కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం
‘హస్తం’ హైకమాండ్ పాజిటివ్‌గా ఉందనే టాక్
ఆదిలాబాద్ స్థానం పెండింగ్‌తో మొదలైన చర్చ
పోటీలో ఉండటం ఖాయమంటున్న సిట్టింగ్ ఎంపీ
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్‌గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీజేపీ టికెట్ గొడం నగేశ్‌కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం.
సీనియర్ నేతలను ఢీకొట్టగలరా..
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు.
అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్‌గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్‌కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది.
మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ..
రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్‌కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం.
మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు.
ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment