ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ | telugu desam party loss in adilabad | Sakshi
Sakshi News home page

ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ

Published Sat, May 17 2014 12:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

telugu desam party loss in adilabad

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన, చివరి ఘట్టం ముగిసింది. ప్రాదేశిక ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా జిల్లాలో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ‘కారు’ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. హోరాహోరీగా సాగిన పోరులో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్ల జయకేతనం ఎగురవేశారు. ఆదిలాబాద్, పెద్దపల్లి స్థానాలు కూడా భారీ మెజారిటీతో ఆ పార్టీ కైవసం చేసుకుంది.

 త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆదిలాబాద్ ఎంపీ గా గోడం నగేష్ 1,71,093 ఓట్ల భారీ మె జారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్‌పై గెలుపొందారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుం చి పోటీలో ఉన్న బాల్క సుమన్‌కు కూడా భారీ మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేక్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల  కు కూడా భారీ మెజారిటీ దక్కింది. ఆదిలాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన జోగు రా మన్న 14,715 మెజారిటీతో సమీప ప్రత్య ర్థి, బీజేపీ-టీడీపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై విజయం సాధించారు. చెన్నూరులోనల్లాల ఓదేలు 26,164 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్‌పై గెలుపొందారు. మంచిర్యాల నుంచి నడిపెల్లి దివాకర్‌రావుకు భారీ మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి జి.అరవింద్‌రెడ్డిపై 59,250 ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

 ఆసిఫాబాద్ (ఎస్టీ) స్థానం నుంచి కోవ లక్ష్మి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై 19,055 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖానాపూర్ (ఎస్టీ) నుంచి అజ్మీర రేఖ టీడీపీ అభ్యర్థి రాథోడ్ రితేష్‌పై 38,511 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బోథ్ నుంచి పోటీ చేసిన రాథోడ్ బాపూరావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనీల్‌జాదవ్‌పై కంటే 26,993 ఎక్కువ ఓట్లు సాధించి జయకేతనం ఎగురవేశారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య 52,528 భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌పై గెలుపొందారు. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో మంత్రి పదవులపై హ్యాట్రిక్ సాధించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన మిశ్రమ ఫలితాలు.. టీఆర్‌ఎస్ వర్గాలను ఆలోచనలో పడేసినప్పటికీ, ‘స్థానిక’ ఫలితాల్లో ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

 సార్వత్రిక ఫలితాలు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడంతో గులాబీ దండును ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది.

 రెండుచోట్ల దూసుకెళ్లిన ‘ఏనుగు’
 వ్యక్తిగత చరిష్మాతో  విజయం సాధించిన బీఎస్పీ అభ్యర్థులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలు సంచలనం సృష్టించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గాలిలో కూడా వీరు విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. నిర్మల్‌లో సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.శ్రీహరిరావుపై ఇంద్రకరణ్‌రెడ్డి 8,628 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిర్పూర్‌లో ఆయన అనుచరుడు కోనేరు కోనప్ప కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ ఇద్దరు కూడా జిల్లా కాంగ్రె స్‌లో చక్రం తిప్పిన ఉద్దండులైన నాయకులు ప్రేంసాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలను మట్టి కరిపించారు.

 విఠల్‌రెడ్డిది కూడా వ్యక్తిగత చరిష్మే..
 జిల్లాలో కాంగ్రెస్ ఒక్క ముథోల్ స్థానానికే పరిమితమైంది. ఆ పార్టీ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి వేణుగోపాలచారిపై 14,686 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్ గాలిలో కూడా విజయం సాధించిన విఠల్‌రెడ్డి కూడా వ్యక్తిగత ఛరిష్మేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీదా జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విఠల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించనున్నారు.

 ఉనికి కోల్పోయిన టీడీపీ..
 ఈ ఎన్నికల ఘోర పరాజయం పాలైన టీడీపీ జిల్లాలో ఉనికిని కోల్పోయింది. పొత్తులో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేసినప్పటికి ఒక్క స్థానాన్ని కూడా గెలుచు కోలేకపోయింది. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు, సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేష్‌తోపాటు, ఆయన తనయుడు రితేష్ కూడా ఓటమి పాలయ్యారు. వ్యక్తిగత చర్మిష్మా ఉన్న సోయం బాపురావు వంటి నాయకులు టీడీపీపై ఉన్న వ్యతిరేకతతో ఓటమి పాలయ్యారు.

 బీజేపీకి చుక్కెదురు
 తెలంగాణ బిల్లు ఆమోదానికి పార్లమెంట్‌లో మద్దతిచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆ పార్టీకి టీడీపీతో పొత్తు కారణంగా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దేశమంతటా వీచిన మోడీ గాలి కూడా ఆ పార్టీ అభ్యర్థులకు కలిసిరాలేదు. రెండు చోట్ల మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతే ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యునిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లోర్ లీడర్‌గా ఉన్న గుండా మల్లేష్ కూడా ఓటమి పాలయ్యారు. ఒక్క చోట ఆదిలాబాద్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సీపీఎంకు అక్కడ కూడా చుక్కెదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement