రసకందాయంలో ఆ ఎంపీల భవిష్యత్‌.. | Peddapalli MP Balka Suman Worries Over His Future | Sakshi
Sakshi News home page

రసకందాయంలో ఆ ఎంపీల భవిష్యత్‌..

Published Mon, Feb 5 2018 2:05 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Peddapalli MP Balka Suman Worries Over His Future - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  పార్లమెంటులో ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకముందే మన ఎంపీలు శాసనసభ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి చివరి నిమిషంలో రంగ ప్రవేశం చేసి విజయం సాధించిన గోడం నగేశ్, బాల్క సుమన్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన శాసనసభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఎంపీగా ఉండడం కన్నా ఎమ్మెల్యేగా కొనసాగితేనే మంచిదనే ధోరణితో గోడం నగేశ్‌ తన పాత నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాగా అని వార్య పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా అనువైన నియోజకవర్గం వేటలో సుమన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజకీయం రసకందాయంలో పడింది.

టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎంపీ వివేక్‌ రాకతో మారిన సీన్‌

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్‌ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి చొప్పదండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్‌ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్‌ విజయం సాధించారు. కాగా గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరడంతోపా టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వివేక్‌ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఎంపీ సుమన్‌కు పెద్దపల్లి లోక్‌సభ నుంచి మళ్లీ అసెంబ్లీ స్థానానికి వెళ్లడం ఇష్టం లేదు. అయితే వివేక్‌ ముందస్తు ఒప్పందంతోనే టీఆర్‌ఎస్‌లో చేరారనే ప్రచారంనేపథ్యం లో అనివార్య పరిస్థితి ఏర్పడితే ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. గతంలో అనుకున్న చొప్పదం డి నియోజకర్గంతోపాటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి స్థానంపై కూడా సుమన్‌ కన్నేసినట్లు సమాచారం. 

ఆదిలాబాద్‌పై ప్రభుత్వాధికారి చూపు
గోడం నగేశ్‌ బోథ్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆసిఫాబాద్‌ జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభపై దృష్టి పెట్టారు. ఆయన సతీమణి రేఖా నాయక్‌ ఇప్పటికే ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్‌ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించిన ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లోనే టిక్కెట్టు లభిస్తుందని భావించారు. అప్పుడు మిస్సయినా ఈ సారి నగే‹శ్‌ అసెంబ్లీకి వెళ్తే తాను పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధం తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన సోదరుడు రాంనాయక్‌ సిర్పూరు(టి) జెడ్‌పీటీసీగా కొనసాగుతుండడం కలిసివచ్చే అంశం. కాగా నగేష్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి వస్తే మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ కూడా లైన్‌లో ఉన్నట్లు సమాచారం. 

బోథ్‌ ఎమ్మెల్యే స్థానానికే నగేశ్‌ మొగ్గు
తెలుగుదేశం హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గోడం నగేశ్‌ 2014 ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన బోథ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బాపూరావు రాథోడ్‌ పోటీ చేసి విజయం సాధించారు. ఆదిలాబాద్‌ ఎంపీగా అంత సంతృప్తిగా లేని నగే‹శ్‌ గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన బోథ్‌ నియోజకవర్గంపైనే కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా బోథ్‌లో తన వర్గాన్ని అదుపులో ఉంచుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి కాకుండా బోథ్‌ నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయనున్నట్లు అధిష్టానానికి కూడా సంకేతాలు పంపించారు. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు కూడా తన సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement