సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లపర్వం మొదలైంది. తొలివిడత ఎన్నికలకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ (17 స్థానాలు), ఏపీ (25 స్థానాలు) సహా దేశంలోని 20 రాష్ట్రాల్లోని మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల తొలి విడత కింద ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను తొలి రోజు 5 స్థానాల పరిధిలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, కరీంనగర్ స్థానానికి టీఆర్‌ఎస్ తరఫున బి.వినోద్‌కుమార్, ఆదిలాబాద్ స్థానానికి కాంగ్రెస్ తరఫున రమేశ్ రాథోడ్, పెద్దపల్లి స్థానానికి బీజేపీ తరఫున కొయ్యాడ స్వామి, ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున తాడేం రాజ్‌ప్రకాశ్, వరంగల్ స్థానం నుంచి బీఎస్పీ తరఫున బరిగల శివ తొలి రోజే నామినేషన్లు వేశారు.
నాలుగో శనివారం సెలవే !
సెలవుదినాలు పోగా లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలకు మరో నాలుగు రోజులే మిగిలాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21న హోళి, 23న నాలుగో శనివారం నేపథ్యంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 24న ఆదివారం. దీంతో 21, 23, 24 తేదీల్లో సెలవులు రానుండడంతో నామినేషన్లు స్వీకరించరని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో నామినేషన్ల దాఖలకు 19, 20, 22, 25 తేదీలు మాత్రమే మిగిలాయి.
Comments
Please login to add a commentAdd a comment