పనిచేసే వారి చేతికే గులాబీ
- గ్రేటర్ అధ్యక్ష పదవిపై కేసీఆర్ యోచన
- సీనియర్లకే ఇవ్వాలని కోరుతున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికే తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక వీలైనంత వేగంగా ఆ పదవిని భర్తీ చేసి, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఉన్న కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది.
నాయిని నర్సింహారెడ్డి, ఆ తరువాత టి.పద్మారావు గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇటీవల పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా పనిచేయకపోవడంతో పార్టీ విస్తరణ కూడా జరగలేదని పార్టీ అధినేత కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేసే వారికే గ్రేటర్ బాధ్యతలను అప్పగించాలని, పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. అయితే పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న వారికే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో శనివారం పార్టీ గ్రేటర్ నేతలు ఎన్.కపిల్‌రాజ్ నాయకత్వంలో ముఖ్యనేతలు కె.తారక రామారావు, టి.హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, టి.పద్మారావు తదితరులను కలిసి సీనియర్లకే అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తున్న కపిల్ రాజ్ పేరుకు అధ్యక్ష పదవిని పరిశీలించాలని కోరారు. ఈ మేరకు కేసీఆర్‌ను కూడా ఆదివారం కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.