ramesh rathode
-
బీజేపీలో సైలెంట్ వార్.. కార్యకర్తల్లో కొత్త టెన్షన్!
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో ఇద్దరు ముఖ్య నేత ల మధ్య సైలెంట్ వార్ ప్రచారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పైకి ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం బలంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ల మధ్య ఇటీవల జరి గిన పరిణామాలు ఈ సైలెంట్ వార్‌ను స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విభేదాలకు ప్రత్యేకంగా కారణం కనిపించకపోయినా రాను న్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య ఎడమొహం.. పెడమొహం అన్నట్టుగా వ్యవహారాలు సాగుతున్నాయని వినిపిస్తుంది. పట్టు కోసం యత్నాలు.. రాజకీయంగా అనేక ఉత్తానపథనాలు చూసిన రమేశ్‌రాథోడ్ 2021 జూన్‌లో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో ఆయన చేరికను ఎంపీ సోయం బాపూరావు వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తొలిగి పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. అయితే కొంత కాలంగా మళ్లీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని ప్రచారం సాగుతుంది. ఐదు నెలల క్రితం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస–బీజేపీ భరోసా యాత్ర అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో రమేశ్‌రాథోడ్ ఆధ్వర్యంలో ఆ యాత్ర ఈటల రాజేందర్‌తో నిర్వహిస్తున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆ యాత్ర నిలిచిపోయింది. ఈ ఇరువురి మధ్యలో విభేదాల కారణంగానే ఈ యాత్ర జరగలేదని పార్టీలో కార్యకర్తల మధ్య చర్చ సాగింది. ఎడమొహం.. పెడమొహం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రమేశ్‌రాథోడ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల కు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌లో చేరి ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పుడు రేఖానాయక్ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ పరంగా టికెట్‌ను ఆశిస్తూ అక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకులు హరినాయక్, పెంబీ జెడ్పీటీసీ జానుబాయిలను అంతర్గతంగా ఎంపీ సోయం బాపురావు ప్రో త్సాహం అందిస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం కమలం పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. -
‘అవినీతిలో నంబర్‌వన్ సీఎం కేసీఆర్’
సాక్షి, జన్నారం(కరీంనగర్): దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలుస్తారని, అవినీతి అంతం కావాలంటే రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాలులో రాథోడ్ రమేశ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్‌కు దళితులపై ప్రే పుట్టుకొచ్చిందని విమర్శించారు. 45 వేల మంది దళితుల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారని పేర్కొన్నారు. జన్నారం మండలం కవ్వాల్, కలమడుగు, రోటిగూడ, చింతలపల్లి, పొనకల్, చింతగూడ, తదితర గ్రామాలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, సర్పంచు, వర్గక సంఘం అధ్యక్షుడు మారుతితోపాటు సుమారు 500 మంది మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వివేక్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు వెర్రబెల్లి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, జిల్లా ఇన్చార్జి పల్లె గంగాధర్, జన్నారం మండల ఇన్చార్జి తుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గోలి చందు, ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేశ్‌గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహేశ్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: సాక్షి కథనం: మానవత్వం చాటుకున్న మెజిస్ట్రేట్ -
ఆదిలాబాద్‌లో ఎవరో గిరి‘‘జనుడు’’
సాక్షి, ఆదిలాబాద్: చుట్టూ కొండకోనలు.. ఒత్తుగా పరుచుకున్న పచ్చదనం..దాన్ని చీల్చుకుంటూ ముందుకుసాగే గోదావరి పరవళ్లు..సరస్వతీ క్షేత్రంతో అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆదివాసీ జీవన వైవిధ్యంతో భాసిల్లే ప్రాంతం ఆదిలాబాద్. ఔరా అనిపించే నిర్మల్ బొమ్మలు.. ఆకట్టుకునే గిరిజన నృత్యాలకు కేంద్రమిదే. వేసవిలో భానుడి భగభగలు, శీతాకాలంలో ఒంటిని గడ్డకట్టించేంత చలి.. అటువంటి ఆదిలాబాద్‌లో ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు ‘గరిష్ట’ స్థాయిలో మండుతున్నాయి. 1952 నుంచి జనరల్ సీటుగా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఎస్టీ రిజర్వ్‌గా మారింది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 14,78,662 మంది ఓటర్లున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎన్నికల్లో (1952) సోషలిస్టు పార్టీకి చెందిన సి.మాధవరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి 1980 వరకు వరుసగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. 1984 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్.. అప్పటి నుంచి 1999 వరకు టీడీపీ వరుసగా గెలుపొందగా.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పోటీ చేసి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 2009లో మళ్లీ టీడీపీ గెలుపొందింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది. గత ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కారు హవా కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ 4,30,847 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేశ్ 2,59,557, టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 1,84,198 ఓట్లు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, స్వయం పాలన నినాదంతో సాగిన ఎన్నికలు టీఆర్ఎస్కు అనుకూలించాయి. మరోవైపు టీఆర్ఎస్ అధినేత సైతం పలుమార్లు పర్యటించి ప్రచారం చేశారు. దీంతో భారీ మెజార్టీ దిశగా కారు దూసుకెళ్లింది. బరిలో హేమాహేమీలు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పేరును పది రోజుల క్రితమే ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఈ నెల 21న అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్‌ను ప్రకటించింది. అధికారిక ప్రకటన ఆలస్యమైనా.. అంతర్గతంగా సమాచారం ఇవ్వడంతో ఆయన అప్పటికే ప్రచారాన్ని ప్రారంభిం చారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కారుదే జోరు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చేశాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదువుతోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించి జాతీయ నేతలను ఇక్కడకు ప్రచారానికి రప్పించాలని ఆ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. గిరిపుత్రుల మొగ్గు ఎటుంటే అటే.. అత్యధిక విస్తీర్ణం అడవులు కలిగి.. అడవిబిడ్డల అడ్డా అయిన ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఆదివాసీల ఓట్లే అభ్యర్థి గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే.. అందులో మూడు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగతా సెగ్మెంట్లలోనూ గిరిజనుల ప్రాబల్యం అధికమే. ఈ లోక్‌సభ స్థానం కూడా ఎస్టీ రిజర్వు కావడంతో పోటీచేసే అభ్యర్థులకు చెందిన సామాజిక వర్గాలే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గోండు, నాయక్పోట్, కొలామ్, లంబాడీ తెగలకు చెందిన వారి జనాభా అధికంగా ఉంది. తాజా ఎన్నికల్లో వీరి ఓట్లపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. వీరిని ఆకట్టుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల ఫలితం అభ్యర్థి వచ్చిన ఓట్లు జీ నగేశ్ 4,30,847 నరేశ్ 2,59,557 రమేశ్ రాథోడ్ 1,84,198 లోక్‌సభ ఓటర్లు పురుషులు 7,25,961 మహిళలు 7,52,649 ఇతరులు 52 మొత్తం 14,78,662 లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు - సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ (ఎస్టీ), ఖానాపూర్ (ఎస్టీ),ఆదిలాబాద్, బోథ్ (ఎస్టీ), నిర్మల్, ముథోల్. -
తొలి రోజు ఆరు నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లపర్వం మొదలైంది. తొలివిడత ఎన్నికలకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ (17 స్థానాలు), ఏపీ (25 స్థానాలు) సహా దేశంలోని 20 రాష్ట్రాల్లోని మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల తొలి విడత కింద ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను తొలి రోజు 5 స్థానాల పరిధిలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, కరీంనగర్ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బి.వినోద్‌కుమార్, ఆదిలాబాద్ స్థానానికి కాంగ్రెస్ తరఫున రమేశ్ రాథోడ్, పెద్దపల్లి స్థానానికి బీజేపీ తరఫున కొయ్యాడ స్వామి, ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున తాడేం రాజ్‌ప్రకాశ్, వరంగల్ స్థానం నుంచి బీఎస్పీ తరఫున బరిగల శివ తొలి రోజే నామినేషన్లు వేశారు. నాలుగో శనివారం సెలవే ! సెలవుదినాలు పోగా లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలకు మరో నాలుగు రోజులే మిగిలాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21న హోళి, 23న నాలుగో శనివారం నేపథ్యంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 24న ఆదివారం. దీంతో 21, 23, 24 తేదీల్లో సెలవులు రానుండడంతో నామినేషన్లు స్వీకరించరని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో నామినేషన్ల దాఖలకు 19, 20, 22, 25 తేదీలు మాత్రమే మిగిలాయి. -
మూడోసారి.. కష్టమే !
ఏ ఎదురీదుతున్న సిట్టింగ్ ఎంపీ రమేష్ రాథోడ్ ఏ టీఆర్ఎస్కు కలసి వచ్చిన అభ్యర్థి మార్పు ఏ ఏకమైన ఆదివాసి గిరిజనులు ఏ ఆదిలాబాద్ ఎంపీ ముఖ చిత్రంట ఆదిలాబాద్ సిట్టంగ్ ఎంపీ రమేష్ రాథోడ్ ఈ సారి ఎదురీదుతున్నారు. ఆయనకు టీఆర్ఎస్ అభ్యర్థి పెను సవాల్‌గా మారారు. ఆదివాసీ గిరిజనులు, లంబాడీల్లో చీలిక వచ్చింది. దాంతో రెండోసారి గెలవాలని రంగంలోకి దిగిన సిట్టింగ్ ఎంపీకి చెమటలు పడుతున్నాయి. ఇదీ స్వరూపం.. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల స్థానాలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మిగిలిన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్ అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్, టీఆర్ఎస్ నుంచి గొడెం నగేష్, టీడీపీ నుంచి రాథోడ్ రమేష్‌లు రంగంలో ఉన్నారు. వీరితో పాటు మరో ఆరు మంది పోటీ చేస్తున్నారు. కాగా ఈ పోటీలో టీఆర్ఎస్ కొంత ముందంజలో ఉండగా, రెండవ స్థానానికి టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎందుకంటే... రమేష్ రాథోడ్ మొదటిసారి 2009 ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి గెలవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే....రాజకీయ సమీకరణలు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. ముఖ్యంగా గత ఐదేళ్లుగా సిట్టింగ్ ఎంపీగా ఉండి తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఈ విషయంలో ఆదివాసీ గిరిజనుల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎస్టీలకు వచ్చే ప్రయోజనాలన్నీ లంబాడిలే ఎగరేసుకుపోతున్నారనే ఆవేదన ఆదివాసీల్లో నెలకొంది. ఈ సారి తమ వర్గం అభ్యర్థికే మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వారు వచ్చారు. పైగా టీడీపీ అంటే ప్రజల్లో కొంత వ్యతిరేక భావం నెలకొంది. పైగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటి వరకు పార్టీలో కొనసాగిన క్యాడర్ టీఆర్ఎస్ వైపు వెళ్లారు. అలాగే పొత్తు ఉన్న బీజేపీ నుంచి సరైన మద్దతు లభించడం లేదు. దాంతో రమేష్ రాథోడ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. టీఆర్ఎస్ తరపున పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న గోడెం నగేష్ బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి ఆయన అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ రంగంలోకి దిగారు. ఇతను ఆదివాసీ గిరిజన వర్గానికి చెందడంతో నియోజకవర్గంలోని ఆ వర్గ ప్రజల ఆదరణ పొందుతున్నారు. అయితే...ఆయనకు బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఈ విషయాన్ని అంచనా వేసే....అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారనే వాదన ఉంది. దాంతో పాటు పాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా ఉన్నారు. ముఖ్యంగా సిర్పూర్ నుంచి కవేటి సమ్మయ్య, ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, నిర్మల్ నుంచి కె. శ్రీహరిరావు, ముథోల్ నుంచి వేణుగోపాలాచారి వంటి వారి వల్ల ఎంపీ అభ్యర్థికి మరింత మేలు జరిగే అవకాశం ఉంది. పైగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల బట్టి వేరే పార్టీలకు ఓట్లు వెళ్లినా....పార్లమెంట్ స్థానానికి వచ్చే సరికి టీఆర్ఎస్కు మొగ్గు చూపే (క్రాస్ ఓటింగ్) అవకాశం ఉంది. ఉదాహరణకు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు లంబాడా వర్గం వారిని పోటీకి నిలబెట్టాయి. దాంతో ఇక్కడ మెస్రం ఆనందరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి ఈయనను బలపరిచి, పార్లమెంట్‌కు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే మూడ్‌లో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నగేష్ పార్లమెంట్‌కు పోటీ చేయడం ఇదే మొదటిసారి. దాంతో ఆదివాసీ గిరిజనులు ఈయన వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రమేష్ రాథోడ్ ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. కొంత వ్యతిరేకత ఉంది. పైగా పార్టీ పరిస్థితి కూడా అప్పటి మాదిరిగా లేదు. దాంతో కష్టాలు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరే ష్ జాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఆసిఫాబాద్ పోటీలో ఉన్న ఆత్రం సక్కు, ముధోల్ నుంచి విఠల్‌రెడ్డి వంటి వారు తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దాంతో రెండో స్థానానికి టీఆర్ఎస్తో పోటీ పడే పరిస్థితి నెలకొంది. -
ఎంపీకి తెలంగాణ సెగ
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు తెలంగాణ సెగ తగిలింది. పల్లెనిద్రలో భాంగా ఖానాపూర్‌కు వచ్చిన ఆయనను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, టీఆర్ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్ మండలంలో పల్లెనిద్రలో భాగంగా ఎంపీ రమేశ్ రాథోడ్ ఆదివారం పర్యటించారు. ముందుగా తర్లపాడ్‌లో ఎంపీ టీడీపీ జెండావిష్కరించారు. అనంతరం సత్తన్‌పల్లి గ్రామంలోని 222 ప్రధాన రహదారి పక్కనే జెండా ఎగురవేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు సత్తన్‌పల్లిలో జెండావిష్కరణ సమయంలో గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు నగేశ్, రమేశ్, అనసూయ తదితరులు జెతైలంగాణ నినాదాలు చేశారు. చంద్రబాబు తెలంగాణపై దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని, పల్లెనిద్ర పేరటి పర్యటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని లేదంటే ఇక్కడి నుంచి వెల్లిపోవాలంటూ ఎంపీ ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులను చెదరగొట్టారు. దీంతో ఎంపీ ప్రసంగాన్ని ఆపేసి దగ్గరలో ఉన్న బస్టాండ్‌లో కూర్చుకున్నాడు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో చేసేదిలేక ఎంపీ అక్కడి నుంచి బీర్నందికి వెళ్లారు. కాసేపటికి టీడీపీ జెండా తొలగించారని తెలియడంతో వాహనాలను సత్తన్‌పల్లికి తిరిగి మళ్లించారు. ఎంపీ అక్కడికి చేరుకుని జెండా పడివుండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో టీడీపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పొలీసులు ఇరువురిని సముదాయించారు. దీంతో ఎంపీ రెండోసారి జెండా ఎగురవేయగా జెండా తొలగించివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. పొలీసులు సముదాయించడంతో అక్కడి నుంచి టీడీపీ నాయకులు తిరిగి జెండా పండుగ కార్యక్రమానికి వెనుదిరిగారు. అక్కడి నుంచి పాత ఎల్లాపూర్ గోసంపల్లెలో రహదారిపై ఎంపీని ఇరుగ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. పంచాయతీ పరిధిలోని గోసంపల్లెలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్య పట్టించుకోవడం లేద ంటు సమస్యలపై ఇరుగ్రామాల ప్రజలను నిలదీశారు. 15 ఏళ్లుగా ఖానాపూర్ టు బెల్లాల్‌కు రోడ్డు కనీసం మరమ్మతు చేయించడం లేదని మీచుట్టు ఏళ్లుగా తిరిగినా పట్టించుకొనిది మీరు ఇప్పుడెందుకు వచ్చారంటూ ఎంపీని అడ్డుకొని ఎంపీ గోబ్యాక్ అంటూ నాయకులు చరణ్, శోభన్, మదు, లక్ష్మిపతి, నూనె రాజేశ్వర్, మాజీ ఎంపీపీ నాగుల శంకర్‌గౌడ్‌లు నినాదాలు చేశారు. గ్రామానికి రానివ్వమంటు రోడ్డుపై బైఠాయించారు. ఎంపీ సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు