సిట్టింగ్‌ స్థానంలో ఎందుకీ పరిస్థితి..? | - | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ స్థానంలో ఎందుకీ పరిస్థితి..?

Published Thu, Mar 21 2024 2:05 AM | Last Updated on Thu, Mar 21 2024 9:29 AM

- - Sakshi

బీజేపీ పార్లమెంట్‌ స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు దూరం

టికెట్‌ దక్కని ఎంపీ ‘సోయం’ కూడా గైర్హాజరు

మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సైతం..

క్యాడర్‌లో అయోమయం

సాక్షి, ఆదిలాబాద్‌: కమలం పార్టీలో ముసలం మొదలైంది. బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాజాగా కేంద్ర మంత్రి జిల్లా ప ర్యటనలో బహిర్గతమయ్యాయి. అయితే పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలందరి ఏకాభిప్రాయంతోనే పార్టీ అభ్యర్థి ఎంపిక జరిగిందని కమలం నేతలు చెప్పుకొచ్చారు. కార్యకర్తలూ అదే కావచ్చని అనుకున్నారు.

ఆ తర్వాత టికెట్‌ ఆశించిన ఆశావహుల్లో కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అభ్యర్థి గెలుపునకు దోహద పడతామని చెప్పుకుంటూ వచ్చారు. కొంత మంది సైలెంట్‌గా ఉన్నారు. మరోవైపు చివరిదాకా టికెట్‌ ఆశించి భంగపడ్డ సి ట్టింగ్‌ ఎంపీ సోయం అలక బూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి వీరందరిని సమన్వయపర్చి ఏకతాటిపైకి తీసుకొచ్చేప్రయత్నం జరుగుతుందా అంటే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలేమి కనిపించడం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది.

అందరూ డుమ్మా..
బీజేపీ పార్లమెంట్‌ స్థాయి సమావేశం తలమడుగు మండలం ఉండంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా హాజ రయ్యారు. పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొనాలి. అయితే నిర్మల్‌, ముథోల్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు ప టేల్‌, హరీష్‌బాబు రాలేదు. సిట్టింగ్‌ ఎంపీ సో యం కూడా దూరంగా ఉన్నారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు సైతం గైర్హాజరవడం గమనార్హం. దీంతో అసలు ఏం జరుగుతుందోనని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

ఏకతాటిపైకి తెచ్చేదెవరు..?
మార్చి 10న ఢిల్లీ నుంచి విడుదలైన బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ స్థానం నుంచి నగేశ్‌ పేరు వెల్లడైంది. అంతకు నాలుగు రో జుల ముందే ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి కమలం పా ర్టీలో చేరారు. ఈ క్రమంలో నగేశ్‌కు టికెట్‌ ఇవ్వొద్ద ని పార్టీలోని పలువురు సీనియర్లు, ఆశావహులు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి విన్నవించారు. అయినప్పటికీ పార్టీ నగేశ్‌ వైపే మొగ్గుచూపింది. అయితే టికెట్‌ ఖరారైన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి హైదరాబాద్‌ నుంచి వస్తున్న అభ్యర్థి నగేశ్‌కు మొదట నిర్మల్‌ జిల్లా సోన్‌ వద్ద పార్టీ శ్రేణులు స్వా గతం పలకాలి.

కానీ అలాంటిదేమి కనిపించలేదు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ వద్ద ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారనేది కార్యకర్తల్లో నెలకొంది. ప్రస్తుతం ఆదిలా బాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్టీగా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఉన్నారు. బుధవారం పార్లమెంట్‌ స్థాయి సమావేశం ఉందని ఆదిలాబాద్‌ పట్టణ కార్యదర్శి వేదవ్యాస్‌ నుంచి ప్రకటన జారీ కావడంపై పార్టీ సీనియర్‌ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ స్థాయి సమావేశ ఆహ్వానం ఇలా పట్టణ కార్యదర్శి నుంచి జారీ కావడమేంటా అని విస్తుపోతున్నారు.

ఆ ఆహ్వానంలో ఎమ్మెల్యే శంకర్‌, అభ్యర్థి నగేశ్‌ పాల్గొంటున్నారని, కేంద్ర మంత్రి వస్తున్నారని పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు ఇందులో పొందుపర్చలేదనేది సామాన్య కార్యకర్త ప్రశ్నించే పరిస్థితి. ఈ లెక్కన పార్లమెంట్‌ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న శంకర్‌ అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదా.. లేనిపక్షంలో ఈ వ్యవహారం తనది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అనే సందిగ్ధం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

‘సోయం’కు బుజ్జగింపులు
సిట్టింగ్‌ స్థానం నుంచి తిరిగి టికెట్‌ దక్కకపోవడంతో అలకబూనిన సోయం బాపూరావును ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కలిసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. కేంద్రంలో మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

అయితే ఈ విషయంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చెప్పించాలని సోయం చెప్పడంతో దానికి కిషన్‌రెడ్డి సరే అన్నట్టు పార్టీలో ప్రచారం ఉంది. అదే జరిగితే తాను నగేశ్‌ పక్షాన ప్రచారానికి వెళ్లే విషయాన్ని పరిశీలిస్తానని కిషన్‌ రెడ్డికి సోయం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోయం బుజ్జగింపుల వరకే రాష్ట్ర నాయకులు పరిమితమవుతారా.. లేనిపక్షంలో ఈ పార్లమెంట్‌ పరిధిలోని ఇతర అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిందే.

ఇవి చదవండి: నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement