మూడోసారి.. కష్టమే ! | Third ..   It is difficult! | Sakshi
Sakshi News home page

మూడోసారి.. కష్టమే !

Published Sun, Apr 27 2014 1:13 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

మూడోసారి..  కష్టమే ! - Sakshi

మూడోసారి.. కష్టమే !

ఏ    ఎదురీదుతున్న సిట్టింగ్ ఎంపీ రమేష్ రాథోడ్
ఏ    టీఆర్‌ఎస్‌కు కలసి వచ్చిన అభ్యర్థి మార్పు
ఏ    ఏకమైన ఆదివాసి గిరిజనులు
ఏ    ఆదిలాబాద్ ఎంపీ ముఖ చిత్రంట


ఆదిలాబాద్  సిట్టంగ్ ఎంపీ రమేష్ రాథోడ్ ఈ సారి ఎదురీదుతున్నారు. ఆయనకు టీఆర్‌ఎస్ అభ్యర్థి పెను సవాల్‌గా మారారు. ఆదివాసీ గిరిజనులు, లంబాడీల్లో చీలిక వచ్చింది. దాంతో రెండోసారి గెలవాలని రంగంలోకి దిగిన సిట్టింగ్ ఎంపీకి చెమటలు పడుతున్నాయి.

 ఇదీ స్వరూపం..

 ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల స్థానాలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మిగిలిన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్ అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్, టీఆర్‌ఎస్ నుంచి గొడెం నగేష్, టీడీపీ నుంచి రాథోడ్ రమేష్‌లు రంగంలో ఉన్నారు. వీరితో పాటు మరో ఆరు మంది పోటీ చేస్తున్నారు. కాగా ఈ పోటీలో టీఆర్‌ఎస్ కొంత ముందంజలో ఉండగా, రెండవ స్థానానికి టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
 
ఎందుకంటే...

 రమేష్ రాథోడ్ మొదటిసారి 2009 ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి గెలవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే....రాజకీయ సమీకరణలు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. ముఖ్యంగా గత ఐదేళ్లుగా సిట్టింగ్ ఎంపీగా ఉండి తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఈ విషయంలో ఆదివాసీ గిరిజనుల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎస్టీలకు వచ్చే ప్రయోజనాలన్నీ లంబాడిలే ఎగరేసుకుపోతున్నారనే ఆవేదన ఆదివాసీల్లో నెలకొంది. ఈ సారి తమ వర్గం అభ్యర్థికే మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వారు వచ్చారు. పైగా టీడీపీ అంటే ప్రజల్లో కొంత వ్యతిరేక భావం నెలకొంది. పైగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటి వరకు పార్టీలో కొనసాగిన క్యాడర్ టీఆర్‌ఎస్ వైపు వెళ్లారు. అలాగే పొత్తు ఉన్న బీజేపీ నుంచి సరైన మద్దతు లభించడం లేదు. దాంతో రమేష్ రాథోడ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.
 టీఆర్‌ఎస్ తరపున పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న గోడెం నగేష్ బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి ఆయన అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ రంగంలోకి దిగారు. ఇతను ఆదివాసీ గిరిజన వర్గానికి చెందడంతో నియోజకవర్గంలోని ఆ వర్గ ప్రజల ఆదరణ పొందుతున్నారు.

అయితే...ఆయనకు బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఈ విషయాన్ని అంచనా వేసే....అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారనే వాదన ఉంది. దాంతో పాటు పాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు బలంగా ఉన్నారు. ముఖ్యంగా సిర్పూర్ నుంచి కవేటి సమ్మయ్య, ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, నిర్మల్ నుంచి కె. శ్రీహరిరావు, ముథోల్ నుంచి వేణుగోపాలాచారి వంటి వారి వల్ల ఎంపీ అభ్యర్థికి మరింత మేలు జరిగే అవకాశం ఉంది. పైగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల బట్టి వేరే పార్టీలకు ఓట్లు వెళ్లినా....పార్లమెంట్ స్థానానికి వచ్చే సరికి టీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపే (క్రాస్ ఓటింగ్) అవకాశం ఉంది. ఉదాహరణకు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు లంబాడా వర్గం వారిని పోటీకి నిలబెట్టాయి. దాంతో ఇక్కడ మెస్రం ఆనందరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి ఈయనను బలపరిచి, పార్లమెంట్‌కు టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే మూడ్‌లో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నగేష్ పార్లమెంట్‌కు పోటీ చేయడం ఇదే మొదటిసారి. దాంతో ఆదివాసీ గిరిజనులు ఈయన వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రమేష్ రాథోడ్  ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. కొంత వ్యతిరేకత ఉంది. పైగా పార్టీ పరిస్థితి కూడా అప్పటి మాదిరిగా లేదు. దాంతో కష్టాలు తప్పడం లేదు.
  
కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి నరే ష్ జాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఆసిఫాబాద్ పోటీలో ఉన్న ఆత్రం సక్కు, ముధోల్ నుంచి విఠల్‌రెడ్డి వంటి వారు తప్ప మిగిలిన  అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దాంతో రెండో స్థానానికి టీఆర్‌ఎస్‌తో పోటీ పడే పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement