కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినట్లు వెల్లడి
మహారాష్ట్రలోని కిన్వట్ ఎమ్మెల్యే ద్వారా రాయబారం
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని నడ్డా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్వ తంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని సోయం ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
రాజీకి రాష్ట్ర నేతల యత్నం..
బీజేపీ ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోయంను బుజ్జగించే యత్నం చేశారు. కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి హామీ ఇచ్చారు. అప్పు డే సోయం తనకు నడ్డా లేనిపక్షంలో బీఎల్ సంతోష్ ద్వారా హామీ ఇచ్చినట్లయితే పరిశీలన చేస్తానన్నారు.
విషయాన్ని కొద్ది రోజులు నాన్చడంతో ఈ హామీ లభించకపోవచ్చనే ప్రచారం జరిగింది. ఇది లా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ బాధ్యులతో కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ రోజు తెలంగాణ ఇన్‌చార్జి సునిల్ బన్సల్ కూడా అందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోయంను పార్టీ ఆఫీస్‌లో చర్చలకు పిలిచినా ఆయన హాజరుకాలేదు.
మహారాష్ట్ర ఎమ్మెల్యే ద్వారా రాయబారం..
ఎంపీ సోయంతో రాష్ట్ర నేతల రాజీయత్నాలు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి.. మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవిస్ ద్వారా ఎంపీ సోయం బంధువు అయిన కిన్వట్ ఎమ్మెల్యే కేరం భీంరావుతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగి సోయంను చర్చల కోసం శుక్రవారం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నడ్డాను ఈ నేతలు కలిశారు. ఈ విషయంపై సోయం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు పేర్కొన్నా రు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నామినేటెడ్ పదవి విషయంలో హామీ ఇచ్చారని వివరించారు.
ఇవి చదవండి: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment