ఆదిలాబాద్‌..తగ్గిన పోలింగ్‌ | Adilalabad Polling In General elections | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌..తగ్గిన పోలింగ్‌

Published Fri, Apr 12 2019 1:15 PM | Last Updated on Fri, Apr 12 2019 1:15 PM

Adilalabad Polling In General elections - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఓట్ల పండగ ముగిసింది.. తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్‌లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగియగా, ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ముథోల్, ఖానాపూర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

నిర్దేశిత సమయానికి పోలింగ్‌ కేంద్రాల్లో వరుసలో ఉన్నవారిని సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. రాత్రి 8.30 గంటల వరకు కూడా పోలింగ్‌ శాతం వివరాలు అన్ని నియోజకవర్గాల నుంచి రాలేదు. సాయంత్రం 5గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం 66.76 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. దేశంలో ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా తొలి విడతలో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం మరో 42 రోజులు వేచి చూడాల్సిందే.

తగ్గిన పోలింగ్‌ శాతం..
గత 2014 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోలింగ్‌ శాతం తగ్గింది. అదే సమయంలో గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతానికంటే ఈ ఎన్నికల్లో 
ఓట్ల శాతం తక్కువగా నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 10 శాతం తక్కువ నమోదైంది. ఇక శాసనసభ ఎన్నికలకంటే 13 శాతం తక్కువగా నమోదైంది. 

పోలింగ్‌ సరళి..
ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఉండడంతో పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయమే ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సమయంలోనే కేంద్రాల్లో ఓటర్లు వరుస కట్టిన దృశ్యాలు కనిపించాయి. అయితే ఉదయం ఆశించిన స్థాయిలో ఓటర్లు తమ ఓటును వేయలేకపోయారు. 11గంటల వరకు 30 శాతం లోపల పోలింగ్‌ నమోదైంది.

ఆ తర్వాత ఎండకు ఓటర్లు బయటకు రాకపోవడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీ కనబడలేదు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల్లోపు పలువురు ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడంతో కొద్దిగా పోలింగ్‌ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరైతే వరుసలో ఉన్నారో వారిని ఓటేసేందుకు అనుమతించి పోలింగ్‌ కేంద్రాల గేట్లు మూయించారు. 

ఓటు వేసిన ప్రముఖులు..
లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేశ్‌ బజార్‌హత్నూర్‌ మండలం జాతర్లలో ఓటు వేశారు. బోథ్‌ మండలం ఘన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ ఉట్నూర్‌లో సాయంత్రం 4.50 గంటలకు ఓటు వేశారు.

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆయన సహాయకుడితో కలిసివచ్చి ఓటు వేశారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం దీపాయిగూడలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ మండల కేంద్రంలో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, ముథోల్‌ నియోజకవర్గం దేగాంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప, ఖానాపూర్‌లో రేఖానాయక్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో తిర్యాణి మండలం లక్మీపూర్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక అధికారుల పరంగా చూస్తే ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్, పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దివ్యదేవరాజన్‌ దంపతులు, ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్, జేసీ సంధ్యారాణి ఆదిలాబాద్‌లో ఓటు వేశారు. నిర్మల్‌లో కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ సి.శశిధర్‌రాజు, కుమురంభీం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి ఓటు వేశారు.

ఆదిలాబాద్‌కు ఈవీఎంలు..
ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను పోలింగ్‌ అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి తరలించి స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తున్నారు. రాత్రి వరకు కొన్ని నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు చేరుకున్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి అర్ధరాత్రి వరకు ఈవీఎంలు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరుస్తున్నారు.

మే 23న ఫలితాలు వెలవడనున్నాయి. ఎక్కువ రోజుల వ్యవధి ఉండడంతో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు మూడంచెల భద్రత వ్యవస్థను కల్పించారు. డీఎస్పీ స్థాయి అధికారితో భద్రతను పర్యవేక్షించనున్నారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. 

ఓటరు ఎటువైపో..
ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆ సరళిని బట్టి పార్టీలు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల్లో పార్టీల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమై చర్చించారు. ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయోనని వారిలో ఉత్కంఠ ఉంది. ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చారు.

ఎస్టీ రిజర్వ్‌ నియోజకవర్గమైన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు గోడం నగేశ్, సోయం బాపూరావులు గిరిజనుల్లోని ఒక తెగకు చెందినవారు కావడంతో ఈ ఓట్లు చీలిపోయి మరో తెగకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ లాభం చేకూర్చవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొందన్న చర్చ సాగుతోంది. మరో పార్టీకి నామమాత్రంగా ఓట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మే 23 వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సిందే.

మహిళలే అధికం..
పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్‌ వందశాతం పోలింగ్‌ లక్ష్యం పెట్టుకున్నప్పటికీ నెరవేరలేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడల్, మహిళ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళ పోలింగ్‌ కేంద్రాలతో పాటు జనరల్‌ పోలింగ్‌ కేంద్రాల్లోనూ మహిళలే అధికంగా ఓటు వేస్తూ కనిపించారు.                

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement