టీఆర్‌ఎస్‌లో చేరిన రమేష్ రాథోడ్
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని, అందుకే తెలంగాణలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయిందని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వాస్తవాలను గమనించకుండా విపక్షాలు మాట్లాడుతున్నాయంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత పైడిపల్లి రవీందర్ రావు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో 70వేల ఎకరాలకు నీళ్లిచ్చామని, బంగారు భూములు ఉన్న ఆదిలాబాద్‌లో అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు.
కొన్ని పార్టీల నేతలకు ఏమీ అర్ధం కావటం లేదని, అవాకులు చెవాకులు పేలుతున్నారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి, 60 ఏళ్లు ఏం చేశారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఏం చెప్పుకొని ఓటు అడుగుతారు. మీ పాలన తెలియదనిదా.. మీరు పైనుంచి దిగొచ్చారా అని నిలదీశారు.
కాంగ్రెస్ నాయకులకు గెలుస్తామనే విశ్వాసం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు పోండని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఎవరేంటో తెలుస్తుందని చెప్పారు..ఒక్క నిమిషం కూడా పోకుండా కరెంట్ ఇస్తున్నామన్నారు. ఈ ఒక్క విషయం చాలు టీఆర్‌ఎస్‌కుకు ఓటు వేయటానికి అని అన్నారు. కొన్ని చరిత్రాత్మక రాజకీయ సందర్భలుంటాయంటూ ఆయన ఉద్యమంలో తాను చెప్పిన మాటలు నిజమవుతున్నాయన్నారు.
తమకు 111 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని, అయితే వాస్తవాలు గ్రహించకుండా విమర్శలు చేయడం సరికాదని కేసీఆర్ అన్నారు. విపక్షాలకు డిపాజిట్ కూడా రాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగవని అన్నారు. త్వరలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఓ చరిత్ర అని కేసీఆర్ అన్నారు.
మీ బుర్రలు బోగస్.. బీజేపీపై ఫైర్
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందన్న తమ సర్వేను బీజేపీ నేతలు విమర్శించటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి 46 శాతం ప్రజలు మద్దతుందని తమ సర్వే చెప్పిందని బీజేపీ నేతలు అంటున్నారు.. మరి మా సర్వే బోగస్ అయితే వాళ్ల సర్వే కూడా అంతేనని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు. వారి బుర్రలు బోగస్ అని ఎద్దేవా చేశారు.