాయకులకు కీలకం కానున్నాయి. ఎందుకంటే, ఈ ఎన్నికలు జరగనున్న మండలాలతో ఆయా నాయకులకు ప్రత్యేక సంబంధం ఉండటమే కారణం. కాబట్టి ఆ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ఇప్పుడు సదరు నేతలకు సవాలుగా మారింది. బోథ్నియోజకవర్గంలో ఈ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినప్పటికీ ఆయా మండలాల్లో ఇతర నేతలు కూడా బాగానే పలుకుబడి కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ‘నాయకులు పలుకుబడి’ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు! గుడిహత్నూర్, తలమడుగు, బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో నేడు పోలింగ్ జరగనుంది. గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అటు జెడ్పీటీసీ స్థానాలు గెలవడంతోపాటు ఇటు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! దీంతో ఇప్పుడు ఐదు మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికల్లో గెలవడం అధికార పార్టీ నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు. సాక్షి, ఆదిలాబాద్: రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్యే..బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని తాంసి, భీంపూ ర్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో మిగిలిన మండలాల్లో జరుగుతుండటంతో గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఆ లెక్కను సమం చేయాలని ఆయన భావిస్తున్నారు. నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్ మండలాల్లో ఆయన ప్రచారం కూడా చేపట్టలేదు. నేరడిగొండలో అనిల్ జాదవ్ బరిలో ఉండటంతో ఆ మండలం విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. బజార్హత్నూర్ మండలంలో ఎంపీ నగేష్ అనుచరులు పోటీ చేస్తుండటంతో ఆ మండలంలోనూ బాపూరావు కలుగజేసుకోలేదు. గుడిహత్నూర్‌లో ఎమ్మెల్యే అనుచరుడు పోటీ చేస్తున్నప్పటికీ ఆయన అక్కడ కూడా ప్రచారం చేయకపోవడం విస్మయం కలిగించే అంశమే! ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే బాపూరావుకు సవాలుగా మారనున్నాయనేది సుస్పష్టం! గోడం నగేష్, ఎంపీ ఎంపీ గోడం నగేష్ సొంత మండలం బజార్హత్నూర్. ఇక్కడ ఆయన అనుచరులు పోటీ చేస్తుండటంతో ఈ మండలంలో వారి గెలుపు కీలకం కానుంది. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన నగేష్‌కు అప్పుడు ప్రచారం విషయంలో బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో పొసగలేదనే ప్రచారముంది. బజార్హత్నూర్లో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురుకావడంతో ఇక్కడ గెలుపు సవాలుగా మారనుంది. బీజేపీ నుంచి ఏకంగా 14 మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడటం ఈ మండల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది. చివరికి పార్టీ బీ–ఫాం ఒకరికి ఇచ్చినప్పటికీ ఆ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపూరావు విస్తృతంగా పర్యటించడంతో ఇక్కడ గోడం వర్సెస్ సోయం అన్న చందంగా పోటీ నెలకొంది. లోక భూమారెడ్డి, డెయిరీ చైర్మన్ ప్రాదేశిక ఎన్నికల్లో తలమడుగు మండలంలో తన సమీప బంధువుకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించాలని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరుడికి కట్టబెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన జెడ్పీటీసీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తున్న లోక భూమారెడ్డికి ఈ మండలంలో ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే ప్రచారంలో ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు బాహాటంగానే ప్రస్పుటమయ్యాయి. చివరి రోజు బుధవారం ప్రచారంలో ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ఆయన తలమడుగు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార విషయం గురించి ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు కనీసం సమాచారం కూడా అందించలేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఎమ్మెల్యే అనుచరుడే బరిలో ఉన్నప్పటికీ గెలుపోటముల ప్రభావం కొంత లోక భూమారెడ్డిపై కూడా ఉండనుంది. డీసీసీబీ అధ్యక్షుడు ముడుపు దామోదర్‌రెడ్డి తలమడుగు మండలానికి చెందినవారే. దీంతో అక్కడి ఎన్నికల్లో ఆయనపై కూడా గెలుపు బాధ్యత నెలకొంది. అనిల్ జాదవ్, జెడ్పీటీసీ అభ్యర్థి బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎన్నికలు ఈరోజు జరగనుండగా, అందులో మూడు స్థానాలు జనరల్ కాగా, బోథ్ జనరల్(మహిళ) రిజర్వ్ అయింది. ఇక నేరడిగొండ ఒక్కటే ఎస్టీ(జనరల్) రిజర్వ్ ఉంది. ఇక్కడి నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన అనిల్ జాదవ్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఆయన గెలుపు కీలకం కానుంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి ఈ మండలంలో ప్రచారం కూడా ఆయన ఒక్కడే నిర్వహించడం గమనార్హం! లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన అనిల్ జాదవ్ అధినాయకుల అండతోనే జెడ్పీ చైర్మన్ పదవిపై భరోసాతోనే జెడ్పీటీసీ బరిలో దిగారనే ప్రచారమూ జరుగుతోంది. జిల్లాలోని ఇతర మండలాల అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులతో ఆయన ఇప్పుడే టచ్‌లో ఉండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. -
టార్గెట్.. అనిల్
సాక్షి, ఆదిలాబాద్: జెడ్పీచైర్మన్ పదవి ఆశిస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి నేరడిగొండ జెడ్పీటీసీగా బరిలోకి దిగిన అనిల్ జాదవ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు లోస్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎస్టీ (జనరల్) రిజర్వు అయిన ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ పదవిపై అధికార పార్టీ నుంచి అనిల్ జాదవ్ ఆశలు పెట్టుకున్నారు. ఆయనను జెడ్పీటీసీగానే ఇక్కడే నిలువరించడం ద్వారా రాజకీయంగా దెబ్బతీయాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ జాదవ్‌పై వారిద్దరు ఎందుకు దృష్టి పెట్టాల్సి వస్తుందంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలప్పుడు జరిగిన పరిణామాలు ఇందుకు కారణమవుతున్నాయి. అనిల్ ఓటమికి ఎత్తుగడలు నేరడిగొండ జెడ్పీటీసీ స్థానం ఎస్టీ (జనరల్) రిజర్వు అయింది. అనిల్‌జాదవ్ టీఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోయం, రాథోడ్ నేరడిగొండలో అనిల్‌ను ఎలాగైనా నిలువరించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి సోయం బాపురావు, అనిల్ జాదవ్ టికెట్ ఆశించారు. 2009, 2014లో బోథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ పోటీ చేసినా ఓటమి చెందారు. దీంతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం సోయం పేరును ఖరారు చేయడంతో అనిల్‌జాదవ్ నిరుత్సాహం చెందారు. కాంగ్రెస్ రెబల్‌గా ఆయన బోథ్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రాథోడ్ బాపురావు ఆ నియోజకవర్గంలో వరుసగా మరోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు 6,400పై చిలుకు ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన అనిల్ జాదవ్ 28 వేల ఓట్లు సాధించినా ఓటమి చెందాడు. అయితే అనిల్ రెబల్‌గా పోటీ చేయడంతోనే సోయం బాపురావు ఓటమి పాలయ్యాడని అనుచరులు మదన పడ్డారు. ఈ నేపథ్యంలో అనిల్‌పై రాజకీయ అదను కోసం సోయం బాపురావు ఎదురు చూస్తుండగా ఇప్పుడు అవకాశం లభించింది. రాథోడ్‌కు ఇలా.. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన అనిల్ జాదవ్‌ను అప్పట్లో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎన్నికల అనంతరం సస్పెన్షన్ ఎత్తివేశారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం రాథోడ్ రమేశ్‌ను ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. అనిల్ టీఆర్ఎస్లో చేరేందుకు యత్నిస్తున్నాడన్న సమాచారం మేరకు రాథోడ్ రమేశ్ రంగలోకి దిగాడు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నా యకులను సమన్వయం చేసుకునేందుకు రాథోడ్ రమేశ్ యత్నించారు. అందులో భాగంగా అప్ప ట్లో అనిల్‌జాదవ్‌ను రాథోడ్ రమేశ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, భార్గవ్‌దేశ్ పాండేలు కలిసి టీఆర్ఎస్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ప్రయత్నిం చారు. అయినా నామినేషన్ల పర్వం నడుస్తున్న సందర్భంలో అనిల్‌జాదవ్ హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామం రాథోడ్ రమేశ్‌కు కంటగింపుగా మారింది. తాను స్వయంగా వెళ్లి కలిసినా అనిల్ జాదవ్ టీఆర్ఎస్లో చేరడంపై ఆయనలో ఆగ్రహం వ్యక్తం అయింది. రాజకీయంగా అనిల్‌పై ప్రతీకారం పెంచుకున్నాడు. అదును కోసం ఎదురుచూస్తుండగా ఇప్పుడు జెడ్పీచైర్మన్ ఆశతో నేరడిగొండ జెడ్పీటీసీగా బరిలో దిగిన అనిల్‌జాదవ్‌ను ఓడించేందుకు నేరడిగొండపై ప్రత్యేక దృష్టి సారించారు. పాచిక.. సోయం బాపురావు, రాథోడ్ రమేశ్‌లు ఇద్దరు నేరడిగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అనిల్ జాదవ్‌ను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నుంచి ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని సోయం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన అనిల్ జాదవ్‌కు ఆ సామాజికవర్గం ఓట్లు పడకుండా కాంగ్రెస్ నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని జెడ్పీటీసీగా బరిలోకి దించాలని రాథోడ్ రమేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇరువురి నేతలు ఇటీవల నేరడిగొండలో పర్యటించి కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో నేరడిగొండలో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బరిలో... జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికల నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకే ఆ పార్టీ బీ–ఫామ్ ఇస్తారు. అయితే అనిల్ జాదవ్ మొదటి రోజే బీ–ఫామ్ లేకుండానే నామినేషన్ వేశారు. పరోక్షంగా పార్టీలో ఎవరినో హెచ్చరించేందుకే ఆయన నామినేషన్ వేశారనేది పార్టీలో చర్చ సాగుతోంది. ఆదివారం బీ–ఫామ్‌తో మందిమార్బలంతో వచ్చి మరోసారి నామినేషన్ వేస్తానని అని ల్ తన అనుచర గణంతో పేర్కొన్నారు. అయితే అనిల్ జాదవ్ నేరడిగొండ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండడం ఓ ముఖ్యనేతకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రేపటి నాడు జెడ్పీచైర్మన్‌గా ఉన్నత పదవిలో ఉంటే బోథ్ నియోజకవర్గంలో బలమైన నేతగా తయారై పార్టీలోనే పోటీగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కొంతమంది ముఖ్యనేతలు ఆశీస్సులు ఉండటంతోనే అనిల్ జాదవ్ పోటీకి రెడీ అవుతున్నట్లు చర్చ సాగుతోంది. ఏదేమైనా ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. -
బలహీనవర్గాలకు కాంగ్రెస్ అండ
బజార్హత్నూర్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది బడుగుల జీవితాలు మారుతాయేమోనని ఎదురుచూశామని కాని ఇక్కడ దొరల పాలనతో బడుగుల జీవితాలు దుర్భరంగా మారాయని ఒక్క సంవత్సరం ఆగితే బడుగుబలహీనవర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని దిగ్నూర్ గ్రామంలో పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అరచేతిలో అద్భుతం చూపిస్తోందని, దళితబస్తీ భూములు, డబుల్బెడ్రూం ఇళ్లు, ఇప్పటి వరకు ఎంత మందికి లబ్ధి చేకూర్చారో తెలిపాలని టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన చెరువులకు రంగులద్ది కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిరాశతో ఉన్నారని, యువత తిరగబడి దొరల పాలనకు చరమగీతం పాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వినర్ కానిందే ఉద్దవ్, ఎస్సీ కన్వీనర్ దావెంతు నర్సయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సల్మాన్, రవి, సంజీవ్, కల్లెం విఠల్ పాల్గొన్నారు. -
ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం
గుడిహత్నూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేస్తోందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బెల్లూరిలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పల్లెపల్లెకు అనిల్ అన్న’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రం సాధించుకున్నామన్న ఆనందం రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా కన్పించడం లేదని, ప్రభుత్వ పాలన తీరుతో ప్రజలు విసుగెత్తి పోతున్నారన్నారు. అనవసర పథకాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ... కమీషన్ల ద్వారా సొంత బడ్జెట్ పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తమకు అర్హతలు ఉన్నప్పటికీ మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇవ్వడంలేదని గోడు వెల్లబోసుకున్నారు. ప్రతిపక్షాలైన మీరైనా న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమల్‌గౌడ్, మన్నూర్ పీఏసీఎస్ చైర్మన్ కేంద్రే వెంకట్రావ్, నాయకులు భీంరావ్ నాయక్, తెలంగే మాధవ్, దోమకొండ సుధాకర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
2019లో కాంగ్రెస్‌దే అధికారం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ విధానాలపై పోరాడతాం నేరడిగొండ : 2019లో రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం లింగట్ల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకేసారి రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని సీఎం కేసీఆర్ చెప్తున్నాడని, తను మాత్రం ఎడెకరాల స్థలంలో రూ. 50 కోట్లతో ఇళ్లు కట్టుకుంటున్నాడని విమర్శించారు. పింఛన్లు ఇవ్వడం గొప్పకాదు, లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో బలోపేతం చేస్తామని తెలిపారు. ఆ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అధికసంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గారడీ మాటాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బోథ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మండల నాయకులు ఆడే వసంత్, బాబులాల్, రాజశేఖర్‌రెడ్డి, సాబ్లే ప్రతాప్‌సింగ్, ఆదుముల్ల భూషన్, లచ్చన్న, గులాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.