మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్
ఆదిలాబాద్: బీజేపీ విలువలతో కూడిన పార్టీ అని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో చేరడం గర్వంగా ఉందని మాజీ ఎంపీ, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని ఎస్‌ఎస్.కాటన్‌లో ఎమ్మెల్యే రామారావుపటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలిచిందన్నారు.
ఆర్థికంగా ఐదోస్థానంలో నిలిపిన ఘనత మోదీకి దక్కుతుందని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని, అత్యధిక స్థానాలు గెలుచుకుని మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముందన్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని, నాయకులు, కార్యకర్తలు సహకరించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై తనపై కొందరు అపోహలు ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో పార్టీ నిర్ణయం మేరకే పనిచేశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధత, నిజాయితీతో పనిచేశానని గుర్తు చేశారు.
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి..
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రామారావుపటేల్ కోరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, కానీ తాను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నియోజకవర్గానికి రూ.140 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీని గెలిపించుకుని కేంద్రం నిధులతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. సమావేశంలో నాయకులు బి.గంగాధర్, సోలంకి భీంరావు, సావ్లి రమేశ్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment