సాక్షి, ఆదిలాబాద్: చుట్టూ కొండకోనలు.. ఒత్తుగా పరుచుకున్న పచ్చదనం..దాన్ని చీల్చుకుంటూ ముందుకుసాగే గోదావరి పరవళ్లు..సరస్వతీ క్షేత్రంతో అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆదివాసీ జీవన వైవిధ్యంతో భాసిల్లే ప్రాంతం ఆదిలాబాద్. ఔరా అనిపించే నిర్మల్ బొమ్మలు.. ఆకట్టుకునే గిరిజన నృత్యాలకు కేంద్రమిదే.
వేసవిలో భానుడి భగభగలు, శీతాకాలంలో ఒంటిని గడ్డకట్టించేంత చలి.. అటువంటి ఆదిలాబాద్‌లో ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు ‘గరిష్ట’ స్థాయిలో మండుతున్నాయి.
1952 నుంచి జనరల్ సీటుగా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఎస్టీ రిజర్వ్‌గా మారింది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 14,78,662 మంది ఓటర్లున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎన్నికల్లో (1952) సోషలిస్టు పార్టీకి చెందిన సి.మాధవరెడ్డి గెలుపొందారు.
ఆ తర్వాత నుంచి 1980 వరకు వరుసగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. 1984 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్.. అప్పటి నుంచి 1999 వరకు టీడీపీ వరుసగా గెలుపొందగా.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్ పోటీ చేసి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 2009లో మళ్లీ టీడీపీ గెలుపొందింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది.
గత ఎన్నికల్లో..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కారు హవా కొనసాగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ 4,30,847 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేశ్ 2,59,557, టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 1,84,198 ఓట్లు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, స్వయం పాలన నినాదంతో సాగిన ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అనుకూలించాయి. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత సైతం పలుమార్లు పర్యటించి ప్రచారం చేశారు. దీంతో భారీ మెజార్టీ దిశగా కారు దూసుకెళ్లింది.
బరిలో హేమాహేమీలు
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పేరును పది రోజుల క్రితమే ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్.. ఈ నెల 21న అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్‌ను ప్రకటించింది. అధికారిక ప్రకటన ఆలస్యమైనా.. అంతర్గతంగా సమాచారం ఇవ్వడంతో ఆయన అప్పటికే ప్రచారాన్ని ప్రారంభిం చారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో కారుదే జోరు
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చేశాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదువుతోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించి జాతీయ నేతలను ఇక్కడకు ప్రచారానికి రప్పించాలని ఆ పార్టీ ప్రణాళిక రచిస్తోంది.
గిరిపుత్రుల మొగ్గు ఎటుంటే అటే..
అత్యధిక విస్తీర్ణం అడవులు కలిగి.. అడవిబిడ్డల అడ్డా అయిన ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఆదివాసీల ఓట్లే అభ్యర్థి గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే.. అందులో మూడు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగతా సెగ్మెంట్లలోనూ గిరిజనుల ప్రాబల్యం అధికమే. ఈ లోక్‌సభ స్థానం కూడా ఎస్టీ రిజర్వు కావడంతో పోటీచేసే అభ్యర్థులకు చెందిన సామాజిక వర్గాలే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గోండు, నాయక్‌పోట్, కొలామ్, లంబాడీ తెగలకు చెందిన వారి జనాభా అధికంగా ఉంది. తాజా ఎన్నికల్లో వీరి ఓట్లపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. వీరిని ఆకట్టుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు.
2014 ఎన్నికల ఫలితం
అభ్యర్థి వచ్చిన ఓట్లు
జీ నగేశ్ 4,30,847
నరేశ్ 2,59,557
రమేశ్ రాథోడ్ 1,84,198
లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,25,961
మహిళలు 7,52,649
ఇతరులు 52
మొత్తం 14,78,662
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు
- సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ (ఎస్టీ), ఖానాపూర్ (ఎస్టీ),ఆదిలాబాద్, బోథ్ (ఎస్టీ), నిర్మల్, ముథోల్.
Comments
Please login to add a commentAdd a comment