సాక్షి, ఆదిలాబాద్: బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా.. బీజేపీలో చేరడమా అనే విషయంలో మాజీ ఎంపీ గోడం నగేశ్ తర్జనభర్జన పడుతున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నుంచి బోథ్ అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైంది. నెల క్రితం సీఎం కేసీఆర్ నుంచి పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయన పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే బోథ్ టికెట్‌తో పాటు తన అనుచరులు, కార్యకర్తలకు ఆ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే చేరుతారనే కండిషన్‌తో బీజేపీ పెద్దలతో చర్చించారనే ప్రచారం నడిచింది. బీజేపీ పరంగా సిట్టింగ్ ఎంపీలకు వారి సొంత నియోజకవర్గాల్లో అసెంబ్లీ నుంచి పోటీకి నిలిపే అవకాశాలు ఉంటాయని అధిష్టానం నుంచి విధివిధానాలు ఉండడంతో ఆయనకు టికెట్ పరంగా స్పష్టమైన హామీ లభించలేదనే ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే నియోజకవర్గం నుంచి బీజేపీకి దరఖాస్తు పరంగా ఎంపీ సోయం బాపురావు దూరంగా ఉండటం ఆయన కుమారుడు సోయం వెంకటేశ్‌ను రంగంలోకి దించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గోడం నగేశ్ బోథ్ టికెట్ కోసం బీజేపీ పార్టీ పరంగా కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో కలిసి అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది.
కేటీఆర్‌తో భేటీ..
అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏయే నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నారో అక్కడ పరిస్థితి చక్కదిద్దే విషయంలో ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లలో అసంతృప్తిదారులతో భేటీ సఫలం కావడం వెనుక పార్టీ పరంగా భవిష్యత్తులో తోడ్పాటు ఉంటుందనే హామీలే కారణమని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నతో కలిసి హైదరాబాద్ వెళ్లిన గోడం నగేశ్ కేటీఆర్‌ను కలిశారు. ఈ భేటీలో నగేశ్‌కు భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని, దానికి సంబంధించి జిల్లాలో పర్యటన సందర్భంగా స్పష్టమైన హామీ ఇస్తామని చెప్పినట్లు ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపునకు కృషి చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. ప్రధానంగా గోండు సామాజిక వర్గానికి చెందిన గోడం నగేశ్ సేవలను పార్టీలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే బీఆర్‌ఎస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీల ఓట్లు అధికంగా ఉండటంతో పార్టీ ఈమేర ఆలోచన చేసినట్లు ప్రచారం సాగుతోంది.
అంతర్మథనం..
అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ గోడం నగేశ్‌లో అంతర్మథనం కొనసాగుతుందని ప్రచారం సాగుతుంది. మరో వైపు కాంగ్రెస్‌లో చేరిక విషయంలోనూ ఆయన సందిగ్ధపడుతున్నారని చెప్పుకుంటున్నారు.
ప్రధానంగా ఆ పార్టీలో ప్యారాచూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వరాదని ఇటీవల సీనియర్ నాయకుల డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ పార్టీలో చేరిక విషయంలోనూ సందిగ్ధపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా.. బీజేపీ లేని పక్షంలో కాంగ్రెస్‌లో చేరడమా వంటి అంశాల విషయంలో ఇటీవల కార్యకర్తలతో ఆయన టచ్‌లోకి వచ్చారనే విషయం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ అంశాల పరంగా సందిగ్ధతకు గోడం నగేశ్ తెరదించుతారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment