నగేశ్ చేరికతో బీజేపీలో ముసలం
ఢిల్లీ అగ్రనేతలతో పార్లమెంట్ పరిధిలోని నేతల భేటీ
పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యమివ్వాలని వినతి
‘గొడం’ టికెట్ నో అనే ప్రచారం
సిట్టింగ్‌కేనా.. ఇతరులకా..?
సాక్షి,ఆదిలాబాద్: మాజీ ఎంపీ గొడం నగేశ్ బీజేపీలో చేరికతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా కలిసి ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో సోమవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఇదిలా ఉంటే లంబాడాలను పరిగణలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గం నేతలు విన్నవించారు.
పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి బీఎల్ సంతోష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌ను వారు కలిశారు. కాగా గొడంకు టికెట్ ఇవ్వమని అగ్రనేతలు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీకా.. లేనిపక్షంలో ఇతర నేతలను ఆదిలాబాద్ స్థానానికి పరిగణలోకి తీసుకుంటారా అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
సంజాయిషీ ఇచ్చారనే ప్రచారం..
ఢిల్లీ వెళ్లిన లంబాడా నేతలు తమకు టికెట్ ఇవ్వాలని అడుగుతూనే మరోపక్క ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో గొడం నగేశ్‌ను పార్టీలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఓ ఎమ్మెల్యే ఇక్కడ ఒంటరయ్యారన్న ప్రచారం సాగుతోంది.
మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ టికెట్ నగేశ్‌కు ఇవ్వాలని నేను చెప్పలేదని ఒంటరైన ఆ ఎమ్మెల్యే జిల్లా నేతలకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టాన నిర్ణయమేనని ఆ ఎమ్మెల్యే జిల్లా నేతలతో చెప్పుకొచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఏదేమైనా బీజేపీలో రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఢిల్లీలో సందడి..
మాజీ ఎంపీ గొడం నగేశ్ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కాషాయ కండువా కప్పుకున్న విషయం విదితమే. ఆయన పార్టీలో చేరిన మరుసటి రోజే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్‌బాబు, హరినాయక్ జట్టుగా హస్తీనకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రభారి మయూర్ చంద్ర, మరో ఒకరిద్దరు నేతలు కలిసి మరో జట్టుగా దేశ రాజధానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ బీఎల్ సంతోష్, డాక్టర్ లక్ష్మణ్‌ను కలిశారు. కాగా ఇందులో ఒక బృందానికి అగ్రనేతలు గొడం నగేశ్‌కు టికెట్ ఇవ్వమని చెప్పినట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది.
అయితే ఇందులో ఎవరికీ టికెట్ ఇస్తామనే విషయంలో అగ్రనేతలు ఎలాంటి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. లంబాడాల ఓట్లు లక్షన్నర వరకు ఉన్న దృష్ట్యా టికెట్ ఇస్తే గెలుస్తామని రాథోడ్ రమేశ్, రాథోడ్ బాపూరావు, రాథోడ్ జనార్దన్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉందని చెప్పినట్లు సమాచారం. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని, సీటు ఇవ్వొద్దని నేతలంతా ముక్తకంఠంతో కోరినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆ తర్వాత నేతలు ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి ఉండటం గమనార్హం. కాగా ఎంపీ సోయం బాపూరావు ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు. నగేశ్ చేరిక తర్వాత ఆయన సైలెంట్‌గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment