గోడం నగేష్, ఎంపీఅనిల్ జాదవ్, జెడ్పీటీసీ అభ్యర్థి రాథోడ్ బాపూరావు, డెయిరీ చైర్మన్ ఎమ్మెల్యే,లోక భూమారెడ్డి,
నేటి శుక్రవారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత ఎన్నికలు పలువురు అధికార పార్టీ ముఖ్య నాయకులకు కీలకం కానున్నాయి. ఎందుకంటే, ఈ ఎన్నికలు జరగనున్న మండలాలతో ఆయా నాయకులకు ప్రత్యేక సంబంధం ఉండటమే కారణం. కాబట్టి ఆ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ఇప్పుడు సదరు నేతలకు సవాలుగా మారింది. బోథ్‌నియోజకవర్గంలో ఈ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినప్పటికీ ఆయా మండలాల్లో ఇతర నేతలు కూడా బాగానే పలుకుబడి కలిగి ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ‘నాయకులు పలుకుబడి’ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు! గుడిహత్నూర్, తలమడుగు, బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్ మండలాల్లో నేడు పోలింగ్ జరగనుంది. గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అటు జెడ్పీటీసీ స్థానాలు గెలవడంతోపాటు ఇటు ఎంపీపీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! దీంతో ఇప్పుడు ఐదు మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికల్లో గెలవడం అధికార పార్టీ నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు.
సాక్షి, ఆదిలాబాద్: రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్యే..బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని తాంసి, భీంపూ ర్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో మిగిలిన మండలాల్లో జరుగుతుండటంతో గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఆ లెక్కను సమం చేయాలని ఆయన భావిస్తున్నారు. నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్ మండలాల్లో ఆయన ప్రచారం కూడా చేపట్టలేదు.
నేరడిగొండలో అనిల్ జాదవ్ బరిలో ఉండటంతో ఆ మండలం విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. బజార్‌హత్నూర్ మండలంలో ఎంపీ నగేష్ అనుచరులు పోటీ చేస్తుండటంతో ఆ మండలంలోనూ బాపూరావు కలుగజేసుకోలేదు. గుడిహత్నూర్‌లో ఎమ్మెల్యే అనుచరుడు పోటీ చేస్తున్నప్పటికీ ఆయన అక్కడ కూడా ప్రచారం చేయకపోవడం విస్మయం కలిగించే అంశమే! ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే బాపూరావుకు సవాలుగా మారనున్నాయనేది సుస్పష్టం!
గోడం నగేష్, ఎంపీ
ఎంపీ గోడం నగేష్ సొంత మండలం బజార్‌హత్నూర్. ఇక్కడ ఆయన అనుచరులు పోటీ చేస్తుండటంతో ఈ మండలంలో వారి గెలుపు కీలకం కానుంది. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన నగేష్‌కు అప్పుడు ప్రచారం విషయంలో బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో పొసగలేదనే ప్రచారముంది. బజార్‌హత్నూర్‌లో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురుకావడంతో ఇక్కడ గెలుపు సవాలుగా మారనుంది. బీజేపీ నుంచి ఏకంగా 14 మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడటం ఈ మండల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది. చివరికి పార్టీ బీ–ఫాం ఒకరికి ఇచ్చినప్పటికీ ఆ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపూరావు విస్తృతంగా పర్యటించడంతో ఇక్కడ గోడం వర్సెస్ సోయం అన్న చందంగా పోటీ నెలకొంది.
లోక భూమారెడ్డి, డెయిరీ చైర్మన్
ప్రాదేశిక ఎన్నికల్లో తలమడుగు మండలంలో తన సమీప బంధువుకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించాలని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరుడికి కట్టబెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన జెడ్పీటీసీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తున్న లోక భూమారెడ్డికి ఈ మండలంలో ఎన్నికలు కీలకం కానున్నాయి.
అయితే ప్రచారంలో ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు బాహాటంగానే ప్రస్పుటమయ్యాయి. చివరి రోజు బుధవారం ప్రచారంలో ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ఆయన తలమడుగు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార విషయం గురించి ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు కనీసం సమాచారం కూడా అందించలేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఎమ్మెల్యే అనుచరుడే బరిలో ఉన్నప్పటికీ గెలుపోటముల ప్రభావం కొంత లోక భూమారెడ్డిపై కూడా ఉండనుంది. డీసీసీబీ అధ్యక్షుడు ముడుపు దామోదర్‌రెడ్డి తలమడుగు మండలానికి చెందినవారే. దీంతో అక్కడి ఎన్నికల్లో ఆయనపై కూడా గెలుపు బాధ్యత నెలకొంది.
అనిల్ జాదవ్, జెడ్పీటీసీ అభ్యర్థి
బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎన్నికలు ఈరోజు జరగనుండగా, అందులో మూడు స్థానాలు జనరల్ కాగా, బోథ్ జనరల్(మహిళ) రిజర్వ్ అయింది. ఇక నేరడిగొండ ఒక్కటే ఎస్టీ(జనరల్) రిజర్వ్ ఉంది. ఇక్కడి నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన అనిల్ జాదవ్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఆయన గెలుపు కీలకం కానుంది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ నుంచి ఈ మండలంలో ప్రచారం కూడా ఆయన ఒక్కడే నిర్వహించడం గమనార్హం! లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన అనిల్ జాదవ్ అధినాయకుల అండతోనే జెడ్పీ చైర్మన్ పదవిపై భరోసాతోనే జెడ్పీటీసీ బరిలో దిగారనే ప్రచారమూ జరుగుతోంది. జిల్లాలోని ఇతర మండలాల అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులతో ఆయన ఇప్పుడే టచ్‌లో ఉండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment