godam nagesh
-
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..!
బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్‌ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రాయి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో ఉండే దొరలైనా ఆదిలాబాద్‌లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఇవి చదవండి: సీఎం హామీల జల్లు! -
నడ్డాను కలిసిన ‘సోయం’
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని నడ్డా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్వ తంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని సోయం ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. రాజీకి రాష్ట్ర నేతల యత్నం.. బీజేపీ ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోయంను బుజ్జగించే యత్నం చేశారు. కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి హామీ ఇచ్చారు. అప్పు డే సోయం తనకు నడ్డా లేనిపక్షంలో బీఎల్ సంతోష్ ద్వారా హామీ ఇచ్చినట్లయితే పరిశీలన చేస్తానన్నారు. విషయాన్ని కొద్ది రోజులు నాన్చడంతో ఈ హామీ లభించకపోవచ్చనే ప్రచారం జరిగింది. ఇది లా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ బాధ్యులతో కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ రోజు తెలంగాణ ఇన్చార్జి సునిల్ బన్సల్ కూడా అందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోయంను పార్టీ ఆఫీస్‌లో చర్చలకు పిలిచినా ఆయన హాజరుకాలేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యే ద్వారా రాయబారం.. ఎంపీ సోయంతో రాష్ట్ర నేతల రాజీయత్నాలు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి.. మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవిస్ ద్వారా ఎంపీ సోయం బంధువు అయిన కిన్వట్ ఎమ్మెల్యే కేరం భీంరావుతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగి సోయంను చర్చల కోసం శుక్రవారం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నడ్డాను ఈ నేతలు కలిశారు. ఈ విషయంపై సోయం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు పేర్కొన్నా రు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నామినేటెడ్ పదవి విషయంలో హామీ ఇచ్చారని వివరించారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి -
పార్టీ ఏదైనా.. పోటీలో ఉండటం ఖాయం! : సోయం బాపూరావు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్‌గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ టికెట్ గొడం నగేశ్‌కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం. సీనియర్ నేతలను ఢీకొట్టగలరా.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్‌గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్‌కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం. మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్డేట్స్ -
రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం! : ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: బీజేపీ విలువలతో కూడిన పార్టీ అని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో చేరడం గర్వంగా ఉందని మాజీ ఎంపీ, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని ఎస్ఎస్.కాటన్లో ఎమ్మెల్యే రామారావుపటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలిచిందన్నారు. ఆర్థికంగా ఐదోస్థానంలో నిలిపిన ఘనత మోదీకి దక్కుతుందని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని, అత్యధిక స్థానాలు గెలుచుకుని మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముందన్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని, నాయకులు, కార్యకర్తలు సహకరించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై తనపై కొందరు అపోహలు ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో పార్టీ నిర్ణయం మేరకే పనిచేశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధత, నిజాయితీతో పనిచేశానని గుర్తు చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రామారావుపటేల్ కోరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, కానీ తాను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నియోజకవర్గానికి రూ.140 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీని గెలిపించుకుని కేంద్రం నిధులతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. సమావేశంలో నాయకులు బి.గంగాధర్, సోలంకి భీంరావు, సావ్లి రమేశ్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
సిట్టింగ్ స్థానంలో ఎందుకీ పరిస్థితి..?
సాక్షి, ఆదిలాబాద్: కమలం పార్టీలో ముసలం మొదలైంది. బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాజాగా కేంద్ర మంత్రి జిల్లా ప ర్యటనలో బహిర్గతమయ్యాయి. అయితే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరి ఏకాభిప్రాయంతోనే పార్టీ అభ్యర్థి ఎంపిక జరిగిందని కమలం నేతలు చెప్పుకొచ్చారు. కార్యకర్తలూ అదే కావచ్చని అనుకున్నారు. ఆ తర్వాత టికెట్ ఆశించిన ఆశావహుల్లో కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అభ్యర్థి గెలుపునకు దోహద పడతామని చెప్పుకుంటూ వచ్చారు. కొంత మంది సైలెంట్‌గా ఉన్నారు. మరోవైపు చివరిదాకా టికెట్ ఆశించి భంగపడ్డ సి ట్టింగ్ ఎంపీ సోయం అలక బూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి వీరందరిని సమన్వయపర్చి ఏకతాటిపైకి తీసుకొచ్చేప్రయత్నం జరుగుతుందా అంటే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలేమి కనిపించడం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. అందరూ డుమ్మా.. బీజేపీ పార్లమెంట్ స్థాయి సమావేశం తలమడుగు మండలం ఉండంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అర్జున్ ముండా హాజ రయ్యారు. పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొనాలి. అయితే నిర్మల్, ముథోల్, సిర్పూర్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు ప టేల్, హరీష్‌బాబు రాలేదు. సిట్టింగ్ ఎంపీ సో యం కూడా దూరంగా ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సైతం గైర్హాజరవడం గమనార్హం. దీంతో అసలు ఏం జరుగుతుందోనని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఏకతాటిపైకి తెచ్చేదెవరు..? మార్చి 10న ఢిల్లీ నుంచి విడుదలైన బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం నుంచి నగేశ్ పేరు వెల్లడైంది. అంతకు నాలుగు రో జుల ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి కమలం పా ర్టీలో చేరారు. ఈ క్రమంలో నగేశ్‌కు టికెట్ ఇవ్వొద్ద ని పార్టీలోని పలువురు సీనియర్లు, ఆశావహులు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి విన్నవించారు. అయినప్పటికీ పార్టీ నగేశ్ వైపే మొగ్గుచూపింది. అయితే టికెట్ ఖరారైన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి హైదరాబాద్ నుంచి వస్తున్న అభ్యర్థి నగేశ్‌కు మొదట నిర్మల్ జిల్లా సోన్ వద్ద పార్టీ శ్రేణులు స్వా గతం పలకాలి. కానీ అలాంటిదేమి కనిపించలేదు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారనేది కార్యకర్తల్లో నెలకొంది. ప్రస్తుతం ఆదిలా బాద్ పార్లమెంట్ ఇన్చార్టీగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. బుధవారం పార్లమెంట్ స్థాయి సమావేశం ఉందని ఆదిలాబాద్ పట్టణ కార్యదర్శి వేదవ్యాస్ నుంచి ప్రకటన జారీ కావడంపై పార్టీ సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ స్థాయి సమావేశ ఆహ్వానం ఇలా పట్టణ కార్యదర్శి నుంచి జారీ కావడమేంటా అని విస్తుపోతున్నారు. ఆ ఆహ్వానంలో ఎమ్మెల్యే శంకర్, అభ్యర్థి నగేశ్ పాల్గొంటున్నారని, కేంద్ర మంత్రి వస్తున్నారని పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు ఇందులో పొందుపర్చలేదనేది సామాన్య కార్యకర్త ప్రశ్నించే పరిస్థితి. ఈ లెక్కన పార్లమెంట్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న శంకర్ అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదా.. లేనిపక్షంలో ఈ వ్యవహారం తనది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అనే సందిగ్ధం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ‘సోయం’కు బుజ్జగింపులు సిట్టింగ్ స్థానం నుంచి తిరిగి టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన సోయం బాపూరావును ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కలిసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. కేంద్రంలో మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చెప్పించాలని సోయం చెప్పడంతో దానికి కిషన్‌రెడ్డి సరే అన్నట్టు పార్టీలో ప్రచారం ఉంది. అదే జరిగితే తాను నగేశ్ పక్షాన ప్రచారానికి వెళ్లే విషయాన్ని పరిశీలిస్తానని కిషన్ రెడ్డికి సోయం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోయం బుజ్జగింపుల వరకే రాష్ట్ర నాయకులు పరిమితమవుతారా.. లేనిపక్షంలో ఈ పార్లమెంట్ పరిధిలోని ఇతర అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిందే. ఇవి చదవండి: నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు! -
మోదీ పాలన చూసే.. బీజేపీలో చేరా! : గోడం నగేశ్
ఆదిలాబాద్: గత పదేళ్లలో అవినీతి రహిత పాలనను అందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రరాజ్యాలకు ధీటుగా తీసుకెళ్లిన ప్రధాని మోదీకి నేనేందుకు మద్దతివ్వకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక తొలి సారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు మావల బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. మావల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూ, పార్టీ ప్రతిష్టతను పెంచేలా పనిచేస్తాన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీయే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అమర్‌సింగ్ తిలావత్, అశోక్ ముస్తాపురే, నగేష్, విజయ్, జ్యోతిరెడ్డి, కృష్ణయాదవ్, వేదవ్యాస్, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యనేతల గైర్హాజరు! సమావేశానికి పార్టీ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్‌తో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులేవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక నిర్వహించిన తొలి సమావేశానికి ముఖ్య నేతలు డూమ్మకొట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇవి చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ! -
'బీజేపీ టికెట్' నగేశ్‌కే..
ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేశ్ పేరునే ఆ పార్టీ అధిష్టానం ఖరా రు చేసింది. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలో చేరగా తాజాగా టికెట్ కూడా ఆయనకే కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కు చుక్కెదురైంది. కాగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే లంబాడా సామాజిక వర్గంలో ఎవరికై నా టికెట్ ఇవ్వాలని ఆ సామాజికవర్గ నేతలనుంచి డిమాండ్ వ్యక్తం కాగా రాజకీయ సమీకరణల్లో భాగంగా ఈ స్థానాని కి ఆదివాసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. మహబూబాబాద్‌లో లంబాడా నేత సీతారాం నాయక్‌కు చోటు కల్పించగా, ఇక్కడ గోండు అయిన నగేశ్‌కు స్థానం కల్పించారు. దీంతో పార్టీ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్‌బాబు, అభినవ్ సర్దార్, ఇతరులకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ పరిణామాల తర్వాత.. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ గోడం నగేశ్ గత ఆదివారం ఢిల్లీలో కమలం పార్టీలో చేరారు.ఆ రోజు ఐదుగురు నేతలు కాషాయం కండువా కప్పుకోగా అందులో అజ్మీరా సీతారాం నాయక్, గోమాస శ్రీని వాస్,సైదారెడ్డితోపాటు నగేశ్‌కు ఈరోజు టికెట్ ఖ రారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే నగేశ్ పార్టీ లో చేరిన మరుసటి రోజే పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు. వారితో పాటు పార్టీ ముఖ్య బాధ్యులు కూడా హస్తినకు చేరుకున్నారు. అగ్రనేతలను కలిశారు. పార్టీలో కొత్తగా చేరే వారికి టికె ట్ ఇవ్వవద్దని, ఈ పార్లమెంట్ స్థానంలో సమర్థులై న నాయకులున్నారని, నగేశ్‌కు టికెట్ ఇస్తే సహకరించమని అధిష్టానానికి స్పష్టం చేశారు. దీంతో నగేశ్‌కు టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం సాగింది. అయితే అధిష్టానం మాత్రం ఆ నేతవైపే ఆసక్తి కనబరుస్తూ ఎంపిక చేసింది. దీంతో ఆశావహులకు చుక్కెదురైంది. మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో.. నగేశ్ మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆతర్వాత బీఆర్ఎస్లో చేరారు. తాజా గా బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చే యనున్నారు. కాగా 2014లో పార్లమెంట్ ఎన్నికల కు ముందే ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ బీజేపీ అభ్య ర్థి సోయం చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో బోథ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. బయోడెటా.. పేరు: గోడం నగేశ్ తల్లిదండ్రులు: భీమాబాయి, రామారావు భార్య: లత (గృహిణి) సంతానం: కూతురు మనోజ్ఞ(లా చదువుతోంది), కుమారుడు రిత్విక్(లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు) కులం: ఎస్టీ (గోండు) విదార్హతలు: ఎంఏ, ఎంఈడీ పదవులు: 1994, 1999, 2009లో టీడీపీ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా గెలుపు. తొలిసారి గెలిచినప్పుడే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2014లో బీఆర్ఎస్లో చేరిక.. ఆదిలాబాద్ ఎంపీగా గెలుపు. తండ్రి రామారావు రెండు సార్లు బోథ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. ఎన్టీఆర్ కేబినెట్లో గిరిజన సంక్షేమశాఖమంత్రిగా పనిచేశారు. ఇవి చదవండి: పారాచూట్లకే ప్రాధాన్యం! -
అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్..!
సాక్షి,ఆదిలాబాద్: మాజీ ఎంపీ గొడం నగేశ్ బీజేపీలో చేరికతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా కలిసి ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో సోమవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఇదిలా ఉంటే లంబాడాలను పరిగణలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గం నేతలు విన్నవించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి బీఎల్ సంతోష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌ను వారు కలిశారు. కాగా గొడంకు టికెట్ ఇవ్వమని అగ్రనేతలు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీకా.. లేనిపక్షంలో ఇతర నేతలను ఆదిలాబాద్ స్థానానికి పరిగణలోకి తీసుకుంటారా అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. సంజాయిషీ ఇచ్చారనే ప్రచారం.. ఢిల్లీ వెళ్లిన లంబాడా నేతలు తమకు టికెట్ ఇవ్వాలని అడుగుతూనే మరోపక్క ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో గొడం నగేశ్‌ను పార్టీలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఓ ఎమ్మెల్యే ఇక్కడ ఒంటరయ్యారన్న ప్రచారం సాగుతోంది. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ టికెట్ నగేశ్‌కు ఇవ్వాలని నేను చెప్పలేదని ఒంటరైన ఆ ఎమ్మెల్యే జిల్లా నేతలకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టాన నిర్ణయమేనని ఆ ఎమ్మెల్యే జిల్లా నేతలతో చెప్పుకొచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఏదేమైనా బీజేపీలో రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఢిల్లీలో సందడి.. మాజీ ఎంపీ గొడం నగేశ్ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కాషాయ కండువా కప్పుకున్న విషయం విదితమే. ఆయన పార్టీలో చేరిన మరుసటి రోజే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్‌బాబు, హరినాయక్ జట్టుగా హస్తీనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రభారి మయూర్ చంద్ర, మరో ఒకరిద్దరు నేతలు కలిసి మరో జట్టుగా దేశ రాజధానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ బీఎల్ సంతోష్, డాక్టర్ లక్ష్మణ్‌ను కలిశారు. కాగా ఇందులో ఒక బృందానికి అగ్రనేతలు గొడం నగేశ్‌కు టికెట్ ఇవ్వమని చెప్పినట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది. అయితే ఇందులో ఎవరికీ టికెట్ ఇస్తామనే విషయంలో అగ్రనేతలు ఎలాంటి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. లంబాడాల ఓట్లు లక్షన్నర వరకు ఉన్న దృష్ట్యా టికెట్ ఇస్తే గెలుస్తామని రాథోడ్ రమేశ్, రాథోడ్ బాపూరావు, రాథోడ్ జనార్దన్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉందని చెప్పినట్లు సమాచారం. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని, సీటు ఇవ్వొద్దని నేతలంతా ముక్తకంఠంతో కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆ తర్వాత నేతలు ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి ఉండటం గమనార్హం. కాగా ఎంపీ సోయం బాపూరావు ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు. నగేశ్ చేరిక తర్వాత ఆయన సైలెంట్‌గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవి చదవండి: పదవుల కోసం పోయెటోళ్లతో పరేషానొద్దు: కేసీఆర్ -
బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ ఎంపీ..
సాక్షి, ఆదిలాబాద్: మాజీ ఎంపీ గొడం నగేశ్ బీజేపీలో చేరారు. బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత కేసీ ఆర్కు లేఖను పంపించారు. కొద్ది రోజులుగా ఆయ న కాషాయ పార్టీలో చేరుతారని జరిగిన ప్రచారం నిజమైంది. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఇందులో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో పని చేసేందుకు.. బీజేపీలో చేరిన అనంతరం గొడం నగేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఉందని, అందుకోసమే బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు. అందరు చేరినట్లే ఆయన చేరారు.. గొడం నగేశ్ బీజేపీలో చేరిక విషయంపై ఎంపీ సోయం బాపూరావును సాక్షి ఫోన్లో సంప్రదించగా అందరు చేరినట్లే ఆయన కూడా చేరారన్నారు. ఇదివరకు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మె ల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనా ర్దన్ కూడా చేరారన్నారు. పార్టీ సర్వే చేసి టికెట్ ఇస్తుందని పేర్కొన్నారు. నా కంటే బెటర్‌గా ఉంటే ఆయనకే వస్తుందన్నారు. ఎంపీ సోయం ఈ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నగేశ్ బీజే పీ టికెట్ కన్ఫామ్తోనే పార్టీలో చేరారా..? లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఈ విషయంలో ఆయనను ఫోన్లో సంప్రదించగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రెండో జాబితాలో ప్రకటించేనా.. బీజేపీ రెండో జాబితా సోమవారం వెలువడొచ్చనే పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఆదిలా బాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా.. లేని పక్షంలో మూడో జాబితా వరకు వేచి చూడాల్సి వస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలనుంది. ఏదేమైనా బీజేపీలో ఈ సమీకరణాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో కలిసి గొడం చేరడం గమనార్హం. అక్కడ లంబాడా సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన పక్షంలో ఆది లాబాద్‌లో ఆదివాసీ సామాజికవర్గానికి ఇవ్వచ్చని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ఆది లాబాద్ సిట్టింగ్ స్థానంలో బీజేపీ పరంగా అభ్యర్థి ఎంపికపై అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజా గా చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలపై అందరి దృష్టి నెలకొంది. టికెట్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవి చదవండి: రెండో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు.. నేడు కీలక భేటీ -
'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'
సాక్షి, ఆదిలాబాద్: బోథ్ ఎస్టీ అసెంబ్లీ రిజర్వుడ్ స్థానంలో 38ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 14మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా దీంట్లో నలుగురు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారే కావడం విశేషం. ► బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన గోడం రామారావు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మొదటిసారిగా 1985లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. ► రామారావు తనయుడు గోడం నగేష్ 1986లో బజార్హత్నూర్ మండలంలోని విఠల్‌గూడలో గిరిజన పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 1994లో బోథ్ మండలంలోని పార్డీ ఆశ్రమ పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో గిరిజన శాఖ మంత్రిగా పనిచేశాడు. 1999లో రెండోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర జీసీసీ చైర్మన్‌గా పనిచేశాడు. 2009 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించాడు. నాల్గోసారి 2004 టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందాడు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందాడు. ► నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ బాపురావు 1986లో ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యాడు. 2009లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014 టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. ► బోథ్ మండలంలోని నాగుగూడ గ్రామానికి చెందిన సోయం బాపూరావు 1987లో మహదుగూడలో గిరిజన శాఖ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. వివిద పాఠశాల్లో విధులు నిర్వహిస్తూనే తుడుం దెబ్బలో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశాడు. 2004 ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాడు. 2014లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ గెలుపొందాడు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాడు. -
TS Election2023: బీఆర్ఎస్లో కొనసాగడమా.. బీజేపీలో చేరడమా..!?
సాక్షి, ఆదిలాబాద్: బీఆర్ఎస్లో కొనసాగడమా.. బీజేపీలో చేరడమా అనే విషయంలో మాజీ ఎంపీ గోడం నగేశ్ తర్జనభర్జన పడుతున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నుంచి బోథ్ అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైంది. నెల క్రితం సీఎం కేసీఆర్ నుంచి పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయన పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే బోథ్ టికెట్‌తో పాటు తన అనుచరులు, కార్యకర్తలకు ఆ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే చేరుతారనే కండిషన్‌తో బీజేపీ పెద్దలతో చర్చించారనే ప్రచారం నడిచింది. బీజేపీ పరంగా సిట్టింగ్ ఎంపీలకు వారి సొంత నియోజకవర్గాల్లో అసెంబ్లీ నుంచి పోటీకి నిలిపే అవకాశాలు ఉంటాయని అధిష్టానం నుంచి విధివిధానాలు ఉండడంతో ఆయనకు టికెట్ పరంగా స్పష్టమైన హామీ లభించలేదనే ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే నియోజకవర్గం నుంచి బీజేపీకి దరఖాస్తు పరంగా ఎంపీ సోయం బాపురావు దూరంగా ఉండటం ఆయన కుమారుడు సోయం వెంకటేశ్‌ను రంగంలోకి దించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గోడం నగేశ్ బోథ్ టికెట్ కోసం బీజేపీ పార్టీ పరంగా కొంత మంది ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. కేటీఆర్‌తో భేటీ.. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏయే నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నారో అక్కడ పరిస్థితి చక్కదిద్దే విషయంలో ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జనగామ, స్టేషన్ ఘన్పూర్లలో అసంతృప్తిదారులతో భేటీ సఫలం కావడం వెనుక పార్టీ పరంగా భవిష్యత్తులో తోడ్పాటు ఉంటుందనే హామీలే కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నతో కలిసి హైదరాబాద్ వెళ్లిన గోడం నగేశ్ కేటీఆర్‌ను కలిశారు. ఈ భేటీలో నగేశ్‌కు భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని, దానికి సంబంధించి జిల్లాలో పర్యటన సందర్భంగా స్పష్టమైన హామీ ఇస్తామని చెప్పినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపునకు కృషి చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. ప్రధానంగా గోండు సామాజిక వర్గానికి చెందిన గోడం నగేశ్ సేవలను పార్టీలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీల ఓట్లు అధికంగా ఉండటంతో పార్టీ ఈమేర ఆలోచన చేసినట్లు ప్రచారం సాగుతోంది. అంతర్మథనం.. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ గోడం నగేశ్లో అంతర్మథనం కొనసాగుతుందని ప్రచారం సాగుతుంది. మరో వైపు కాంగ్రెస్‌లో చేరిక విషయంలోనూ ఆయన సందిగ్ధపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఆ పార్టీలో ప్యారాచూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వరాదని ఇటీవల సీనియర్ నాయకుల డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ పార్టీలో చేరిక విషయంలోనూ సందిగ్ధపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్లో కొనసాగడమా.. బీజేపీ లేని పక్షంలో కాంగ్రెస్‌లో చేరడమా వంటి అంశాల విషయంలో ఇటీవల కార్యకర్తలతో ఆయన టచ్‌లోకి వచ్చారనే విషయం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ అంశాల పరంగా సందిగ్ధతకు గోడం నగేశ్ తెరదించుతారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. -
Teachers' Day: ఉపాధ్యాయ వృత్తి నుంచి చట్టసభల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్: వారంతా ఒకప్పటి గురువులు.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి, ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సమాజ మార్గనిర్దేశకులుగా సేవలందించి విద్యార్థుల అభ్యన్నతికి పాటుపడ్డారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆదరణను చూరగొని తరగతి నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నతికి ఏ విధంగా పాటుపడ్డారో ప్రజాప్రతినిధులుగానూ తమను గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా నాటి జ్ఞాపకాలు మరువలేనివని చెబుతున్న పూర్వపు గురువులపై ‘టీచర్స్‌డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యే, ఎంపీగా.. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు సైతం ఉపాధ్యా య వృత్తి నుంచే రాజకీయాల్లోకి అడుగుపె ట్టారు. 1987లో బోథ్ మండలం మహద్గాంవ్లో తొలిసారి ఐ టీడీఏ ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. అదే మండలం రాజుపల్లి, బజార్హత్నూర్ మండలం కొత్తగూడెం, ఆసిఫాబాద్ మండలం రాయిగూడ, ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్లో 1994 వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో పోటీచేసి పరాజయం పాలై తిరిగి బీజేపీలో చేరి 2019లో ఎంపీగా గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని దాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో.. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 1993లో ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా తిర్యాణి మండలం గొపెరాలో నియామకమయ్యారు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన ఆయన 1999లో నార్నూర్ మండలం చింతగూడ ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన 2004లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ అదె పార్టీ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయుడి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా .. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1986లో ఆదిలాబాద్ మండలం చింతగూడలో స్పెషల్ టీచర్‌గా నియామకమయ్యారు. 1987లో పదోన్నతి పొంది ముత్యన్పేట పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 1993లో గ్రేడ్–1 హింది పండిట్‌గా పదోన్నతి పొంది తలమడుగు మండలం ఝరి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఏడేళ్లపాటు పనిచేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2000 సంవత్సరంలో తాంసి మండలం అందర్బంద్కు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసి, ఆదిలాబాద్ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009 వరకు అక్కడే సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని కాంక్షిస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరిన ఆయన 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువులు బావి తరాలకు ఆదర్శమని, బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విద్యారంగంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన రాజకీయాల్లోకి రాక ముందు 1992నుంచి 1994 వరకు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువునందించి మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. 1996లో నెన్నెల మండల జెడ్పీటీసీగా, 2001లో ఎంపీపీగా పనిచేశారు. 2009, 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా ప్రతినిధి అయినప్పటికీ విద్యారంగపై ఆయనకున్న మక్కువను చాటుతూనే ఉంటారు. పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రతిభాపాఠవాలను తెలుసుకుంటారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడుతూ వారితో మమేకమవుతారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి నుంచి క్యాబినెట్ మంత్రిగా గోడం నగేశ్ 1986లో ఎస్జీబీటీగా బజార్హత్నూర్ మండలం విఠల్గూడ ఆశ్రమ పాఠశాలలో నియామకమయ్యారు. బోథ్ మండలం పార్డి–బి యూపీఎస్ హెచ్‌ఎంగాను సేవలందించారు. 1989లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది బజార్హత్నూర్ మండలం జాతర్ల ఉన్నత పాఠశాలలో నియామకమయ్యారు. 1993లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చేరిన ఆయన 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొంది పార్లమెంట్‌లోనూ అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన జిల్లా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
రసవత్తరంగా రెండో దశ!
నేటి శుక్రవారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత ఎన్నికలు పలువురు అధికార పార్టీ ముఖ్య నాయకులకు కీలకం కానున్నాయి. ఎందుకంటే, ఈ ఎన్నికలు జరగనున్న మండలాలతో ఆయా నాయకులకు ప్రత్యేక సంబంధం ఉండటమే కారణం. కాబట్టి ఆ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ఇప్పుడు సదరు నేతలకు సవాలుగా మారింది. బోథ్నియోజకవర్గంలో ఈ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినప్పటికీ ఆయా మండలాల్లో ఇతర నేతలు కూడా బాగానే పలుకుబడి కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ‘నాయకులు పలుకుబడి’ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు! గుడిహత్నూర్, తలమడుగు, బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో నేడు పోలింగ్ జరగనుంది. గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అటు జెడ్పీటీసీ స్థానాలు గెలవడంతోపాటు ఇటు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! దీంతో ఇప్పుడు ఐదు మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికల్లో గెలవడం అధికార పార్టీ నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు. సాక్షి, ఆదిలాబాద్: రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్యే..బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని తాంసి, భీంపూ ర్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో మిగిలిన మండలాల్లో జరుగుతుండటంతో గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఆ లెక్కను సమం చేయాలని ఆయన భావిస్తున్నారు. నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్ మండలాల్లో ఆయన ప్రచారం కూడా చేపట్టలేదు. నేరడిగొండలో అనిల్ జాదవ్ బరిలో ఉండటంతో ఆ మండలం విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. బజార్హత్నూర్ మండలంలో ఎంపీ నగేష్ అనుచరులు పోటీ చేస్తుండటంతో ఆ మండలంలోనూ బాపూరావు కలుగజేసుకోలేదు. గుడిహత్నూర్‌లో ఎమ్మెల్యే అనుచరుడు పోటీ చేస్తున్నప్పటికీ ఆయన అక్కడ కూడా ప్రచారం చేయకపోవడం విస్మయం కలిగించే అంశమే! ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే బాపూరావుకు సవాలుగా మారనున్నాయనేది సుస్పష్టం! గోడం నగేష్, ఎంపీ ఎంపీ గోడం నగేష్ సొంత మండలం బజార్హత్నూర్. ఇక్కడ ఆయన అనుచరులు పోటీ చేస్తుండటంతో ఈ మండలంలో వారి గెలుపు కీలకం కానుంది. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన నగేష్‌కు అప్పుడు ప్రచారం విషయంలో బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో పొసగలేదనే ప్రచారముంది. బజార్హత్నూర్లో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురుకావడంతో ఇక్కడ గెలుపు సవాలుగా మారనుంది. బీజేపీ నుంచి ఏకంగా 14 మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడటం ఈ మండల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది. చివరికి పార్టీ బీ–ఫాం ఒకరికి ఇచ్చినప్పటికీ ఆ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపూరావు విస్తృతంగా పర్యటించడంతో ఇక్కడ గోడం వర్సెస్ సోయం అన్న చందంగా పోటీ నెలకొంది. లోక భూమారెడ్డి, డెయిరీ చైర్మన్ ప్రాదేశిక ఎన్నికల్లో తలమడుగు మండలంలో తన సమీప బంధువుకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించాలని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరుడికి కట్టబెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన జెడ్పీటీసీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తున్న లోక భూమారెడ్డికి ఈ మండలంలో ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే ప్రచారంలో ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు బాహాటంగానే ప్రస్పుటమయ్యాయి. చివరి రోజు బుధవారం ప్రచారంలో ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ఆయన తలమడుగు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార విషయం గురించి ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు కనీసం సమాచారం కూడా అందించలేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఎమ్మెల్యే అనుచరుడే బరిలో ఉన్నప్పటికీ గెలుపోటముల ప్రభావం కొంత లోక భూమారెడ్డిపై కూడా ఉండనుంది. డీసీసీబీ అధ్యక్షుడు ముడుపు దామోదర్‌రెడ్డి తలమడుగు మండలానికి చెందినవారే. దీంతో అక్కడి ఎన్నికల్లో ఆయనపై కూడా గెలుపు బాధ్యత నెలకొంది. అనిల్ జాదవ్, జెడ్పీటీసీ అభ్యర్థి బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎన్నికలు ఈరోజు జరగనుండగా, అందులో మూడు స్థానాలు జనరల్ కాగా, బోథ్ జనరల్(మహిళ) రిజర్వ్ అయింది. ఇక నేరడిగొండ ఒక్కటే ఎస్టీ(జనరల్) రిజర్వ్ ఉంది. ఇక్కడి నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన అనిల్ జాదవ్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఆయన గెలుపు కీలకం కానుంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి ఈ మండలంలో ప్రచారం కూడా ఆయన ఒక్కడే నిర్వహించడం గమనార్హం! లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన అనిల్ జాదవ్ అధినాయకుల అండతోనే జెడ్పీ చైర్మన్ పదవిపై భరోసాతోనే జెడ్పీటీసీ బరిలో దిగారనే ప్రచారమూ జరుగుతోంది. జిల్లాలోని ఇతర మండలాల అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులతో ఆయన ఇప్పుడే టచ్‌లో ఉండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఆదిలాబాద్‌లో ఎవరో గిరి‘‘జనుడు’’
సాక్షి, ఆదిలాబాద్: చుట్టూ కొండకోనలు.. ఒత్తుగా పరుచుకున్న పచ్చదనం..దాన్ని చీల్చుకుంటూ ముందుకుసాగే గోదావరి పరవళ్లు..సరస్వతీ క్షేత్రంతో అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆదివాసీ జీవన వైవిధ్యంతో భాసిల్లే ప్రాంతం ఆదిలాబాద్. ఔరా అనిపించే నిర్మల్ బొమ్మలు.. ఆకట్టుకునే గిరిజన నృత్యాలకు కేంద్రమిదే. వేసవిలో భానుడి భగభగలు, శీతాకాలంలో ఒంటిని గడ్డకట్టించేంత చలి.. అటువంటి ఆదిలాబాద్‌లో ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు ‘గరిష్ట’ స్థాయిలో మండుతున్నాయి. 1952 నుంచి జనరల్ సీటుగా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఎస్టీ రిజర్వ్‌గా మారింది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 14,78,662 మంది ఓటర్లున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎన్నికల్లో (1952) సోషలిస్టు పార్టీకి చెందిన సి.మాధవరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి 1980 వరకు వరుసగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. 1984 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్.. అప్పటి నుంచి 1999 వరకు టీడీపీ వరుసగా గెలుపొందగా.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పోటీ చేసి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 2009లో మళ్లీ టీడీపీ గెలుపొందింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది. గత ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కారు హవా కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ 4,30,847 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేశ్ 2,59,557, టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 1,84,198 ఓట్లు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, స్వయం పాలన నినాదంతో సాగిన ఎన్నికలు టీఆర్ఎస్కు అనుకూలించాయి. మరోవైపు టీఆర్ఎస్ అధినేత సైతం పలుమార్లు పర్యటించి ప్రచారం చేశారు. దీంతో భారీ మెజార్టీ దిశగా కారు దూసుకెళ్లింది. బరిలో హేమాహేమీలు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పేరును పది రోజుల క్రితమే ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఈ నెల 21న అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్‌ను ప్రకటించింది. అధికారిక ప్రకటన ఆలస్యమైనా.. అంతర్గతంగా సమాచారం ఇవ్వడంతో ఆయన అప్పటికే ప్రచారాన్ని ప్రారంభిం చారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కారుదే జోరు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చేశాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదువుతోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించి జాతీయ నేతలను ఇక్కడకు ప్రచారానికి రప్పించాలని ఆ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. గిరిపుత్రుల మొగ్గు ఎటుంటే అటే.. అత్యధిక విస్తీర్ణం అడవులు కలిగి.. అడవిబిడ్డల అడ్డా అయిన ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఆదివాసీల ఓట్లే అభ్యర్థి గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే.. అందులో మూడు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగతా సెగ్మెంట్లలోనూ గిరిజనుల ప్రాబల్యం అధికమే. ఈ లోక్‌సభ స్థానం కూడా ఎస్టీ రిజర్వు కావడంతో పోటీచేసే అభ్యర్థులకు చెందిన సామాజిక వర్గాలే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గోండు, నాయక్పోట్, కొలామ్, లంబాడీ తెగలకు చెందిన వారి జనాభా అధికంగా ఉంది. తాజా ఎన్నికల్లో వీరి ఓట్లపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. వీరిని ఆకట్టుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల ఫలితం అభ్యర్థి వచ్చిన ఓట్లు జీ నగేశ్ 4,30,847 నరేశ్ 2,59,557 రమేశ్ రాథోడ్ 1,84,198 లోక్‌సభ ఓటర్లు పురుషులు 7,25,961 మహిళలు 7,52,649 ఇతరులు 52 మొత్తం 14,78,662 లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు - సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ (ఎస్టీ), ఖానాపూర్ (ఎస్టీ),ఆదిలాబాద్, బోథ్ (ఎస్టీ), నిర్మల్, ముథోల్. -
పార్టీ మారను.. నేనే పోటీ చేస్తా
సాక్షి, ఆదిలాబాద్ : టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారంటూ ఇటీవల హస్తం నేతలు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ నేత, ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పార్టీ మారుతారని, ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎంపీ నగేష్ ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తనపై ఇకముందు ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున ఆదిలాబాద్ నుంచి తానే పోటీచేస్తానని నగేష్ ప్రకటించారు. దానికోసం ఇప్పటి నుంచే బీఫాం చేతిలో పట్టుకుని తిరుగుతున్నాని ఆయన తెలిపారు. కాగా మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి గులాబీ పార్టీకి షాకిచ్చిన విషయం తెలిసిందే. తనతోపాటు మరికొంత మంది నేతలు పార్టీని వీడుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గల్లో చర్చకు దారితీశాయి. -
రసకందాయంలో ఆ ఎంపీల భవిష్యత్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్లమెంటులో ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకముందే మన ఎంపీలు శాసనసభ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి చివరి నిమిషంలో రంగ ప్రవేశం చేసి విజయం సాధించిన గోడం నగేశ్, బాల్క సుమన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన శాసనసభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఎంపీగా ఉండడం కన్నా ఎమ్మెల్యేగా కొనసాగితేనే మంచిదనే ధోరణితో గోడం నగేశ్ తన పాత నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాగా అని వార్య పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా అనువైన నియోజకవర్గం వేటలో సుమన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజకీయం రసకందాయంలో పడింది. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ వివేక్ రాకతో మారిన సీన్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ సిట్టింగ్ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్ విజయం సాధించారు. కాగా గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరడంతోపా టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వివేక్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఎంపీ సుమన్‌కు పెద్దపల్లి లోక్‌సభ నుంచి మళ్లీ అసెంబ్లీ స్థానానికి వెళ్లడం ఇష్టం లేదు. అయితే వివేక్ ముందస్తు ఒప్పందంతోనే టీఆర్ఎస్లో చేరారనే ప్రచారంనేపథ్యం లో అనివార్య పరిస్థితి ఏర్పడితే ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. గతంలో అనుకున్న చొప్పదం డి నియోజకర్గంతోపాటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి స్థానంపై కూడా సుమన్ కన్నేసినట్లు సమాచారం. ఆదిలాబాద్‌పై ప్రభుత్వాధికారి చూపు గోడం నగేశ్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యాంనాయక్ ఆదిలాబాద్ లోక్‌సభపై దృష్టి పెట్టారు. ఆయన సతీమణి రేఖా నాయక్ ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించిన ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లోనే టిక్కెట్టు లభిస్తుందని భావించారు. అప్పుడు మిస్సయినా ఈ సారి నగే‹శ్ అసెంబ్లీకి వెళ్తే తాను పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధం తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రేఖానాయక్ ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన సోదరుడు రాంనాయక్ సిర్పూరు(టి) జెడ్పీటీసీగా కొనసాగుతుండడం కలిసివచ్చే అంశం. కాగా నగేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి వస్తే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం. బోథ్ ఎమ్మెల్యే స్థానానికే నగేశ్ మొగ్గు తెలుగుదేశం హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గోడం నగేశ్ 2014 ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి బాపూరావు రాథోడ్ పోటీ చేసి విజయం సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా అంత సంతృప్తిగా లేని నగే‹శ్ గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన బోథ్ నియోజకవర్గంపైనే కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా బోథ్‌లో తన వర్గాన్ని అదుపులో ఉంచుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి కాకుండా బోథ్ నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయనున్నట్లు అధిష్టానానికి కూడా సంకేతాలు పంపించారు. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా తన సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
గిదేం ఎంపిక..!
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సమస్యలతో సతమతమవుతున్న మారుమూల గ్రామాలు అనేకం ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన సంసద్ గ్రామ్ యోజన పథకానికి ఇలాంటి మూడు గ్రామాలను ఎంపిక చేసుకుంటే నిరుపేదల బతుకుల్లో అభివృద్ధి బాటలు వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఎంపీలు గోడం నగేష్, బాల్కసుమన్ ఎంపిక చేయనున్న గ్రామాల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ దండేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామాన్ని ఎంపిక చేశారు. మారుమూల గ్రామాలతో పోల్చితే ఈ గ్రామం కాస్తోకూస్తో అభివృద్ధి బాటలో ఉంది. పాలక వర్గం లేదనే ఒకే ఒక్క కారణంతో ఈ పంచాయతీని ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధికి నోచుకోని గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంసద్ గ్రామ యోజన పథకం కింద ఆదర్శ గ్రామ పంచాయతీలను ప్రతిపాదించి నివేదికలు పంపాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిం ది. గ్రామ పంచాయతీల ఎంపిక బాధ్యత ఎంపీలు, కలెక్టర్లకు అప్పగించింది. ఎంపీలు తన నియోజకవర్గ పరిధిలోని మూడు పంచాయతీలను దత్తత తీసుకుని.. ఆ గ్రామాల్లో సుపరిపాలన, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, రోడ్ల నిర్మాణం, మెరుగైన వైద్యం ఇతర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గూడెం గ్రామ పంచాయతీని ఎంచుకున్నారు. అభివృద్ధి దశలో ఉన్న ‘గూడెం’కు బదులు.. అనేక సమస్యలున్న గ్రామ పంచాయతీలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తే.. పథక లక్ష్యం నెరవేరేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ తీసుకున్న నిర్ణయంపై మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామాల ఎంపిక విషయంలో స్థానిక అధికారుల అభిప్రాయాలను ఎంపీలు పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని.. - బాల్క సుమన్, ఎంపీ పెద్దపల్లి గూడెంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధితోపాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాన్ని దత్తత తీసుకున్న. దశలవారీగా నా పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తా. -
మూడేళ్లలో 24గంటలూ విద్యుత్
నార్నూర్ : వచ్చే మూడేళ్లలో 24గంటలూ విద్యుత్ సరఫరా చేసే విధంగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మండలంలోని అర్జుని గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో రూ.75లక్షలతో నిర్మించిన సిబ్బంది నివాస సముదాయం, లోకారి-బి గ్రామంలో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రూ.1.60లక్షలతో నిర్మించిన పాఠశాల భవనం, పర్సువాడలో సీసీడీపీ పథకం కింద రూ.10లక్షలతో నిర్మించిన భవనం, గాదిగూడలో రూ.12లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ పౌండేషన్ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించి తీరుతామని అన్నారు. ఈ నెల 8 నుంచి రూ.200 పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.వెయ్యి, రూ.500 పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.1,500 పెంపును ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.51వేలు ఇస్తుందని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఝరిలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిప్రీ గ్రామ పంచాయతీ పరిధి అంద్‌గూడ, కొలాంగూడ, కుండి, చిన్నకుండి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడానికి బోర్‌వెల్స్ మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ఖడ్కి నుంచి లోకారి-బి గ్రామం వరకు బీటీ రోడ్దు మంజూరు చేస్తామన్నారు. ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు రూపావంతిజ్నానోబా పుస్కర్, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, సర్పంచ్‌లు జంగుబాయి, కన్ను, మేస్రం లచ్చు, జాకు కొడప, ఇంద్రభాను, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేస్రం హన్మంతరావ్, డీఈ తానాజీ, జేఈ ఇందల్, నాయకులు లోఖండే చంద్రశేఖర్, ఉర్వేత రూప్‌దేవ్, మోతే రాజన్న, సయ్యద్‌ఖాశీం, దాదేఆలీ పాల్గొన్నారు. -
ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన, చివరి ఘట్టం ముగిసింది. ప్రాదేశిక ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ‘కారు’ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. హోరాహోరీగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్ల జయకేతనం ఎగురవేశారు. ఆదిలాబాద్, పెద్దపల్లి స్థానాలు కూడా భారీ మెజారిటీతో ఆ పార్టీ కైవసం చేసుకుంది. త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆదిలాబాద్ ఎంపీ గా గోడం నగేష్ 1,71,093 ఓట్ల భారీ మె జారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్‌పై గెలుపొందారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుం చి పోటీలో ఉన్న బాల్క సుమన్‌కు కూడా భారీ మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేక్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల కు కూడా భారీ మెజారిటీ దక్కింది. ఆదిలాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన జోగు రా మన్న 14,715 మెజారిటీతో సమీప ప్రత్య ర్థి, బీజేపీ-టీడీపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై విజయం సాధించారు. చెన్నూరులోనల్లాల ఓదేలు 26,164 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్‌పై గెలుపొందారు. మంచిర్యాల నుంచి నడిపెల్లి దివాకర్‌రావుకు భారీ మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి జి.అరవింద్‌రెడ్డిపై 59,250 ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. ఆసిఫాబాద్ (ఎస్టీ) స్థానం నుంచి కోవ లక్ష్మి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై 19,055 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖానాపూర్ (ఎస్టీ) నుంచి అజ్మీర రేఖ టీడీపీ అభ్యర్థి రాథోడ్ రితేష్‌పై 38,511 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బోథ్ నుంచి పోటీ చేసిన రాథోడ్ బాపూరావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనీల్జాదవ్పై కంటే 26,993 ఎక్కువ ఓట్లు సాధించి జయకేతనం ఎగురవేశారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య 52,528 భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌పై గెలుపొందారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో మంత్రి పదవులపై హ్యాట్రిక్ సాధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన మిశ్రమ ఫలితాలు.. టీఆర్ఎస్ వర్గాలను ఆలోచనలో పడేసినప్పటికీ, ‘స్థానిక’ ఫలితాల్లో ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సార్వత్రిక ఫలితాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా రావడంతో గులాబీ దండును ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. రెండుచోట్ల దూసుకెళ్లిన ‘ఏనుగు’ వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించిన బీఎస్పీ అభ్యర్థులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలు సంచలనం సృష్టించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గాలిలో కూడా వీరు విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. నిర్మల్‌లో సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కె.శ్రీహరిరావుపై ఇంద్రకరణ్‌రెడ్డి 8,628 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిర్పూర్లో ఆయన అనుచరుడు కోనేరు కోనప్ప కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ ఇద్దరు కూడా జిల్లా కాంగ్రె స్లో చక్రం తిప్పిన ఉద్దండులైన నాయకులు ప్రేంసాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలను మట్టి కరిపించారు. విఠల్రెడ్డిది కూడా వ్యక్తిగత చరిష్మే.. జిల్లాలో కాంగ్రెస్ ఒక్క ముథోల్ స్థానానికే పరిమితమైంది. ఆ పార్టీ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాలచారిపై 14,686 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆర్ఎస్ గాలిలో కూడా విజయం సాధించిన విఠల్‌రెడ్డి కూడా వ్యక్తిగత ఛరిష్మేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీదా జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విఠల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించనున్నారు. ఉనికి కోల్పోయిన టీడీపీ.. ఈ ఎన్నికల ఘోర పరాజయం పాలైన టీడీపీ జిల్లాలో ఉనికిని కోల్పోయింది. పొత్తులో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేసినప్పటికి ఒక్క స్థానాన్ని కూడా గెలుచు కోలేకపోయింది. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు, సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేష్‌తోపాటు, ఆయన తనయుడు రితేష్ కూడా ఓటమి పాలయ్యారు. వ్యక్తిగత చర్మిష్మా ఉన్న సోయం బాపురావు వంటి నాయకులు టీడీపీపై ఉన్న వ్యతిరేకతతో ఓటమి పాలయ్యారు. బీజేపీకి చుక్కెదురు తెలంగాణ బిల్లు ఆమోదానికి పార్లమెంట్లో మద్దతిచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆ పార్టీకి టీడీపీతో పొత్తు కారణంగా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దేశమంతటా వీచిన మోడీ గాలి కూడా ఆ పార్టీ అభ్యర్థులకు కలిసిరాలేదు. రెండు చోట్ల మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతే ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యునిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లోర్ లీడర్‌గా ఉన్న గుండా మల్లేష్ కూడా ఓటమి పాలయ్యారు. ఒక్క చోట ఆదిలాబాద్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సీపీఎంకు అక్కడ కూడా చుక్కెదురైంది. -
ఖాళీ దిశగా ‘దేశం’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్హత్నూర్ మండలం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీజేపీ వైపు ‘పాయల్’ చూపు.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడిన వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయంలో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశారు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది. బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో ఇక్కడ నగేష్‌కు ప్రత్యామ్నయంగా నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఎవరూ తెరపైకి రాలేదు. ద్వితీయ శ్రేణి నాయకులుగా ఎదగకుండా నగేష్ ముందునుంచి జాగ్రత్త పడ్డారనే విమర్శలున్నాయి. మొత్తం మీద ఇక్కడ, ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థి ప్రశ్నార్థకంగా తయారైంది. మరో నియోజకవర్గ ఇన్చార్జి కూడా.. తూర్పు జిల్లాకు చెందిన మరో నియోజకవర్గ ఇన్చార్జి కూడా టీడీపీకి రాజీనామా చెప్పాలనే యోచనలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఆయనతో టీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఆయన కూడా నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. వారి మనోభావాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.