మేడ్చల్‌లో హస్తం హల్‌చల్ | favorite to congress from medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో హస్తం హల్‌చల్

Published Sun, Apr 27 2014 1:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మేడ్చల్‌లో హస్తం హల్‌చల్ - Sakshi

మేడ్చల్‌లో హస్తం హల్‌చల్

అభివృద్ధే మంత్రంగా కాంగ్రెస్ 
తెలంగాణవాదాన్నే నమ్ముకున్న టీఆర్‌ఎస్
అయోమయంలో టీడీపీ
వైఎస్ సంక్షేమ పథకాలే అండగా ముందుకెళ్తున్న వైఎస్సార్ సీపీ

 
 శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. పట్టణ, గ్రామ ప్రాంతాల మిళితమైన ఈ నియోజకవర్గంలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్), టీడీ పీ అభ్యర్థిగా తోటకూర జంగయ్యయాదవ్, టీఆర్‌ఎస్ నుంచి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ బలపర్చిన డాక్టర్ బీవీ ప్రకాశ్ వంజరి బరిలో ఉన్నారు.
 
అభివృద్ధే గెలిపిస్తుందని..


 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయతీరాలకు చేరుస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ ధీమాగా ఉన్నారు. లీడ్ ఇండియా ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, కేఎల్లార్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రతీ ఇంటికీ రక్షిత మంచినీరు అందించడం వంటివి ఆయనకు సానుకూలంగా మారా యి. జిల్లాలోనే అత్యధికంగా రూ. 1300కోట్ల నిధులు రాబట్టిన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కేఎల్లార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే సొంత పార్టీలోనే కొందరు నేతలు వేరుకుంపటి పెట్టడం ఆయనను ఆందోళనకు గురి చేసి నా అంతిమంగా కేఎల్‌ఆర్‌కు విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు తోడు తెలంగాణ తెచ్చిన పార్టీ అభ్యర్థిగా పోటీచేయడం లక్ష్మారెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది.
 
 బుజ్జగింపులతోనే సరి


 తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక్కడ దారుణంగా తయారైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జి నక్కా ప్రభాకర్‌గౌడ్ టీఆర్‌ఎస్ గూటికి చేరడం, సీనియర్లు అలకపాన్పు ఎక్కడంతో ఆ పార్టీ అభ్యర్థి తోట కూర జంగయ్య యాదవ్‌కు అసంతుష్టులను బుజ్జగించడంతోనే సరిపోతోంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న తన సామాజికవర్గం ఓట్లతో గట్టెక్కుతాననే ధీమాలో ఉన్నా రు. అయితే నేతల మధ్య సమన్వయలేమి, కొందరు దిగువశ్రేణి నాయకులు ‘కారె’ క్కడం టీడీపీని కలవరపరుస్తోంది.

 స్పీడు పెంచిన ‘కారు’

 టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి టీఆర్‌ఎస్‌కు కొంత కలి సొచ్చే అవకాశంగా మారినా, అవి ఓట్ల రూపంలో ఎంత వరకు లాభిస్తుందో లేదోనని గులాబీ శ్రేణుల్లో అనుమా నాలు నెలకొన్నాయి. తెలుగుతమ్ముళ్లు కొందరు ‘కారె’క్కడంతో తమకు కలిసి వస్తుందని గులాబీ శిబిరం భావి స్తోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి  నక్కా ప్రభాకర్‌గౌడ్ తమ పంచన చేరడం తనకు అనుకూలమవుతుందని టీఆర్‌ఎస్ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డికి అంచనా వేస్తున్నాడు. కాగా ఆయన ముక్కుసూటితనం కొంత ప్రభావం చూపనుంది.
 
వడివడిగా వైఎస్సార్ సీపీ

 వైఎస్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ఓటర్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థివైపు చూస్తుండడం అన్ని పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం డాక్టర్ బీవీ ప్రకాశ్ వంజరికి అనుకూలాంశంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు ఇది కొంత ఇబ్బందిగా మారింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement